హోంమంత్రికి వినతిపత్రం ఇస్తున్న నాయీ బ్రాహ్మణ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో తమ కులస్తులను వెలి వేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే కారణంతో తమ సంఘీయులను ఊరి నుంచి బహిష్కరించడం దారుణమని మంత్రికి వివరించారు. సాంఘిక దురాచారాలను ప్రోత్సహించొద్దని, తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వెంటనే కుమురం భీం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసున్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. హోంమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ, కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి రమేశ్, కార్టూనిస్ట్ నారూ ఉన్నారు.
వివాదం ఇదీ...
ఈ నెల 22న కొండపల్లిలో ‘దేవార’ ఉత్సవం జరిగింది. దీనికి నాయీ బ్రాహ్మణులు, రజకులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సహాయ నిరాకరణ చేపట్టారు. వీరికి గ్రామంలో ఎవరూ సహకరించకూడదని 23న ఊరిలో చాటింపు వేయించారు. గ్రామంలోని మూడు నాయీ బ్రాహ్మణ, ఐదు రజక కుటుంబాలపై సాంఘిక బహిష్కారం విధించారు. బాధితులు మొర పెట్టుకోవడంతో పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పి, వెలి ఎత్తివేస్తే రాజీకి వస్తామని బాధితులు తేల్చి చెప్పారు. అయితే క్షమాపణ చెప్పేందుకు గ్రామస్తులు నిరాకరించారు. బాధితులే తమకు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు తిరిగారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు హోంమంత్రి జోక్యం కోరారు.
Comments
Please login to add a commentAdd a comment