BC Bhavan
-
విద్యార్థుల స్కాలర్ షిప్ రూ. 20 వేలకు పెంచాలి
ముషీరాబాద్: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్ షిప్‌లను రూ.5,500 నుంచి రూ. 20 వేలకు పెంచాలని, ఫీజు బకాయిలు రూ. 3,300 కోట్లు వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ భవన్లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 10న కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్ఓ కార్యాలయాల ముందు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తారని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రూ. 20 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంటే తెలంగాణలో కేవలం రూ. 5,500 మాత్రమే ఇస్తున్నారని ప్రస్తుత అవసరాలకు రూ. 20 వేలకు పెంచాలని కోరారు. కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.1,500 నుంచి రూ. 3 వేలకు, పాఠశాల హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2 వేలకు పెంచాలన్నారు. బీసీలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బీసీ గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలని కృష్ణయ్య కోరారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలి
ముషీరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీకి 15 రోజుల్లో నోటిఫికేషన్లు ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం బీసీ భవన్లో నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోనల్విధానం పూర్తయినా నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని విమర్శించారు. అన్ని శాఖల్లో అడ్హాక్ ప్రమోషన్ల పేరుమీద ఉద్యోగాలన్నీ భర్తీ చేశారని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను కూడా ప్రమోషన్లకింద భర్తీ చేశారని ఆరోపించారు. సీఎం జోక్యం చేసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్టులను పూర్తిస్థాయిలో లెక్కించి భర్తీ చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు. -
జాతీయ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దాసు సురేశ్
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: జాతీయ బీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా దాసు సురేశ్ నియమితులయ్యారు. శుక్రవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమానికి బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై.. సురేశ్‌ను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అధికారికంగా ప్రకటించి నియామకపత్రాన్ని అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాల్లో బీసీలను బలోపేతం చేయడానికి సురేశ్‌ను నియమించామన్నారు. సురేశ్ మాట్లాడుతూ.. అన్ని బీసీ వర్గాలను బలోపేతం చేసి రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జాతీయ బీసీ సేనా అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి కృష్ణయ్య హాజరయ్యారు. బీసీబంధు పథకం వెంటనే ప్రవేశపెట్టాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
దేశం గర్వించే నేత కర్పూరి ఠాకూర్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బీసీ నాయకుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లోక్‌నాయక్ కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా బీసీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుడు కర్పూరి ఠాకూర్ అని స్మరించుకున్నారు. హిమాయత్‌నగర్‌లోని బీసీ సాధికారిక భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. బిహార్‌లోని పితంజియా(ఈ పేరును కర్పూరిగా మార్చారు) అనే మారుమూల గ్రామంలో పుట్టి దేశం గర్వించే నాయకుడిగా ఎదిగారని గుర్తుచేశారు. నిరుపేద క్షౌరవృత్తి కుటుంబం నుంచి వచ్చిన కర్పూరి ఠాకూర్ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 26 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారని వెల్లడించారు. 1970లో బిహార్‌లో కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా సోషలిస్ట్ పార్టీ తరపున అధికారంలోకి రికార్డు సృష్టించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినప్పటికీ నిరాబండర జీవితం గడిపారని, నిమ్నవర్గాల పురోభివృద్ధికి పాటుపడ్డారని స్మరించుకున్నారు. మాజీ ఐఏఎస్ పి. కృష్ణయ్య, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక సంఘం నాయకులు మహేష్‌చంద్ర నాయీ, అడ్వకేట్ మద్దికుంట లింగం, ధనరాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ రిటైర్డ్ ఉన్నతాధికారులు సీఎల్ఎన్ గాంధీ, నాగన్న, సూర్యనారాయణ, న్యాయవాది రమేశ్, సీనియర్ కార్టూనిస్ట్ నారు, సుధాకర్, రాజేష్ తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, పాతబస్తీ నాయీబ్రాహ్మణ నాయకుడు ఎం.లక్ష్మణ్‌ను మంగళి జన సంస్థ అధ్యక్షుడు శ్రీధర్ మురహరి, సుశీల్ కుమార్ సాదరంగా సత్కరించారు. -
బీసీలకు ఇవ్వకుంటే గుణపాఠం తప్పదు: జాజుల
కవాడిగూడ: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జనరల్ స్థానాల్లో బీసీలకు బీఫామ్‌లు ఇవ్వకపోతే బీసీ ఓటర్లు గుణపాఠం చెప్పక తప్పదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. హైదరాబాద్ దోమలగూడలోని బీసీ భవన్లో శుక్రవారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో జూజుల మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో జనాభాలో 10% ఉన్న అగ్రకులాలకు 50% జనరల్ స్థానాలను, జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు మాత్రం 50 స్థానాలనే కేటాయించారని మండిపడ్డారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు బీ–ఫామ్‌లు ఇచ్చారని, బీ–ఫామ్‌లు తీసుకున్న ఎమ్మెల్యేలు మాత్రం జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపిస్తున్నారని ఆరోపించారు. -
తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు అన్యాయం
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో బీసీలకు రాజకీయ పక్షాలు అన్యాయం చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బీసీ సంఘాలు అనుసరించాల్సిన వ్యూహంపై జాతీయ బీసీ సంఘం కోర్ కమిటీ సమావేశం విద్యానగర్‌లోని బీసీ భవన్లో శనివారం ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేశా యని విమర్శించారు. వాస్తవానికి జనాభా ప్రకారం బీసీలకు 9 సీట్లు కేటాయించాలని, కానీ ఆ పార్టీలు వారిని ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నాయని అన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేవలం 4 ïసీట్ల చొప్పున కేటాయించి అన్యాయం చేశాయని విమర్శించారు. గ్రామాలలో బీసీ కులాల్లో విపరీతమైన రాజకీయ చైతన్యం వచ్చిందని, ఇష్టమొచ్చినట్లు టికెట్లు ఇస్తే గుడ్డిగా ఓట్లు వేయరని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితేనే రాజకీయంగా న్యాయం జరుగుతుందన్నారు. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ రిజర్వేషన్లు పెడతామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించే పార్టీలకే బీసీలు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారన్నారు. తటస్థంగా ఉంటే బీసీలకు ఇంకా 50 ఏళ్ల వరకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వరన్నారు. త్వరలో మరోసారి సమావేశమై విధాన ప్రకటన చేయాలని నిర్ణయించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనకు ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నేతలు నీల వెంకటేష్, ఉపేందర్‌గౌడ్, శ్రీనివాస్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జీపీలకు పక్కా భవనాలు కరువు
సాక్షి, కొడంగల్: భారత జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మాటలకే పరిమితమైంది. గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించే గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేవు. మంజూరైన భవన నిర్మాణాలు నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోయాయి. గ్రామ సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షించే పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగుల కొరత కారణంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులను, ఉద్యోగులను నియమించకపోవడం వల్ల పరిపాలన సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చిన్న జిల్లాలు, మండలాల వల్ల అధికారులు ప్రజలకు దగ్గరైనా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఐదారు గ్రామాలకు ఒక్క పంపచాయతీ కార్యదర్శిని నియమించడంతో ఏ గ్రామానికి న్యాయం చేయని పరిస్థితి నెలకొంది. గ్రామ పాలన.. కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు వికారాబాద్‌లో జిల్లాలో కలిశాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించింది. కొత్త పంచాయతీల సంగతి దేవుడెరుగు. పాత పంచాయతీలకే ఉద్యోగులు, సిబ్బంది నియామకం జరగలేదు. గత పంచాయతీల ప్రకారం కొడంగల్ మండలంలో 20, దౌల్తాబాద్‌లో 20, బొంరాస్‌పేటలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో పలు పంచాయతీలకు పక్కా భవనాలు లేవు. పక్కా భవనాలు లేకపోవడం వల్ల గ్రామానికి సంబంధించిన రికార్డులకు భద్రత కరువైంది.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాల్సిన పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. గ్రామాభివృద్ధిఅస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్యం లోపించింది. నియోజకవర్గంలో .. కొడంగల్‌ల మండలంలో 20 గ్రామపంచాయతీలకు గానూ 8 గ్రామాలకు పంచాయతీ భవనాలు లేవు. మండలంలో రుద్రారం, ఇందనూర్, అప్పాయిపల్లి, నాగారం గ్రామాలలో పంచాయతీ భవనాలు లేవు. రావులపల్లిలో జీపీ భవనం శిథిలావస్థకు చేరింది. లక్షీపల్లిలో భవనం ఉన్నా వినియోగంలో లేదు. అంగడిరాయచూర్ గ్రామంలో జీపీ భవనం నిర్మాణం పూర్తి కాలేదు. బొంరాస్‌పేట మండలంలో ఎనికెపల్లి, మహంతీపూర్, హంసాన్పల్లి, కొత్తూరు గ్రామాలకు భవనాలు లేవు. దౌల్తాబాద్ మండలంలో 20 గ్రామాలకు గానూ 9 గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేవు. -
4న బీసీ బహిరంగ సభ: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: బీసీ డిమాండ్ల సాధనలో భాగంగా నవంబర్ 4న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం బీసీ భవన్లో బీసీ ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన వాటా దక్కినప్పుడే ఎదుగుతారన్నారు. అందుకు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని, బహిరంగ సభతో బీసీల డిమాండ్లను రాజకీయ పార్టీలకు తెలపాలన్నారు. ఈ సభకు బీసీలు ఇంటికొక్కరు చొప్పున హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అరికట్టండి
హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మద్యం, ధన ప్రవాహాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. శనివారం బీసీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడే కోట్ల రూపాయలు వెదజల్లడం, మద్యం ప్రలోభా లను చూపడం ప్రారంభించా యని ఆరోపించారు. డిసెం బర్ 7 వరకు బీరు షాపులు, బార్లు మూసివేయాలని, ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, డబ్బులు ఇవ్వడానికి యత్నించే నాయకులపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు జి. కృష్ణ, వెంకటేశ్, సత్యనారాయణ, బర్కకృష్ణ పాల్గొన్నారు. -
‘ఖాళీల భర్తీకి తొలిరోజే సంతకం చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై అధికారంలోకి వచ్చిన తొలిరోజే సంతకం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాంటి పార్టీకే నిరుద్యోగులు మద్దతు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. బుధవారం బీసీ భవన్లో తెలంగాణ నిరుద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి, ఓయూ నిరుద్యోగ జాక్, రాష్ట్ర నిరుద్యోగ సంఘర్షణ సమితి, రాష్ట్ర నిరుద్యోగ యువజన సంఘం, బీసీ విద్యార్థి సంఘాల సమితితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలు సృష్టించమనడం లేదని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలనే భర్తీ చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో కేవలం 18వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్లు చెప్పారు. -
బీసీలకు ఆత్మగౌరవ భవనాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో సుమారు 80 శాతమున్న వెనుకబడిన, అణగారిన వర్గాల ప్రజల కోసం హైదరాబాద్ నగరంలో ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం 67.75 కోట్లను మంజూరు చేసింది. 32 కులాలకు, క్రిస్టియన్ భవనానికి కలిపి 71.30 ఎకరాలు కేటాయించింది. ఈ జాబితాలో సంచార జాతులను ఒక కులంగా పరిగణించింది. ఎరుకల ఆత్మగౌరవ భవనానికి ఆమోదం తెలిపింది. అలాగే హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో ఐదు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా వేచి చూసిన కేబినెట్ సమావేశం సాధారణ పరిపాలన నిర్ణయాలకు పరిమితమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఆదివారం మంత్రివర్గ సమావేశం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన నాలుగేళ్ల మూడు నెలల కాలంలో అతితక్కువ సమయం జరిగిన మంత్రివర్గ సమావేశం ఇదే కావడం గమనార్హం. మంత్రివర్గ సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీశ్‌రావు, జోగు రామన్న విలేకరుల సమావేశంలో పాల్గొనగా కేబినెట్ నిర్ణయాలను ఈటల రాజేందర్ వెల్లడించారు. అసెంబ్లీ రద్దు అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ‘త్వరలోనే మరోసారి కేబినెట్ భేటీ అవుతుంది’అని కడియం, హరీశ్‌రావు బదులిచ్చారు. కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న వివిధ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు. ఆశ కార్యకర్తల గౌరవ వేతనం ప్రస్తుతమున్న రూ. 6 వేల నుంచి రూ.7,500లకు, రెండో ఏఎన్ఎంల వేతనం ప్రస్తుతమున్న రూ. 11 వేల నుంచి రూ. 21 వేలకు, కాంట్రాక్టు వైద్యుల వేతనం రూ. 36 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు. వరదలతో మిడ్ మానేరుకు గండిపడటం వల్ల ముంపునకు గురైన మన్వాడ గ్రామవాసుల విజ్ఞప్తి మేరకు వారికి ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయం. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 4.25 లక్షల చొప్పున మొత్తం రూ. 25.84 కోట్ల పరిహారం చెల్లించాలని నిర్ణయం. పశుసంవర్ధకశాఖ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే గోపాలమిత్రల గౌరవ వేతనం రూ. 3,500 నుంచి రూ. 8,500కు పెంపు. ఆలయాల్లోని అర్చకుల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కంటి వెలుగు’కార్యక్రమానికి ఆదరణ బాగుందని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. ‘కంటి వెలుగు’కార్యక్రమం అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది. -
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చాలా ఏళ్లుగా భర్తీ చేయకుండా ఉన్న గ్రూప్–1, 3, 4 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో తెలంగాణ నిరుద్యోగ జాక్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సచివాలయం డైరెక్టరేట్లు, జిల్లా కార్యాలయాల్లో వేల సంఖ్యల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. పారామెడికల్, ఇంజనీరింగ్, ఇతర టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శాఖల వారీగా సమీక్షలు జరిపి రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ ఖాళీలు, పెరిగిన పని భారం, అవసరాలకు తగ్గట్లు ఉద్యోగాల భర్తీ చేపట్టాలన్నారు. టీచర్ల సంఖ్యను విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా కాకుండా రిటైర్మెంట్ వల్ల ఏర్పడ్డ ఖాళీల ఆధారంగా లెక్కించాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేశ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నీరడి భూపేశ్, సాగర్, రావులకోలు నరేశ్, యస్.రామలింగం, జి.కృష్ణ, గజేందర్, రాంబాబు ,అనిల్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
6న నిరాహార దీక్షలు: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే నెల 6న రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద సామూహిక నిరాహార దీక్షలు చేపట్టనున్నామని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్షలు చేస్తున్నామన్నారు. శనివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉత్తర తెలంగాణ జిల్లాల సంస్థాగత నిర్మాణ సమీక్ష జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలపక్షాలతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలసి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించాలని డిమాండ్ చేశారు. సంఘ అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, శారద గౌడ్, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య సంఘ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొండేటి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా జి. రాధాకృష్ణారావు, మంచిర్యాల జిల్లా చైర్మన్‌గా చిట్ల సత్యనారాయణ, అధ్యక్షుడిగా కర్రె లచ్చన్న, మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జ్గా భేరి సత్యనారాయణలను నియమించారు. -
రాజ్యాధికారం దక్కినప్పుడే నివాళి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం దక్కినపుడే సర్దార్ సర్వాయి పాపన్నకు నిజమైన నివాళి అని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. పాపన్న ఆశయ సాధన కోసం బహుజన వర్గాలు ఐక్యతతో ముందుకెళ్లాలని సూచించారు. గురువారం బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 366వ జయంతి ఉత్సవాలు జరిగాయి. కృష్ణయ్య మాట్లాడుతూ, ఏళ్ల క్రితమే బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించిన సర్వాయి పాపన్న చరిత్రలో గొప్ప పాలకుడిగా, బహుజనులకు స్ఫూర్తిగా నిలిచాడని అన్నారు. పాపన్న స్ఫూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా సంఘటితంగా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. పాపన్న స్వయం పాలనను ప్రకటించుకుని పాలించినట్లే, తెలంగాణలో కూడా బీసీలు 2019లో రాష్ట్ర అసెంబ్లీపై బీసీల జెండాను ఎగురవేయాలన్నారు. పాపన్న జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వమే నిర్వహించాలని, పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, బీసీ మండల్ తదితరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ర్యాగ అరుణ్, శారదాగౌడ్, గూడూరు భాస్కర్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, సువర్ణ, అరుణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పోరాట ఫలితమే..!
ముషీరాబాద్: నిరుద్యోగుల పోరాట ఫలితంగానే గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ముఖ్యమంత్రి నిరుద్యోగుల మన్ననలు పొందాలన్నారు. సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2 ఉద్యోగాలను 1027 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం అభినందనీయమన్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నోటిఫికేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్నారన్నారు. 22 ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–2 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 11 శాఖల పరిధిలో 1027 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించటం దారుణమన్నారు. ప్రమోషన్లకు అలవాటు పడిన అధికారులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాకు రావాల్సిన పోస్టులను వివిధ స్థాయిల్లో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న 40వేల టీచర్, గ్రూప్–3 కింద 8500 పోçస్టులను, గ్రూప్–4 ద్వారా 36వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, అంజి, రాంబాబు, బిక్షపతి, అరుణ్‌యాదవ్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల వెలుగురేఖ ‘బీపీ మండల్’
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: బీసీలను పట్టి పీడిస్తున్న పేదరికం, వెనుకబాటుతనం నుంచి సమాజంలో వారిని భాగస్వాములను చేసే ప్రయత్నంలో బి.పి. మండల్ ( బిందేశ్వరిప్రసాద్ మండల్) చేసిన కృషి మరవలేనిదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. మండల్ కమిషన్‌లోని 40 సిఫారసులను పూర్తిగా అమలులోకి తెచ్చి బీసీల సమగ్రాభివృద్ధికి పాటు పడినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో బి.పి. మండల్ 97వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మండల్ కమిషన్ రిపోర్టులోని కేవలం రెండు సిఫార్సులు మాత్రమే ప్రభుత్వం అమలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లయినా మిగిలిన సిఫార్సులు అమల్లోకి రాకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అన్నారు. బీసీలకు చట్ట సభలలో జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ తన సిఫార్సులలో వీటిని ప్రధానంగా సూచించినా.. అవి ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కులాల వారీగా బీసీల లెక్కలను తీసి, శాస్త్రీయంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఇన్నాళ్లకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ, కులాలవారీ లెక్కలను బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచడం దురదృష్టకరమన్నారు. వెంటనే కులాల వారీగా లెక్కలను ప్రకటించి, బీసీల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక తత్వవేత్త బి.ఎస్.రాములు మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం ఏర్పాటైన ప్రభుత్వాలన్నీ బీసీలకు రిజర్వేషన్లు నిరాకరిస్తూ వచ్చాయని, జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ రిజర్వేషన్ల కోసం కృషి జరిగిందని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే బి.పి. మండల్‌తో మండల్ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ ఉద్యమ వేదిక ఆవిర్భావం బీసీల సమస్యలపై పోరాడేందుకు బీసీ ఉద్యమ వేదిక పేరు తో మరో సంస్థ ఆవిర్భవించింది. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బీపీ మండల్ జయంతి వేడుకల్లో వేదికను ప్రారంభించారు. బీసీ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు దేశగాని సాంబశివగౌడ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వీజీఆర్ నారగోని, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు దునుకు వేలాద్రి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ నాయకులు డాక్టర్ వినయ్‌కుమార్, జైహింద్ గౌడ్, బీసీ సంక్షేమసంఘం మహిళా అధ్యక్షురాలు డా.శారదగౌడ్, ప్రొ.అఖిలేశ్వరి, మేకపోతుల నరేశ్ తదితరులు ప్రసంగించారు. బీసీల రాజ్యాధికారం కోసం మండల్ స్ఫూర్తితో పోరాడాలని వారు పిలుపునిచ్చారు. -
ఎర్రకోటను ముట్టడిస్తాం
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి: జాజుల శ్రీనివాస్‌గౌడ్ సాక్షి,హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనైనా బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లను కల్పించకపోతే ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడిస్తామని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ హెచ్చరించారు. శుక్రవారం బీసీ భవన్లో జరిగిన సంఘం పదాధికారుల సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడచినా బీసీల సమస్యల పరిష్కారంలో ఉలుకుపలుకు లేకపోవడం బాధిస్తోందన్నారు. పార్లమెంట్లో అన్ని బిల్లులను ఆమోదిస్తూ బీసీ బిల్లు విషయంలో మాత్రం అన్ని పార్టీలు ముఖం చాటేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. చట్టసభల్లో రిజర్వేషన్లు పెడితే తప్ప ఈ దేశంలో సామాజిక న్యాయం జరగదని, అందుకోసం బీసీలు కేంద్రంపై సమరభేరీ మోగించడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో శారద, నీల వెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, బర్క కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు వర్తింపచేయాలి : కృష్ణయ్య
ముషీరాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకాన్ని బీసీలకు కూడా వర్తింపచేయాలని, ఇందుకు గాను ప్రస్తుత బడ్జెట్‌లోరూ.3 వేల కోట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు శారదా గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర ్భంగా మాట్లాడుతూ పథకాన్ని బీసీలకు వర్తింపజేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బీసీ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలు ప్రధాన భూమిక పోషించారన్నారు. బీసీ మహిళలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకుండా అన్యాయం చేశారన్నారు. పథకం వర్తింప చేస్తామని రాష్ట్రమంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇచ్చి మూడు నెలలు గడిచినా పట్టించుకోలేదని, వెంటనే పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శారదగౌడ్, గుజ్జకృష్ణ, లాల్‌కృష్ణ, భద్ర, కుల్కచర్ల శ్రీను, అరుణ్, మారేష్, సత్తి పాల్గొన్నారు. -
బడ్జెట్లో బీసీలకు అన్యాయం: ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్: బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. గత సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 60 వేల కోట్ల బడ్జెట్లో బీసీలకు 4800 కోట్లు కేటాయించారని, ఇప్పుడు లక్ష కోట్లలో బీసీలకు కేవలం రెండువేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. ప్రతి ఏటా నిధుల కేటాయింపులు పెరగాల్సిందిపోయి తగ్గడం ఎంతవరకు సమంజసమన్నారు. గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం బీసీల వ్యతిరేకిగా మారిందన్నారు. బడ్జెట్లో కొత్త పథకం ఒక్కటికూడా లేదన్నారు. సమావేశంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ర్యాగ రమేష్, శారదా గౌడ్, విక్రంగౌడ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కృష్ణయ్య
హైదరాబాద్: బీసీల సంక్షేం, అభివృద్ధి కోసం చట్టసభలలో పోరాటం చేస్తానని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. గౌడ యువజన సంఘర్షణ సమితి నాయకులు దూసరి వెంకటేష్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఆదివారం సాయంత్రం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఆర్.కృష్ణయ్యను కలిసి అభినంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్ అమలు కోసం చేసే పోరాటంలో బీసీలందరూ సంఘటితంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు ఎస్.లక్ష్మణ్‌గౌడ్, తండు లాలయ్యగౌడ్, దూసరి శ్రీనివాస్‌గౌడ్, సతీష్చంద్రగౌడ్, లోడ పరమేష్‌గౌడ్, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.