మద్దికుంట లింగం నాయీ
సాక్షి, హైదరాబాద్: అన్ని కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం ప్రకటించింది. నాయీ బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి రాజధానిలో ఎకరం భూమి, కోటి రూపాయలు కేటాయించడం పట్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ పెదవి విరిచారు. రాష్ట్రంలో 12 లక్షల జనాభా ఉన్న నాయీ బ్రాహ్మణులకు కంటి తుడుపు కేటాయింపులు సరికాదన్నారు.
తమ జనాభాను 3 లక్షల 9 వేలుగా చూపించి తీవ్రవైన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర సర్వేలో చూపించిన లెక్కలను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని, దీని ఆధారంగా తమకు కేటాయింపులు జరపడం తగదన్నారు. మరోసారి నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులకు హైదరాబాద్‌లో 5 ఎకరాల భూమి, రూ. 5 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామని, తమ విన్నపంపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
మిగతా హామీల మాటేంటి?
నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మిగతా హామీలను కూడా నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని లింగం డిమాండ్ చేశారు. సెలూన్లకు విద్యుత్ రాయితీపై ప్రగతి భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామి ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ఏళ్ల తరబడి దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలకు నోచుకోలేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తమకు కేటాయించిన బడ్జెట్ నిధుల్లో కనీసం 20 శాతం కూడా ఖర్చు చేయలేదని వాపోయారు. నిబంధనల పేరుతో బీసీ రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు.
చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించండి
రాజకీయంగా తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి మద్దికుంట లింగం విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment