
సమావేశంలో మాట్లాడుతున్న లింగం నాయీ
సాక్షి, హైదరాబాద్: నాయీబ్రాహ్మణ ఆత్మగౌవర భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌లో తమ సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించాలని కోరింది. నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారభవన్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ మాట్లాడుతూ... దేవాలయాల్లోని కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తమపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 25 వేల మోడ్రన్ సెలూన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద నాయీబ్రాహ్మణులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయ కమిటీల్లో నాయీబ్రాహ్మణులకు ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment