పోరాట ఫలితమే..!
ముషీరాబాద్: నిరుద్యోగుల పోరాట ఫలితంగానే గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ముఖ్యమంత్రి నిరుద్యోగుల మన్ననలు పొందాలన్నారు. సోమవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2 ఉద్యోగాలను 1027 పోస్టులను ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించటం అభినందనీయమన్నారు.
గత రెండేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నోటిఫికేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్నారన్నారు. 22 ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–2 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 11 శాఖల పరిధిలో 1027 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించటం దారుణమన్నారు. ప్రమోషన్లకు అలవాటు పడిన అధికారులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటాకు రావాల్సిన పోస్టులను వివిధ స్థాయిల్లో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఖాళీగా ఉన్న 40వేల టీచర్, గ్రూప్–3 కింద 8500 పోçస్టులను, గ్రూప్–4 ద్వారా 36వేల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, అంజి, రాంబాబు, బిక్షపతి, అరుణ్‌యాదవ్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.