సామాజిక వ్యాప్తితో కదిలిన తెలంగాణ సర్కార్‌ | TG govt focus on corona virus spred in Districts | Sakshi
Sakshi News home page

సామాజిక వ్యాప్తితో కదిలిన రాష్ట్ర ప్రభుత్వం

Published Mon, Jul 27 2020 4:44 AM | Last Updated on Mon, Jul 27 2020 9:21 AM

TG govt focus on corona virus spred in Districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా సామాజిక వ్యాప్తి జరగడంతో ప్రభుత్వం కదిలింది. రాష్ట్రవ్యాప్తంగా వైరస్‌ సోకడంతో వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలపై ఫోకస్‌ పెట్టింది. ఇప్పటివరకు హైదరాబాద్‌ కేంద్రంగా పరీక్షలు, చికిత్సలు జరగ్గా, ఇకనుంచి జిల్లా ల్లోనూ వాటిని నిర్వహించేలా ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు జిల్లా ఆసుపత్రి వరకు జ్వర బాధితుల గుర్తింపు, తక్షణ చికిత్స, పరీక్షలు, ఒకవేళ సీరియస్‌ అయితే ఆసుపత్రుల్లో చేర్పించడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జిల్లాల్లో వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని కదిలిం చేందుకు, వారికి దిశానిర్దేశం చేసేందుకు ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నడుం బిగించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే మొదటగా ఆదివారం ఆయన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సమీక్ష నిర్వహించారు. అక్కడ జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, సీజనల్‌ వ్యాధులను ఎదుర్కోవడంపై ఆయన జిల్లా పర్యటనలు కొనసాగనున్నాయి.

మౌలిక వసతులు, మందుల లభ్యతపై ఆరా
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54 వేలు దాటింది. 463 మంది చనిపోయారు. పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవు తోంది. సామాజిక వ్యాప్తి జరగడంతో వచ్చే నాలుగైదు వారాలు క్లిష్ట పరిస్థితి ఉంటుందని స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. మున్ముందు మరిన్ని కేసులు పెరిగే ప్రమాదముందని సర్కారే హెచ్చరించింది. పైగా ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే ఎక్కువగా కేంద్రీకృతమైన కేసుల సంఖ్య జిల్లాలకూ పాకింది. వైరస్‌ వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది. అందువల్ల జిల్లాల్లోని అర్హత కలిగిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

చికిత్స కంటే ముందే జ్వరం ఉన్నవారిని గుర్తించేందుకు రంగం సిద్ధం చేసింది. పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు జ్వరం సమయం లోనే కట్టడి చేయాలని నిర్ణయించింది. అయితే జిల్లా వైద్య యంత్రాంగంలో కరోనాను ఎలా డీల్‌ చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. అక్కడున్న అధికారులు ఇప్పటివరకు అనుమాని తుల శాంపిళ్లను తీసి హైదరాబాద్‌కు పంపేవారు. అంతకుమించి వారికి దీనిపై అంతగా అవగా హన లేదు. అందుకే జిల్లా యంత్రాంగాన్ని సమా యత్తం చేసేందుకు మంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర వైద్య అధికారుల బృందం జిల్లా పర్యటనలు ప్రారంభించింది. అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఆకస్మికంగా ఆసుపత్రుల తనిఖీలు చేయనుంది. మౌలిక సదుపాయాల కల్పన, మందుల లభ్యతపై ఆరా తీసి, అక్కడి అవసరాలను తెలుసుకొని ఏర్పాట్లు చేయనుంది. అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులతోనూ మంత్రి ఈటల చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. 
  
సిబ్బందికి ధైర్యం...
ఆశ వర్కర్‌ మొదలు డాక్టర్ల వరకు జిల్లాస్థాయిలో ఉన్న వారందరికీ కరోనాను ఎదుర్కొనేందుకు అవ సరమైన ధైర్యమిచ్చేందుకు మంత్రి పూనుకున్నారు. సిబ్బందికి వైరస్‌ సోకితే బెంబేలెత్తి ఆస్పత్రి మూసివేయకుండా ధైర్యం, విశ్వాసంతో వైద్యులు పనిచేయాలని పిలుపు ఇస్తున్నారు. కరోనా కట్టడిలో ఆశ వర్కర్ల పాత్ర కీలకమని, వారు సకాలంలో స్పందిస్తే కరోనాను తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని ఆయన జిల్లా పర్యటనల్లో ప్రస్తావించాలని నిర్ణయించారు. కరోనాను వీలైనంత త్వరగా గుర్తిస్తే ప్రమాదం ఉండదని కూడా ఆయన ప్రజలకు ధైర్యం నూరిపోస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement