బీసీల వెలుగురేఖ ‘బీపీ మండల్’
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలను పట్టి పీడిస్తున్న పేదరికం, వెనుకబాటుతనం నుంచి సమాజంలో వారిని భాగస్వాములను చేసే ప్రయత్నంలో బి.పి. మండల్ ( బిందేశ్వరిప్రసాద్ మండల్) చేసిన కృషి మరవలేనిదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. మండల్ కమిషన్‌లోని 40 సిఫారసులను పూర్తిగా అమలులోకి తెచ్చి బీసీల సమగ్రాభివృద్ధికి పాటు పడినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు.
మంగళవారం హైదరాబాద్‌లోని బీసీ భవన్‌లో బి.పి. మండల్ 97వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ మండల్ కమిషన్ రిపోర్టులోని కేవలం రెండు సిఫార్సులు మాత్రమే ప్రభుత్వం అమలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లయినా మిగిలిన సిఫార్సులు అమల్లోకి రాకపోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అన్నారు. బీసీలకు చట్ట సభలలో జనాభా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ తన సిఫార్సులలో వీటిని ప్రధానంగా సూచించినా..
అవి ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కులాల వారీగా బీసీల లెక్కలను తీసి, శాస్త్రీయంగా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మండల్ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఇన్నాళ్లకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చినప్పటికీ, కులాలవారీ లెక్కలను బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచడం దురదృష్టకరమన్నారు. వెంటనే కులాల వారీగా లెక్కలను ప్రకటించి, బీసీల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక తత్వవేత్త బి.ఎస్.రాములు మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం ఏర్పాటైన ప్రభుత్వాలన్నీ బీసీలకు రిజర్వేషన్లు నిరాకరిస్తూ వచ్చాయని, జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ రిజర్వేషన్ల కోసం కృషి జరిగిందని గుర్తు చేశారు.
ఆ క్రమంలోనే బి.పి. మండల్‌తో మండల్ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ ఉద్యమ వేదిక ఆవిర్భావం
బీసీల సమస్యలపై పోరాడేందుకు బీసీ ఉద్యమ వేదిక పేరు తో మరో సంస్థ ఆవిర్భవించింది. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బీపీ మండల్ జయంతి వేడుకల్లో వేదికను ప్రారంభించారు. బీసీ ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు దేశగాని సాంబశివగౌడ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వీజీఆర్ నారగోని, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్‌రావు, ఓబీసీ జాతీయ అధ్యక్షులు దునుకు వేలాద్రి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ నాయకులు డాక్టర్ వినయ్‌కుమార్, జైహింద్ గౌడ్, బీసీ సంక్షేమసంఘం మహిళా అధ్యక్షురాలు డా.శారదగౌడ్, ప్రొ.అఖిలేశ్వరి, మేకపోతుల నరేశ్ తదితరులు ప్రసంగించారు. బీసీల రాజ్యాధికారం కోసం మండల్ స్ఫూర్తితో పోరాడాలని వారు పిలుపునిచ్చారు.