సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై అధికారంలోకి వచ్చిన తొలిరోజే సంతకం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాంటి పార్టీకే నిరుద్యోగులు మద్దతు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. బుధవారం బీసీ భవన్‌లో తెలంగాణ నిరుద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి, ఓయూ నిరుద్యోగ జాక్, రాష్ట్ర నిరుద్యోగ సంఘర్షణ సమితి, రాష్ట్ర నిరుద్యోగ యువజన సంఘం, బీసీ విద్యార్థి సంఘాల సమితితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలు సృష్టించమనడం లేదని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలనే భర్తీ చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో కేవలం 18వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment