rebbena
-
న్యాయం చేయాలని ఆర్డీవో కాళ్లు మొక్కిన మహిళా సర్పంచ్
సాక్షి, ఆసిఫాబాద్: మండల కేంద్రం మీదుగా చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రెబ్బెన సర్పంచ్ బొమ్మినేని అహాల్యాదేవి, బాధితురాలు వందన శుక్రవారం ఆర్డీవో సిడాం దత్తు కాళ్లపై పడి వేడుకున్నారు. రోడ్డు విస్తరణలో ఉన్న కొద్దిపాటి గూడు కూడా కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే శాఖ ఆదీనంలో ఏడెకరాల ప్రభుత్వ మిగులు భూమిని రోడ్డు విస్తరణలో కోల్పోతున్న వాళ్లకు ఇళ్లు, దుకాణాలకు కేటాయించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. చదవండి: టూర్లకు డిమాండ్.. హైదరాబాద్ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్‌కు -
అనుమానిస్తున్నాడని తండ్రిని చంపిన కొడుకు
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్) : సూటి పోటి మాటలతో తండ్రి పెట్టే వేధింపులు తాళలేక కన్న కొడుకే తండ్రిని గొడ్డలితో హతమార్చిన సంఘటన శనివారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని కిష్టాపూర్‌లో చోటు చేసుకుంది. సొంత కోడలిపై అనుమానంతో కొడుకును కోడలిని మాటలతో వేధింపులకు గురి చేయటంతో తండ్రి ప్రవర్తనపై విసుగు చెందిన కుమారుడు తండ్రిని నరికి చంపాడు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన చునార్కర్ రాజయ్య(72) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు లింగయ్య, గణపతిలతో పాటు ఒక కూతురు ఉంది. రాజయ్య భార్య నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందగా పెద్ద కుమారుడు లింగయ్య వద్ద ఉంటున్నాడు. అయితే గత నాలుగు నెలల నుండి పెద్ద కోడలు లక్ష్మిపై అనుమానం పెంచుకున్న రాజయ్య తరుచుగా సూటిపోటి మాటలతో కొడుకు లింగయ్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. నీ భార్య ప్రవర్తన సరిగా లేదని ఆమెను ఇంట్లో నుండి వెళ్లగొట్టమని వేధింపులకు గురిచేసేవాడు. రోజుల తరబడి ఇదే తతంగం జరుగుతుండటంతో తం డ్రీకొడుకుల మధ్య తగాదాలు ఏర్పడ్డాయి. శనివారం ఉదయం సైతం మరోసారి కోడలి ప్రవర్తన సరిగా లేదంటూ కొడుకు లింగయ్యను దుర్భాషలాడటంతో తండ్రి పెట్టే మానసిక వేధింపులు తాళలేక లింగయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో రాజయ్య తలపై బలంగా మోదాడు. వెంటనే విషయాన్ని రాజయ్య చిన్నకోడలు శాంతాబాయి గ్రామానికి సమీపంలో ఉన్న చేనులో పనుల కోసం వెళ్లిన తన భర్త గణపతికి తెలపటంతో హుటాహుటిన చిన్న కుమారుడు ఇంటికి చేరుకునే సరికి రాజయ్య అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో రెబ్బెన సీఐ ఆకుల ఆశోక్, ఎస్సై దీకొండ రమేష్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారి తీసిన పరిణామాలపై విచారణ చేపట్టారు. మృతుడి చిన్న కుమారుడు గణపతి అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హోంమంత్రి దృష్టికి ‘కొండపల్లి’ వివాదం
సాక్షి, హైదరాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో తమ కులస్తులను వెలి వేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే కారణంతో తమ సంఘీయులను ఊరి నుంచి బహిష్కరించడం దారుణమని మంత్రికి వివరించారు. సాంఘిక దురాచారాలను ప్రోత్సహించొద్దని, తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వెంటనే కుమురం భీం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసున్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. హోంమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ, కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి రమేశ్, కార్టూనిస్ట్ నారూ ఉన్నారు. వివాదం ఇదీ... ఈ నెల 22న కొండపల్లిలో ‘దేవార’ ఉత్సవం జరిగింది. దీనికి నాయీ బ్రాహ్మణులు, రజకులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సహాయ నిరాకరణ చేపట్టారు. వీరికి గ్రామంలో ఎవరూ సహకరించకూడదని 23న ఊరిలో చాటింపు వేయించారు. గ్రామంలోని మూడు నాయీ బ్రాహ్మణ, ఐదు రజక కుటుంబాలపై సాంఘిక బహిష్కారం విధించారు. బాధితులు మొర పెట్టుకోవడంతో పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పి, వెలి ఎత్తివేస్తే రాజీకి వస్తామని బాధితులు తేల్చి చెప్పారు. అయితే క్షమాపణ చెప్పేందుకు గ్రామస్తులు నిరాకరించారు. బాధితులే తమకు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు తిరిగారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు హోంమంత్రి జోక్యం కోరారు. -
వెలివేతపై నాయీ బ్రాహ్మణుల ఆగ్రహం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో నాయీ బ్రాహ్మణులు, రజకులపై గ్రామ బహిష్కరణ విధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఊరు నుంచి వెలివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ తెలిపారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన గ్రామ పెద్దలపై చట్టపరంగా తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామ బహిష్కరణకు గురైన నాయీ బ్రాహ్మణులు, రజకులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. తమ వారికి న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఆందోళనలకు సిద్ధం: రజకులు రజకులకు న్యాయం జరగని పక్షంలో తాము కూడా రాష్ట్ర ఆందోళనలు చేపడతామని చాకలి ఎస్సీ సాధన సమితి ప్రకటించింది. తమ సంఘీయులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సాంఘిక దురాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. వాస్తవం లేదు: గ్రామస్తులు కొండపల్లిలో రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులను గ్రామం నుంచి బహిష్కంచలేదని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రానికి చేరుకుని సీఐ రమణమూర్తి, తహశీల్దార్ సాయన్నకు ఈ మేరకు తెలిపారు. గ్రామంలోని రజకులకు, నాయీ బ్రాహ్మణులకు గ్రామం నుంచి ఎలాంటి సహకారం అందించవద్దని తీర్మానించామే తప్ప గ్రామం నుంచి బహిష్కరించలేదని వారు చెప్పడం గమనార్హం. ఎటువంటి సహాయం అందించవద్దని చెప్పడం వెలివేత కాకపోతే ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. -
తనిఖీల్లో నగదు పట్టివేత
రెబ్బెన, న్యూస్‌లైన్ : మండలంలోని గోలేటి ఎక్స్‌రోడ్డు వద్ద మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు బెల్లంపల్లి నుంచి ఆసిఫాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.33లక్షల నగదు పట్టుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌కు తరలించి తహశీల్దార్ జగదీశ్వరి సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి డీఎస్పీ ఈశ్వర్రావు వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లికి చెందిన ఓ పెట్రోల్ బంక్ యజమాని రూ.33లక్షల నగదు కారులో ఆసిఫాబాద్‌కు తరలిస్తున్నారని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో పత్రాలు లేకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగించన్నుట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ తహశీల్దార్ రాంమోహన్‌రావు, తాండూర్ సీఐ ఎండీ సర్వర్, రెబ్బెన ఎస్సై శ్రీనివాస్, ఆర్ఐ బక్కయ్య పాల్గొన్నారు. గూడెం చెక్‌పోస్టు వద్ద.. దండేపల్లి : మండలంలోని గూడెం అటవీ చెక్‌పోస్టు వద్ద సోమవారం రాత్రి ఎన్నికల అధికారి రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. రామకృష్ణాపూర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి మారుతీకారు తనిఖీ చేయగా రూ.60వేల నగదు లభించింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దండేపల్లి ఎస్సై మోహన్‌బాబుకు అప్పగించారు. నగదును మంగళవారం కోర్టులో స్వాధీనం చేశారు. కాగజ్‌నగర్‌లో.. కాగజ్‌నగర్ : ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్(టి) వైపు వెళ్తున్న ఎండీ.తాజుద్దీన్ వద్ద రూ.లక్షా 6వేలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పట్టణంలోని అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆసిఫాబాద్‌కు చెందిన తాజుద్దీన్ ఎలాంటి ఆధారాలు లేకుడా ద్విచక్ర వాహనంపై నగదు తరలిస్తుండగా పట్టుకున్నారు. సిర్పూర్(టి) మండలం హీరాపూర్‌లో పత్తి కొనుగోలు చేశానని, దానికి సంబంధించిన డబ్బులను చెల్లించేందుకు వెళ్తున్నానని చెప్పినా ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.