సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో సుమారు 80 శాతమున్న వెనుకబడిన, అణగారిన వర్గాల ప్రజల కోసం హైదరాబాద్ నగరంలో ఆత్మగౌరవ భవనాలను నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం 67.75 కోట్లను మంజూరు చేసింది. 32 కులాలకు, క్రిస్టియన్ భవనానికి కలిపి 71.30 ఎకరాలు కేటాయించింది. ఈ జాబితాలో సంచార జాతులను ఒక కులంగా పరిగణించింది. ఎరుకల ఆత్మగౌరవ భవనానికి ఆమోదం తెలిపింది.
అలాగే హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో ఐదు ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా వేచి చూసిన కేబినెట్ సమావేశం సాధారణ పరిపాలన నిర్ణయాలకు పరిమితమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం మంత్రివర్గ సమావేశం జరిగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన నాలుగేళ్ల మూడు నెలల కాలంలో అతితక్కువ సమయం జరిగిన మంత్రివర్గ సమావేశం ఇదే కావడం గమనార్హం. మంత్రివర్గ సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీశ్‌రావు, జోగు రామన్న విలేకరుల సమావేశంలో పాల్గొనగా కేబినెట్ నిర్ణయాలను ఈటల రాజేందర్ వెల్లడించారు. అసెంబ్లీ రద్దు అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ‘త్వరలోనే మరోసారి కేబినెట్ భేటీ అవుతుంది’అని కడియం, హరీశ్‌రావు బదులిచ్చారు.
కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు
వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న వివిధ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంపు. ఆశ కార్యకర్తల గౌరవ వేతనం ప్రస్తుతమున్న రూ. 6 వేల నుంచి రూ.7,500లకు, రెండో ఏఎన్‌ఎంల వేతనం ప్రస్తుతమున్న రూ. 11 వేల నుంచి రూ. 21 వేలకు, కాంట్రాక్టు వైద్యుల వేతనం రూ. 36 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు.
వరదలతో మిడ్ మానేరుకు గండిపడటం వల్ల ముంపునకు గురైన మన్వాడ గ్రామవాసుల విజ్ఞప్తి మేరకు వారికి ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయం. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 4.25 లక్షల చొప్పున మొత్తం రూ. 25.84 కోట్ల పరిహారం చెల్లించాలని నిర్ణయం.
పశుసంవర్ధకశాఖ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే గోపాలమిత్రల గౌరవ వేతనం రూ. 3,500 నుంచి రూ. 8,500కు పెంపు.
ఆలయాల్లోని అర్చకుల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కంటి వెలుగు’కార్యక్రమానికి ఆదరణ బాగుందని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. ‘కంటి వెలుగు’కార్యక్రమం అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment