నిరుపయోగంగా ఉన్న పాత కొడంగల్ జీపీ భవనం
సాక్షి, కొడంగల్: భారత జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మాటలకే పరిమితమైంది. గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించే గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు లేవు. మంజూరైన భవన నిర్మాణాలు నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోయాయి. గ్రామ సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షించే పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉద్యోగుల కొరత కారణంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ అధికారులను, ఉద్యోగులను నియమించకపోవడం వల్ల పరిపాలన సాగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. చిన్న జిల్లాలు, మండలాల వల్ల అధికారులు ప్రజలకు దగ్గరైనా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఐదారు గ్రామాలకు ఒక్క పంపచాయతీ కార్యదర్శిని నియమించడంతో ఏ గ్రామానికి న్యాయం చేయని పరిస్థితి నెలకొంది.
గ్రామ పాలన..
కొడంగల్ నియోజకవర్గంలోని మూడు మండలాలు వికారాబాద్‌లో జిల్లాలో కలిశాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించింది. కొత్త పంచాయతీల సంగతి దేవుడెరుగు. పాత పంచాయతీలకే ఉద్యోగులు, సిబ్బంది నియామకం జరగలేదు.
గత పంచాయతీల ప్రకారం కొడంగల్ మండలంలో 20, దౌల్తాబాద్‌లో 20, బొంరాస్‌పేటలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో పలు పంచాయతీలకు పక్కా భవనాలు లేవు. పక్కా భవనాలు లేకపోవడం వల్ల గ్రామానికి సంబంధించిన రికార్డులకు భద్రత కరువైంది.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాల్సిన పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. గ్రామాభివృద్ధిఅస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్యం లోపించింది.
నియోజకవర్గంలో ..
కొడంగల్‌ల మండలంలో 20 గ్రామపంచాయతీలకు గానూ 8 గ్రామాలకు పంచాయతీ భవనాలు లేవు. మండలంలో రుద్రారం, ఇందనూర్, అప్పాయిపల్లి, నాగారం గ్రామాలలో పంచాయతీ భవనాలు లేవు. రావులపల్లిలో జీపీ భవనం శిథిలావస్థకు చేరింది. లక్షీపల్లిలో భవనం ఉన్నా వినియోగంలో లేదు.
అంగడిరాయచూర్ గ్రామంలో జీపీ భవనం నిర్మాణం పూర్తి కాలేదు. బొంరాస్‌పేట మండలంలో ఎనికెపల్లి, మహంతీపూర్, హంసాన్‌పల్లి, కొత్తూరు గ్రామాలకు భవనాలు లేవు. దౌల్తాబాద్ మండలంలో 20 గ్రామాలకు గానూ 9 గ్రామాల్లో పంచాయతీ భవనాలు లేవు.
Comments
Please login to add a commentAdd a comment