Maddikunta Lingam
-
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మద్దికుంట లింగం
సాక్షి, హైదరాబాద్: సిటీ సివిల్ కోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది మద్దికుంట లింగం నారాయణ ఎన్నికయ్యారు. మార్చి 5న (శుక్రవారం) హొరా హోరిగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. అత్యధికంగా 535 ఓట్లు సాధించి ఆయన అధ్యక్షుడిగా గెలిచారు. ఉపాధ్యక్షులుగా ఎన్. నాగభూషణం, జి. శ్రీలత ఎన్నికయ్యారు. కార్యదర్శిగా ఈ. కిశోర్‌కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఎం. మురళీ మోహన్ గెలిచారు. నాయీ బ్రాహ్మణుల హర్షం 160 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సిటీ కోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది మద్దికుంట లింగం నాయీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్‌లో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ అభినందలు తెలుపుతున్నారు. -
‘లింగం నాయీకి ఎమ్మెల్సీ ఇవ్వండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రతినిధులు గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆధ్వర్యంలో కవిత నివాసానికి వెళ్లి ఆమెను కలిశారు. నాయీ బ్రాహ్మణులకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వెలిబుచ్చారు. తమ సామాజిక వర్గం స్థితిగతులపై సంపూర్ణ అవగాహనతో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారని, ఇప్పటివరకు నాయీ బ్రాహ్మణులు రాష్ట్ర చట్టసభలో అడుగుపెట్టలేదని గుర్తు చేశారు. తమకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా లింగం నాయీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక తరపున కవితను ఈ సందర్భంగా అభ్యర్థించారు. మూడు దశాబ్దాల నుంచి నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి లింగం నాయీ పాటుపడుతున్నారని తెలిపారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కూడా ఆయన తన వంతు కృషి చేశారని వెల్లడించారు. కవితను కలిసిన వారిలో ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు గోవింద్భక్ష మహేష్ చంద్ర, కోశాధికారి రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డితో పాటు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌లను వీరు కలిశారు. లింగం నాయీ పేరును సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్సీగా నామినేట్ చేసేలా చూడాలని కోరారు. -
రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మిర్దొడ్డి మండలం ఖాజీపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన క్షౌరవృత్తిదారుడు రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అతడి కుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం అందించాలని కోరింది. క్షౌరవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రవి లాక్‌డౌన్‌తో ఉపాధిలేక, ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని ఐక్యవేదిక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ అన్నారు. అతడి ఇద్దరు కూతుళ్లు కావ్య(13), వైష్ణవి(10)లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. క్షౌరవృత్తిదారులు మనోధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షౌరవృత్తిదారులను ఆదుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి క్షురకునికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా మూతపడిన సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి అండగా నిలబడాలని జిల్లా నాయీ బ్రాహ్మణ నాయకులను ఆదేశించారు. -
‘విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు తామంతా సంపూర్ణంగా సహకరిస్తామని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ప్రకటించారు. గురువారం కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు సహకరించాలని, క్షౌరశాలలను తెరవొద్దని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం, స్వయం నియంత్రణ పాటించాలని సూచించారు. క్షురకర్మ అనేది మనుషులకు దగ్గరగా ఉండే చేసే వృత్తి కాబట్టి కరోనా వైరస్ సులభంగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. దగ్గు, తుమ్ము, స్పర్శ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనల ప్రకారం నడుచుకోవాలని కోరారు. లాక్డౌన్ కారణంగా నష్టపోయిన నిరుపేద నాయీ బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సెలూన్ల విద్యుత్ బిల్లులను మాఫీ చేయడంతో పాటు తగినవిధంగా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రకటించిన వ్యక్తిగత రుణాలు, సొసైటీ రుణాలు వెంటనే మంజూరు చేస్తే నాయీ బ్రాహ్మణులను ఆదుకున్నట్టు అవుతుందని ప్రభుత్వానికి తెలిపారు. (కరోనా.. 'నడక'యాతన!) కేసు ఎత్తివేయండి లాక్డౌన్ సందర్భంగా నల్లగొండ జిల్లా వలిగొండలో నిరుపేద నాయీ బ్రాహ్మణుడిపై పోలీసులు ఐపీసీ 188 కింద కేసు పెట్టడాన్ని లింగం నాయీ ఖండించారు. ప్రజ్ఞాపురం శేఖర్ అనే వ్యక్తిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ఎక్కడైనా తెలిసి తెలియక క్షౌరశాలలు తెరిస్తే వారికి అవగాహన కల్పించాలి గానీ, కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షురకులను బెదిరించి బలవంతంగా క్షురకర్మ చేయించుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్డౌన్ ముగిసేవరకు క్షురకర్మకు దూరంగా ఉండాలని వృత్తిదారులకు ఆయన పిలుపునిచ్చారు. ఆపత్కాలంలో నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటామని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్‌చంద్ర నాయీ, ఉపాధ్యక్షుడు అనంతయ్య నాయీ, కార్యదర్శి జి. శ్రీనివాస్ నాయీ, అడ్వకేట్ మసాయి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. (కోవిడ్ ఎఫెక్ట్: వారి కోసం ‘క్రౌడ్ ఫండింగ్’) -
దేశం గర్వించే నేత కర్పూరి ఠాకూర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బీసీ నాయకుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లోక్‌నాయక్ కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా బీసీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుడు కర్పూరి ఠాకూర్ అని స్మరించుకున్నారు. హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిక భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బిహార్‌లోని పితంజియా(ఈ పేరును కర్పూరిగా మార్చారు) అనే మారుమూల గ్రామంలో పుట్టి దేశం గర్వించే నాయకుడిగా ఎదిగారని గుర్తుచేశారు. నిరుపేద క్షౌరవృత్తి కుటుంబం నుంచి వచ్చిన కర్పూరి ఠాకూర్ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 26 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారని వెల్లడించారు. 1970లో బిహార్‌లో కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా సోషలిస్ట్ పార్టీ తరపున అధికారంలోకి రికార్డు సృష్టించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పటికీ నిరాబండర జీవితం గడిపారని, నిమ్నవర్గాల పురోభివృద్ధికి పాటుపడ్డారని స్మరించుకున్నారు. మాజీ ఐఏఎస్ పి. కృష్ణయ్య, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక సంఘం నాయకులు మహేష్‌చంద్ర నాయీ, అడ్వకేట్ మద్దికుంట లింగం, ధనరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉన్నతాధికారులు సీఎల్ఎన్ గాంధీ, నాగన్న, సూర్యనారాయణ, న్యాయవాది రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారు, సుధాకర్, రాజేష్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, పాతబస్తీ నాయీబ్రాహ్మణ నాయకుడు ఎం.లక్ష్మణ్‌ను మంగళి జన సంస్థ అధ్యక్షుడు శ్రీధర్ మురహరి, సుశీల్ కుమార్ సాదరంగా సత్కరించారు. -
హామీలు అమలయ్యేలా చూడండి
సాక్షి, హైదరాబాద్: తమ సామాజిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలయ్యేలా చూడాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక శుక్రవారం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ను కోరింది. తమ సంఘీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చేయాలని విన్నవించారు. ఐక్యవేదిక ప్రతినిధులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది నాయీ బ్రాహ్మణుల్లో మెజారిటీ వర్గం ఇప్పటికి క్షురకులుగా జీవనం సాగిస్తున్నారని వీరిని ఆదుకోవాలని కోరారు. ఇతర కులాలకు చెందిన వారు క్షౌరవృత్తి చేపట్టకుండా సామాజిక రక్షణ కల్పించాలని, కార్పొరేట్ కంపెనీలు క్షౌరవృత్తి దారుల కడుపుకొట్టకుండా చూడాలన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదల చేసి నాయీబ్రాహ్మణులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి తగిన శిక్షణ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. సెలూన్లను కమర్షియల్ విద్యుత్ టారిఫ్ నుంచి తప్పించాలని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతిభవన్ సాక్షిగా హామీయిచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు కాలేదని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏళ్ల తరబడి ఆలయాల్లో సేవలు అందిస్తున్న నాయీబ్రాహ్మణులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని.. చట్టప్రకారం ఐఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని కోరారు. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. 50 ఏళ్లు పైబడిన క్షౌరవృత్తిదారులకు ఫించన్ ఇవ్వాలని, ప్రభుత్వం మంజూరు చేసిన నాయీబ్రాహ్మణ కమ్యునిటీ భవనాన్ని రాజధాని హైదరాబాద్‌లో వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞాపనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం, గౌరవ అధ్యక్షుడు మహేశ్‌చంద్ర, మాదాల కిషన్, నర్సింహులు, అనంతయ్య, శ్రీనివాస్ ఉన్నారు. -
నాయీ బ్రాహ్మణ అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లింగం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నాయీ బ్రాహ్మణ అడ్డకేట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హైకోర్టు అడ్వకేటు మద్దికుంట లింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కర్మాన్‌ఘాట్‌లోని జస్టిస్ వేణుగోపాలరావు కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. కార్యవర్గ సమావేశంలో న్యాయవాదులు సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనను అధ్యక్షుడిగా ఎన్నుకుందుకు కమ్యూనిటీ న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్థానని పేర్కొన్నారు. మద్దికుంట లింగం గతంలో ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. -
సమ్మెను విరమింపజేయండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. 13 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేసుందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వం పంతానికి పోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మద్దికుంట లింగం అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు గత నెల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. ఆర్టీసీని రక్షించేందుకు కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. సమ్మెతో సామాన్య ప్రజలు, పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమ్మె పేరు చెప్పి ప్రైవేటు వాహనదారులు ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారని, విచ్చలవిడిగా తిరుతున్న ప్రైవేటు వాహనాలపై అజమాయిషీ కరువైందన్నారు. ప్రైవేటు సిబ్బందితో ఆర్టీసీ బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలన్నారు. విలేకరుల సమావేశంలో సీనియర్ నేత మహేష్‌చంద్ర, కార్టూనిస్ట్ నారూ, రమేశ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐక్యంగా ముందుకు సాగుదాం
సాక్షి, హైదరాబాద్: ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని నాయీ బ్రాహ్మణ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆబిడ్స్‌లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన దసరా ఆత్మీయ సమ్మేళనంలో నాయీ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో తమకు సరైన అవకాశాలు దక్కడం లేదని, తమ వాటా తమకు ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేస్తూనే, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకోస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని కోరారు. తమను అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల జాబితాలో చేర్చాలని జస్టిస్ రోహిణి కమిషన్‌కు వినతులు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నాయీ బ్రాహ్మణులు తమ సంఘీభావం తెలిపారు. 25న ధన్వంతరి జయంతి వేడుకలు వైద్య వృత్తికి ఆదిదేవుడు, నాయీ బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతి వేడుకలను ఈ నెల 25న నిర్వహించనున్నామని డాక్టర్ బీర్ఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసి నాయీ బ్రాహ్మణుల ఐక్యతను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ధన్వంతరి స్ఫూర్తితో అన్ని రంగాల్లో ముందుడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. తమ సంఘీయుల మధ్య సృహృద్భావ సంబంధాలు ఏర్పాలడాలన్న ఉద్దేశంతో దసరా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్రచంద్ర, కె. వెంకటేశ్వరరావు, జి. అశోక్, గంగాధర్, సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, మద్దికుంట లింగం, సీనియర్ కార్టూనిస్ట్ నారూ, రాపోలు సుదర్శన్, వెంకట్రాయుడు, సూర్యనారాయణ, బాలరాజు, ధనరాజ్, శ్రీధర్, రాజేశ్, పసుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ కోర్టు తీర్పును స్వాగతించిన నాయీలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు తీర్పును తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక స్వాగతించింది. నేరం జరిగిన 48రోజుల్లోనే కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించడం అభినందనీయమని ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం అన్నారు. అతి తక్కువ సమయంలోనే కేసును పరిష్కరించి, హంతకుడికి శిక్షపడేలా చేసిన పోలీసులు, న్యాయవ్యవస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీహిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు. హామీలు అమలు చేయాలి నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని మద్దికుంట లింగం గుర్తు చేశారు. సెలూన్లకు విద్యుత్, కళ్యాణకట్ట ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై సీఎం స్వయంగా హామీయిచ్చినా ఇంతవరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్లో కేటాయించిన రూ.250 కోట్లు ఇప్పటివరకు మంజూరు చేయలేదని తెలిపారు. తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
‘కిరాతకుడిని ఉరి తీయండి’
సాక్షి, హైదరాబాద్: హన్మకొండలో ముక్కుపచ్చలారని పసిపాపను పైశాచికంగా హత్య చేసిన దుర్మార్గుడిని ఉరి తీయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు మద్దికుంట లింగం నాయీ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి, అన్నివిధాలుగా అండదండలు అందించాలని ఇవ్వాలని కోరారు. ఊహించని విధంగా కూతురిని కోల్పోయి పుట్టేడు శోకంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో మంగళవారం చోటుచేసుకున్న దారుణోదంతంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 9 నెలల పసికందుపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడు ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. -
కర్పూరి ఠాకూర్‌కు ఘన నివాళులు
సాక్షి, హైదరాబాద్/ఒంగోలు: బిహార్ మాజీ ముఖ్యమంత్రి 'జననాయక్' కర్పూరి ఠాకూర్ 95వ జయంతి సందర్భంగా తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక ఘన నివాళులు అర్పించింది. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ నివాళి అర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కర్పూరి ఠాకూర్ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎంబీసీల గౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. 'జననాయక్' స్ఫూర్తితో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. నాయీ బ్రాహ్మణ నాయకులు రమేశ్, జి. శ్రీనివాస్ తదితరులు కూడా కర్పూరి ఠాకూర్‌కు నివాళులు అర్పించారు. పరిపాలనాదక్షుడు కర్పూరి ఠాకూర్ రాజకీయాల్లో విలువలకు నిలువుటద్దంగా నిలిచిన పరిపాలనాదక్షుడు కర్పూరి ఠాకూర్ అని ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక పేర్కొంది. ఒంగోలులోని బీసీ కులాల ఆరామ క్షేత్రాల సముదాయంలో కర్పూరి ఠాకూర్ 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాధారణ మంగలి కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన కర్పూరి ఠాకూర్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడ్డారని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు పిల్లుట్ల సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, మిరియాల రాఘవ, ఏల్చూరి రమేశ్, బత్తుల కృష్ణమూర్తి, కొణిజేటి రామకృష్ణ, ఏల్చూరి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
‘రూ.500 కోట్లు కేటాయించండి’
సాక్షి, హైదరాబాద్: నాయీబ్రాహ్మణ ఆత్మగౌవర భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్లో తమ సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయించాలని కోరింది. నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ మాట్లాడుతూ... దేవాలయాల్లోని కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. తమపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 25 వేల మోడ్రన్ సెలూన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద నాయీబ్రాహ్మణులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయ కమిటీల్లో నాయీబ్రాహ్మణులకు ప్రాతినిథ్యం కల్పించాలన్నారు. ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం ఇవ్వాలని కోరారు. -
5 ఎకరాలు, రూ. 5 కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అన్ని కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం ప్రకటించింది. నాయీ బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి రాజధానిలో ఎకరం భూమి, కోటి రూపాయలు కేటాయించడం పట్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ పెదవి విరిచారు. రాష్ట్రంలో 12 లక్షల జనాభా ఉన్న నాయీ బ్రాహ్మణులకు కంటి తుడుపు కేటాయింపులు సరికాదన్నారు. తమ జనాభాను 3 లక్షల 9 వేలుగా చూపించి తీవ్రవైన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర సర్వేలో చూపించిన లెక్కలను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని, దీని ఆధారంగా తమకు కేటాయింపులు జరపడం తగదన్నారు. మరోసారి నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులకు హైదరాబాద్‌లో 5 ఎకరాల భూమి, రూ. 5 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామని, తమ విన్నపంపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మిగతా హామీల మాటేంటి? నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మిగతా హామీలను కూడా నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని లింగం డిమాండ్ చేశారు. సెలూన్లకు విద్యుత్ రాయితీపై ప్రగతి భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామి ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ఏళ్ల తరబడి దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలకు నోచుకోలేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తమకు కేటాయించిన బడ్జెట్ నిధుల్లో కనీసం 20 శాతం కూడా ఖర్చు చేయలేదని వాపోయారు. నిబంధనల పేరుతో బీసీ రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించండి రాజకీయంగా తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి మద్దికుంట లింగం విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు. -
‘కరుణానిధి మృతి కలచివేసింది’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురందరుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం కరుణానిధి మరణం పట్ల అఖిల భారత నాయీ సెయిన్, సవితా, విల్లంకితుల నాయర్, ఇసాయ్ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్‌ఐయూఎఫ్) సంతాపం ప్రకటించింది. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ‘కలైంజ్ఞర్’ మరణం పూడ్చలేనిదని ఏఐఎన్‌ఐయూఎఫ్ కన్వీనర్ దుగ్యాల అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమిళ నాయీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి రాజకీయ రంగంలో శిఖరస్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మరణం తమ జాతికి శరాఘాతమని ఏఐఎన్‌ఐయూఎఫ్ ప్రతినిధి సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఓటమి ఎరుగని దురందరుడు ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి దేశ రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలిగిన కరుణానిధి మరణం తమను ఎంతగానో కలచివేసిందని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం పేర్కొన్నారు. కరుణానిధి మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. ఓటమి ఎరుగని రాజకీయ దురందరుడు కరుణానిధి అని కొనియాడారు. 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘనత ఆయకే దక్కిందన్నారు. డీఏంకే పార్టీకి ఏకధాటిగా 50 ఏళ్లు అధ్యక్షుడిగా కొనసాగారని, తమిళనాడులోనే కాక దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణ కులంలోని గొప్ప నాయకుడు అస్తమించడంతో తామంతా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయామన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నీటి నివాళులు కరుణానిధి నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, కరుణానిధి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ద్రవిద యోధుడికి కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. -
హోంమంత్రి దృష్టికి ‘కొండపల్లి’ వివాదం
సాక్షి, హైదరాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో తమ కులస్తులను వెలి వేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే కారణంతో తమ సంఘీయులను ఊరి నుంచి బహిష్కరించడం దారుణమని మంత్రికి వివరించారు. సాంఘిక దురాచారాలను ప్రోత్సహించొద్దని, తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వెంటనే కుమురం భీం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసున్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. హోంమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ, కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి రమేశ్, కార్టూనిస్ట్ నారూ ఉన్నారు. వివాదం ఇదీ... ఈ నెల 22న కొండపల్లిలో ‘దేవార’ ఉత్సవం జరిగింది. దీనికి నాయీ బ్రాహ్మణులు, రజకులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సహాయ నిరాకరణ చేపట్టారు. వీరికి గ్రామంలో ఎవరూ సహకరించకూడదని 23న ఊరిలో చాటింపు వేయించారు. గ్రామంలోని మూడు నాయీ బ్రాహ్మణ, ఐదు రజక కుటుంబాలపై సాంఘిక బహిష్కారం విధించారు. బాధితులు మొర పెట్టుకోవడంతో పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పి, వెలి ఎత్తివేస్తే రాజీకి వస్తామని బాధితులు తేల్చి చెప్పారు. అయితే క్షమాపణ చెప్పేందుకు గ్రామస్తులు నిరాకరించారు. బాధితులే తమకు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు తిరిగారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు హోంమంత్రి జోక్యం కోరారు. -
వెలివేతపై నాయీ బ్రాహ్మణుల ఆగ్రహం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో నాయీ బ్రాహ్మణులు, రజకులపై గ్రామ బహిష్కరణ విధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఊరు నుంచి వెలివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ తెలిపారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన గ్రామ పెద్దలపై చట్టపరంగా తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామ బహిష్కరణకు గురైన నాయీ బ్రాహ్మణులు, రజకులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. తమ వారికి న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఆందోళనలకు సిద్ధం: రజకులు రజకులకు న్యాయం జరగని పక్షంలో తాము కూడా రాష్ట్ర ఆందోళనలు చేపడతామని చాకలి ఎస్సీ సాధన సమితి ప్రకటించింది. తమ సంఘీయులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సాంఘిక దురాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. వాస్తవం లేదు: గ్రామస్తులు కొండపల్లిలో రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులను గ్రామం నుంచి బహిష్కంచలేదని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రానికి చేరుకుని సీఐ రమణమూర్తి, తహశీల్దార్ సాయన్నకు ఈ మేరకు తెలిపారు. గ్రామంలోని రజకులకు, నాయీ బ్రాహ్మణులకు గ్రామం నుంచి ఎలాంటి సహకారం అందించవద్దని తీర్మానించామే తప్ప గ్రామం నుంచి బహిష్కరించలేదని వారు చెప్పడం గమనార్హం. ఎటువంటి సహాయం అందించవద్దని చెప్పడం వెలివేత కాకపోతే ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. -
చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వం
సాక్షి, హైదరాబాద్ : నాయీ బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా నాయీ, సెయిన్, సవితా, విల్లంకితుల నాయర్, ఇసాయ్ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్‌ఐయూఎఫ్) డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రీయ సెయిన్ సమాజ్ సంఘ్(ఆర్ఎస్ఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు రవీందర్ రాణా మాట్లాడుతూ... చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. నాయీ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నెల రోజులు గడుస్తున్నా కనీసం క్షమాపణ చెప్పకపోవడం బాధాకరమన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. కనీస వేతనాలు ఇవ్వాల్సిందే.. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులు, వాయిద్య కళాకారులకు కనీస వేతనాలు ఇవ్వాలని నాయీ బ్రాహ్మణ మేధావులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆలయాల్లో సేవలు అందిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనుచ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐఎన్‌ఐయూఎఫ్ కన్వీనర్ దుగ్యాల అశోక్, తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్ చంద్ర, చైర్మన్ మద్దికుంట లింగం, ఎం నరసింహారావు, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులతో మంద కృష్ణమాదిగ చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తా: కృష్ణ మాదిగ నాయీ బ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతానని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ హామీయిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయనను నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు కలిశారు. ఏపీ సచివాలయంలో నాయీ బ్రాహ్మణులను బెదిరిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తానని ఈ సందర్భంగా కృష్ణమాదిగ అన్నారు. నాయీ బ్రాహ్మణులు తన మద్దతు ఉంటుందని, వారు ఎక్కడికి పిలిచినా వస్తానని హామీయిచ్చారు. ఇది కూడా చదవండి : నడిరోడ్డుపై చంద్రబాబు గూండాగిరి -
పంచాయతీ ఎన్నికల్లో వర్గీకరణ పాటించాలి
సాక్షి, హైదరాబాద్: వచ్చే గ్రామపంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల వారికి కేటాయించే రిజర్వేషన్లను ఏబీసీడీ గ్రూప్‌లుగా కేటాయించాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షులు మద్దికుంట లింగం నాయీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీసీ సంఘాలు, ఎంబీసీ సంఘాల నాయకులు చేపట్టిన పోరాటానికి తెలంగాణ రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగాల్లో అమల్లు చేస్తున్నట్టుగానే ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్లు కేటగిరివారీగా అమలుచేయాలన్నారు. ఏబీసీడీలు గ్రూపులుగా రిజర్వేషన్లు కేటాయించినపుడే నాయీ బ్రాహ్మణులు, రజకులు, తదితర అట్టడుగు స్ధాయిలో ఉన్న వెనుకబడిన కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. మైనారిటీ బీసీ కులాలు రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సామాజిక న్యాయసూత్రాలకు భిన్నంగా వ్యవహరిస్తే ఎంబీసీ కులాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణ వృత్తిని తమవారు తప్ప ఇతర కుల, మతస్తులు చేపట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నాయీ బ్రాహ్మణులపై దాడుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు మహేష్ చంద్ర, రాష్ట్ర ప్రచార కార్యదర్శి తేలుకంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.