naibrahmin
-
నా పదవికి న్యాయం చేస్తా: యానాదయ్య
సాక్షి, కడప (వైఎస్సార్ జిల్లా): సామాన్య కార్యకర్త అయిన తనకు రాష్ట్ర చైర్మన్ పదవి దక్కడం పట్ల నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల ఆర్థిక, సామాజిక లబ్ది కోసం 56 బీసీ కులాల వారికి లబ్ది చేకూరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడం గర్వించదగ్గ విషయమని ప్రశంసించారు. తోకలు కట్ చేస్తాం, తాట తీస్తాం అన్న సచివాలయంలోనే తల ఎత్తుకుని తిరిగేలా సీఎం వైఎస్ జగన్ తమకు పదవి ఇచ్చారని అన్నారు. (చదవండి: 56 బీసీ కార్పొరేషన్లు – చైర్మన్ల వివరాలు) తన పదవికి తప్పకుండా న్యాయం చేస్తానని, నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీయిచ్చారు. తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చిన సీఎం జగన్‌కు ఆయన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, జిల్లాలోని శాసనసభ్యులకు సహకరించిన నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. కాగా, యానాదయ్యను రాష్ట్రస్థాయి పదవిలో నియమించడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నాయీ బ్రాహ్మణ చైర్మన్ పేరు: సిద్దవటం యానాదయ్య విద్యార్హత: బిఏ పుట్టిన తేది: 01–07–1968 తల్లిదండ్రులు: రామయ్య, పిచ్చమ్మ భార్య: వెంకటసుబ్బమ్మ పిల్లలు: శ్రీహరి, రెడ్డి వైష్ణవి స్వగ్రామం: అత్తిగారిపల్లె, పెనగలూరు (మండలం) రాజకీయ ప్రస్థానం: విద్యార్థి నాయకుడిగా ఉంటూ నాయీ బ్రాహ్మణ సంఘంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకూ 25 ఏళ్లు పనిచేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి అటు జిల్లాలో, రాష్ట్రంలో పలు ఉద్యమాలు చేశారు. 2009లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప పార్లమెంటుకు పోటీ చేసే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
రూ.10వేల ఆర్థిక సాయం ప్రకటనపై హర్షం
సాక్షి, గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): సెలూన్ షాపులు ఉన్న నాయీ బ్రాహ్మణులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.10వేలు ఆర్థిక సహాయం ప్రకటించడంపై నాయీ బ్రాహ్మణ నంద యువసేన హర్షం ప్రకటించింది. ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ ఆధ్వర్యంలో మంగళవారం నాయీబ్రాహ్మణ యువకులు కంట్రోల్‌రూం వద్ద వైఎస్సార్ పార్క్‌కు చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. పాలాభిషేకం కార్యక్రమానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు నిర్వాహకులను అడ్డుకున్నారు. దీంతో నాయీ బ్రాహ్మణ యువసేన కార్యకర్తలు గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్ ఆవరణలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్ర పటం పెట్టుకుని ఆర్థిక సహాయం ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఇంచార్జీ సీఐ సూర్యనారాయణ పోలీసు స్టేషన్లో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు. ఏ కార్యక్రమానికైనా మందస్తు అనుమతి తీసుకోవాలని వారికి సూచించారు. అనంతరం గుణదల గంగిరెద్దులదిబ్బలోని నాయిబ్రాహ్మణ కమ్యూనిటీ భవనంలో కృష్ణా జిల్లా నందయువసేన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నాయిబ్రాహ్మణ సెలూన్ షాపులకు సంవత్సరానికి రూ.10,000 ఫిబ్రవరి లోపు అందించాలని నిర్ణయించినందుకు, 100 రోజుల పాలన జనరంజకంగా పూర్తి చేసినందుకు పాలాభిషేకం నిర్వహించారు. యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ, కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాగరాజు నంద, వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ నంద, దేవాలయాల కల్యాణకట్టల జేఎసీ అధ్యక్షుడు రామదాసు, వాయిద్యకళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్ష్యులు యలమందరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు పవన్ నంద, జిల్లా కార్యవర్గసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘నాయీబ్రాహ్మణులకు అండగా ఉంటాం’
సాక్షి, విజయవాడ: దివంగత మహానేత వైఎస్సార్ బీసీలకు అండగా నిలిశారని, బీసీలకు నామినేటెడ్ పదవులు పెద్ద సంఖ్యలో కట్టబెట్టారని.. తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనిస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించడమే కాకుండా, చట్ట సభల్లో వారిని తన పక్కన జగన్మోహన్రెడ్డి కూర్చోబెట్టుకుంటున్నారని తెలిపారు. మంగళవారం జరిగిన నాయీబ్రాహ్మణుల ఆత్మీయ సదస్సులో మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ సమస్యలు పరిష్కరించమంటే నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారని గుర్తు చేశారు. మత్స్యకారులను బెల్టుతో తోలు ఊడదిస్తానని చంద్రబాబు హెచ్చరించారని తెలిపారు. బీసీలను చంద్రబాబు ఆరోవేలుగా చూస్తే, సీఎం జగన్ మాత్రం బీసీలకు అక్కున చేర్చుకున్నారని చెప్పారు. నాయీబ్రాహ్మణులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని చెప్పారు. అండగా ఉంటాం: కొడాలి నాని షాప్ ఉన్న నాయీబ్రాహ్మణులకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పదివేలు ప్రకటించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. అణగారిన వర్గాలు, పేదల కష్టాలను దగ్గరుండి చూశారు కాబట్టే వారికి నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం అవకాశం కల్పించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. నాయీబ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారని, వారికి ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయీబ్రాహ్మణులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. జగన్ మాటంటే మాటే: యానాదయ్య వైఎస్ జగన్ మాట ఇచ్చారంటే మాట తప్పరని రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సిద్ధవటం యానాదయ్య అన్నారు. షాప్ ఉన్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తామని హామీయిచ్చిన సీఎం వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ చరిత్రాత్మక చట్టం చేశారని పేర్కొన్నారు. గతంలో తమ సమస్యలు చెప్పుకొనేందుకు చంద్రబాబును కలిస్తే నాయీబ్రాహ్మణుల తోక కత్తిరిస్తామని బెదిరించారని.. ఎన్నికల్లో చంద్రబాబు, లోకేశ్‌లకు నాయీబ్రాహ్మణులు తోకలు కట్ చేశారని ఎద్దేవా చేశారు. ఆత్మీయ సదస్సుకు నాయీబ్రాహ్మణులు భారీ సంఖ్యలో హాజరైయ్యారు. -
వరంగల్ కోర్టు తీర్పును స్వాగతించిన నాయీలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు తీర్పును తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక స్వాగతించింది. నేరం జరిగిన 48రోజుల్లోనే కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించడం అభినందనీయమని ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం అన్నారు. అతి తక్కువ సమయంలోనే కేసును పరిష్కరించి, హంతకుడికి శిక్షపడేలా చేసిన పోలీసులు, న్యాయవ్యవస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీహిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు. హామీలు అమలు చేయాలి నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని మద్దికుంట లింగం గుర్తు చేశారు. సెలూన్లకు విద్యుత్, కళ్యాణకట్ట ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై సీఎం స్వయంగా హామీయిచ్చినా ఇంతవరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్లో కేటాయించిన రూ.250 కోట్లు ఇప్పటివరకు మంజూరు చేయలేదని తెలిపారు. తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
‘రూ.500 కోట్లు కేటాయించండి’
సాక్షి, హైదరాబాద్: నాయీబ్రాహ్మణ ఆత్మగౌవర భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో తమ సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించాలని కోరింది. నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ మాట్లాడుతూ... దేవాలయాల్లోని కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తమపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 25 వేల మోడ్రన్ సెలూన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద నాయీబ్రాహ్మణులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయ కమిటీల్లో నాయీబ్రాహ్మణులకు ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం ఇవ్వాలని కోరారు. -
5 ఎకరాలు, రూ. 5 కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అన్ని కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం ప్రకటించింది. నాయీ బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి రాజధానిలో ఎకరం భూమి, కోటి రూపాయలు కేటాయించడం పట్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ పెదవి విరిచారు. రాష్ట్రంలో 12 లక్షల జనాభా ఉన్న నాయీ బ్రాహ్మణులకు కంటి తుడుపు కేటాయింపులు సరికాదన్నారు. తమ జనాభాను 3 లక్షల 9 వేలుగా చూపించి తీవ్రవైన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర సర్వేలో చూపించిన లెక్కలను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని, దీని ఆధారంగా తమకు కేటాయింపులు జరపడం తగదన్నారు. మరోసారి నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులకు హైదరాబాద్‌లో 5 ఎకరాల భూమి, రూ. 5 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామని, తమ విన్నపంపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మిగతా హామీల మాటేంటి? నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మిగతా హామీలను కూడా నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని లింగం డిమాండ్ చేశారు. సెలూన్లకు విద్యుత్ రాయితీపై ప్రగతి భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామి ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ఏళ్ల తరబడి దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలకు నోచుకోలేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తమకు కేటాయించిన బడ్జెట్ నిధుల్లో కనీసం 20 శాతం కూడా ఖర్చు చేయలేదని వాపోయారు. నిబంధనల పేరుతో బీసీ రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించండి రాజకీయంగా తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి మద్దికుంట లింగం విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు. -
నాయీ బ్రాహ్మణ పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాయీ బ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర హడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్ర కరపత్రాన్ని సోమ వారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం హడ్‌హక్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... నాయీ బ్రాహ్మణుల హక్కుల సాధన కోసం ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 1న జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. 12 రోజుల పాటు ఈ పాదయాత్ర వివిధ జిల్లాల గుండా నగరంలోని ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు సాగుతుందన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నాయీ బ్రాహ్మణుడికి నవీన కౌరశాల నిర్మాణానికి రూ. 25 వేలు, ప్రతి షాపునకు డొమెస్టిక్ విద్యుత్ మీటర్లుగా మార్చడం, 50 సంవత్సరాలు దాటిన వాయిద్య కళాకారులకు పింఛన్, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు, ఫెడరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో రుణాలు, నాయీ బ్రాహ్మణులకు చట్ట సభలతో పాటు ఇతర నామినేషన్ పోస్టులలో అవకాశం, నగరంలో విద్యార్థి వసతి గృహం, జిల్లా, మండల హెడ్ క్వార్టర్స్‌లో భవనాలు, నాయీ బ్రాహ్మణ యువతీయువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ తదితర డిమాండ్ల సాధన కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. జోగులాంబ దేవాలయం నుంచి ఆయిజా, గద్వాల్, ఎర్రవల్లి, బీచ్పల్లి, పెబెర్, వనపర్తి, కొత్తకోట, భూత్పూర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, బాలానగర్, షాద్‌నగర్, శంషాబాద్, అత్తాపూర్ మీదుగా ఈ పాదయాత్ర సాగనుందన్నారు. ఈ కార్యక్రమంలో హడ్‌హక్ కమిటీ సభ్యులు బి.నరేందర్, సూర్యనారాయణ, మోహన్, జగదీష్, వాసు, గడ్డం మోహన్, పాల్వాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ కేటాయింపులపై హర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో తమ సామాజిక వర్గానికి తగినన్ని కేటాయింపులు జరపడం పట్ల తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్నివర్గాలకు సముచితంగా నిధులు కేటాయించారని ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతోందనడానికి ఈ బడ్జెట్ నిదర్శమని ప్రశంసించారు. నాయీబ్రాహ్మణుల సాధికారతకు తగినన్ని నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. తమకు కేటాయించిన నిధులను తగినవిధంగా ఖర్చుచేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 20 శాతం కూడా ఖర్చు చేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈసారైనా నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది నాయీబ్రాహ్మణులు ఉన్నారని, తమ జనాభాను దృష్టిలో పెట్టుకుని తాజా బడ్జెట్ లో రూ. 1000 కోట్లు కేటాయిస్తే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలి చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు. -
చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించండి
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో తమ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బీసీల్లో తమ కులం బాగా వెనుకబడి ఉందని.. తమను చట్టసభకు పంపించడం ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైస్థాయికి తీసుకురావాలని కోరింది. ఈ మేరకు నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది నాయీబ్రాహ్మణులు అన్నిరకాలుగా వెనుబడి ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు తమ కులానికి చెందిన వారెవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేదని గుర్తు చేశారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ కాలేదని వెల్లడించారు. ఇతర వెనుకబడిన కులాలకు అవకాశం కల్పించినట్టుగానే తమకు కూడా అవకాశం ఇవ్వాలని మఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)కు విజ్ఞప్తి చేశారు. నాయీబ్రాహ్మణులను శాసనమండలి, రాజ్యసభకు నామినేట్ చేసి న్యాయం చేయాలని లింగం నాయీ కోరారు. రాజకీయంగా తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, నామినేటెడ్ పదవుల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. -
హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీయాలి
– నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు పత్తికొండ టౌన్ : హక్కుల కోసం ప్రభుత్వాలను నిలదీయాలని నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పత్తికొండకు వచ్చిన ఆయనను నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు సన్మానించారు. జీఓల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులపై ఎండోమెంట్ అధికారులు వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. దేవాదాయశాఖలో ఖాళీగా ఉన్న 3 వేల ఉద్యోగాలను నాయీ బ్రాహ్మణులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాల్లో ఎలక్ట్రానిక్ తబలా, వాయిద్యాలను వాడటం నిలిపివేసి నాయీ హ్మణులను తీసుకోవాలన్నారు. నాయిబ్రాహ్మణ ఫెడరేషన్‌కు ప్రభుత్వం బడ్జెట్లో రూ.56కోట్లు నిధులు కేటాయించినా 101 జీఓతో లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదన్నారు. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా సబ్సిడీ రుణాలు మంజూరుచేయాలని కోరారు. నాయీ బ్రాహ్మణ సేవాసంఘం గౌరవాధ్యక్షుడు కారన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏపీ రైతుసంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, నాయీబ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు సివి.నర్సయ్య, తాలుకా అధ్యక్షుడు గోవిందరాజులు, కార్యదర్శి లింగన్న, నాయకులు జయరాముడు, రమేష్, డోలు అంజినయ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు. చైర్మన్లకు ఘనసన్మానం : స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఫెడరేషన్ చైర్మన్ కనకాచారికి తాలుకా అధ్యక్షుడు దామోదరాచారి, మండలాధ్యక్షుడు బ్రహ్మయ్య ఆచారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులు ఘనంగా సన్మానం చేశారు. సగర(ఉప్పర)సంఘం ఫెడరేషన్ చైర్మన్ ఏడుకొండలు, శాలివాహన సంఘం ఫెడరేషన్ చైర్మన్ తుగ్గలినాగేంద్రలను స్థానిక ఉప్పరసంఘం నాయకులు యుసీ ఆంజనేయులు, శ్రీనివాసులు, నరసింహమూర్తి, రవి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.రజకసంఘం ఫెడరేషన్ చైర్మన్ రాజమండ్రి నారాయణను ఆ సంఘం పట్టణాధ్యక్షుడు నారి ఆధ్వర్యంలో రజకులు ఘనంగా సన్మానించారు.