కర్పూరి ఠాకూర్ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న బీసీలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బీసీ నాయకుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లోక్‌నాయక్ కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా బీసీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుడు కర్పూరి ఠాకూర్ అని స్మరించుకున్నారు. హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిక భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బిహార్‌లోని పితంజియా(ఈ పేరును కర్పూరిగా మార్చారు) అనే మారుమూల గ్రామంలో పుట్టి దేశం గర్వించే నాయకుడిగా ఎదిగారని గుర్తుచేశారు. నిరుపేద క్షౌరవృత్తి కుటుంబం నుంచి వచ్చిన కర్పూరి ఠాకూర్ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 26 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారని వెల్లడించారు. 1970లో బిహార్‌లో కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా సోషలిస్ట్ పార్టీ తరపున అధికారంలోకి రికార్డు సృష్టించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పటికీ నిరాబండర జీవితం గడిపారని, నిమ్నవర్గాల పురోభివృద్ధికి పాటుపడ్డారని స్మరించుకున్నారు.
మాజీ ఐఏఎస్ పి. కృష్ణయ్య, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక సంఘం నాయకులు మహేష్‌చంద్ర నాయీ, అడ్వకేట్ మద్దికుంట లింగం, ధనరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉన్నతాధికారులు సీఎల్‌ఎన్ గాంధీ, నాగన్న, సూర్యనారాయణ, న్యాయవాది రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారు, సుధాకర్, రాజేష్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, పాతబస్తీ నాయీబ్రాహ్మణ నాయకుడు ఎం.లక్ష్మణ్‌ను మంగళి జన సంస్థ అధ్యక్షుడు శ్రీధర్ మురహరి, సుశీల్ కుమార్ సాదరంగా సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment