Unemployment Youth
-
అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్
-
యువత ఆశల్ని కేంద్రం చిదిమేసింది
న్యూఢిల్లీ: పెట్టుబడిదారులైన కొందరు మిత్రుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది యువత ఆశల్ని చిదిమేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల్లోని 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగిత రికార్డు స్థాయికి చేరుకుందని తెలిపారు. దేశానికి గర్వకారణమైన ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం ప్రతి నిరుద్యోగ యువతకు కల..అలాంటి వాటిని ప్రభుత్వం వదిలేసిందన్నారు. రాహుల్ గాంధీ ఆదివారం ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. ‘2014లో పీఎస్‌యూల్లో 16.9 లక్షల ఉద్యోగాలుండగా 2022 వచ్చే సరికి వాటి సంఖ్య 14.9 లక్షలకు పడిపోయింది. బీఎస్ఎన్ఎల్లో 1,81,127 ఉద్యోగాలు, సెయిల్‌లో 61,928, ఎంటీఎన్ఎల్లో 34,997, ఎస్ఈసీఎల్లో 29,140, ఎఫ్‌సీఐలో 28,063, ఓఎన్జీసీలో 21,120 ఉద్యోగాలు తగ్గిపోయాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉద్యోగిత పడిపోతుందా?’అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలిస్తామంటూ తప్పుడు వాగ్దానాలు చేసిన ప్రభుత్వం.. ఉద్యోగాల కల్పనను మరిచిపోయి 2 లక్షల ఉద్యోగాలను లేకుండా చేసిందన్నారు. ఇదే సమయంలో పీఎస్‌యూల్లో కాంట్రాక్టు నియామకాలు పెరిగిపోయాయి. ఇలా కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం రిజర్వేషన్ హక్కును లాగేసుకోవడం కాదా? ఇది ఈ సంస్థలను ప్రైవేట్‌పరం చేసే కుట్ర కాదా?’అని రాహుల్ ప్రశ్నించారు. ఒక వైపు పారిశ్రామిక వేత్తల రుణాల మాఫీ, మరోవైపు పీఎస్‌యూల్లో ప్రభుత్వ ఉద్యోగాల తొలగింపు! అమృత్కాల్ అంటే ఇదేనా’అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు
సాక్షి, హైదరాబాద్: చిరిగిన పుస్తకాలు..విరిగిన కుర్చీలు.. తిరగని పంకాలు.. ఇదీ మన గ్రంథాలయాల్లో నెలకొన్న పరిస్థితి. రాష్ట్రంలో 80 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగ యువతకు గ్రంథాలయాల్లో కుర్చునేందుకు కుర్చీలు కూడా దొరకడంలేదు. ఉన్న కుర్చీలు ఎక్కడ నడ్డివిరుస్తాయోననే ఆందోళన.. ఫ్యాను తిరగక ఉక్కపోత వెరసి ఉద్యోగార్థులకు ఈ లైబ్రరీలు చెమటలు కక్కిస్తున్నాయి. మరోవైపు గ్రంథాలయాలకు రావాల్సిన నిధులకు స్థానిక సంస్థలు గండికొడుతున్నాయి. వసూలు చేసే ఆస్తిపన్నులో 8 శాతం రావాల్సిన సుంకాన్ని సైతం ఇవ్వకుండా ఎగ్గొడుతున్నాయి. నగర గ్రంథాలయ సంస్థకు జీహెచ్ఎంసీ ఏకంగా రూ.800 కోట్ల మేర బకాయిపడింది. ఈ నిధులు సకాలంలో రాకపోవడంతో పాత పుస్తకాలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా..ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, ఇతర అవసరాల కోసం నెలకు రూ.15 లక్షలకు ఖర్చవుతున్నాయి. గ్రంధాలయాలు కిటకిట పోటీ పరీక్షల శిక్షణ సంస్థలన్నీ గ్రేటర్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. కోచింగ్ కోసం ఇక్కడి అభ్యర్థులే కాకుండా తెలంగాణ, ఏపీ, ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థు లు కూడా ఇక్కడికే వస్తుంటారు. వీరిలో చాలా మంది ఆయా కోచింగ్ సెంటర్లు, వర్సిటీ, ఇతర గ్రం«థాలయాలకు సమీపంలోని ప్రైవేటు హాస్టళ్లు, గదులను అద్దెకు తీసుకుని ఉంటూ పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. వాటిలో కంబైన్డ్ స్టడీస్‌కు అవకాశం లేకపోవడం, ఉన్న వాటిలోనూ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో సమీపంలోని నగర, జిల్లా, మండల కేంద్ర గ్రంధాలయాలను ఆశ్రయిస్తున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర గ్రంధాలయం సహా చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, ఓయూ, తెలుగు విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలు అభ్యర్థులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కావాల్సిన గ్రంథాల యాలు..ఏళ్ల తరబడి తాళపత్ర గ్రంథాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, నవలలు, సాహిత్యం, కథలు, నిఘంటవులు, న్యూస్ పేపర్లు, కరెంట్ ఎఫైర్స్ బుక్స్‌కే పరిమితవుతున్నాయి. కుర్చీ దొరకదు..ఫ్యాన్లు తిరగవు ఆయా గ్రంధాలయాల్లో విద్యార్థుల నిష్పత్తి మేరకు ఫర్నీచర్ లేకపోవడం ఇబ్బందిగా మారింది. అభ్యర్థులే స్వయంగా కుర్చీలు, ప్యాడ్లు కొనుగోలు చేసుకోవాల్సివస్తోంది. మార్కెట్లో రకరకాల పుస్తకాలు అందుబాటులోకి వస్తే..ఆయా గ్రం«థాలయాల్లో మాత్రం ఇప్పటికీ పాత పుస్తకాలే దర్శనమిస్తున్నాయి. పోటీ పరీక్ష ల పుస్తకాలే కాదు మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే విద్యార్థులు అడిగిన పుస్తకాలను కొను గోలు చేసి అందుబాటులో ఉంచుతున్నట్లు గ్రంథపాలకులు చెప్పుతున్నప్పటికీ..ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. పుస్తకాలు వితరణకు దాతలు సుముఖంగా ఉన్నప్పటికీ...వాటిని తీసుకుని భద్రపరిచేందుకు అనువైన స్థలం లేకపోవడం గమనార్హం. కనీస సదుపాయాలు లేవు ఇంట్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం లేదు. కోచింగ్ సెంటర్లకు వెళ్లే ఆర్థిక స్తోమత కూడా లేదు. గ్రంథాలయంలో ఏకాంతంగా కూర్చొని నచ్చిన పుస్తకాన్ని చదువుకోవచ్చని భావించి ఇక్కడికి వచ్చాం. తీరా ఇక్కడ కూర్చొని చదువుకునేందుకు కుర్చీలే లేవు. మేమే స్వయంగా వీటిని సమ కూర్చుకోవాల్సి వస్తుంది. వేసవి ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన ఫ్యాన్లు కూడా లేవు. ఉన్నవాటిలోనూ చాలా వరకు పని చేయడం లేదు. –హరికృష్ణ, మెదక్ భోజనం, మంచినీటి వసతి కల్పించాలి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రూ.5 భోజనం సరఫరా చేస్తుంది. అయితే నాణ్యత లేకపోవడంతో తినలేకపోతున్నాం. హోటళ్లలో తిందామంటే ఖర్చులకు డబ్బులు కూడా లేవు. ఖాళీ కడుపుతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంతేకాదు గ్రంధాలయంలో తాగునీరు కూడా లేకపోవడంతో బాటిళ్లను వెంట తెచ్చుకోవాల్సి వస్తుంది. కుర్చీలు లేక చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సి వస్తుంది. –శివకుమార్, సంగారెడ్డి (చదవండి: పక్కాగా లెక్క.. బడి బయట పిల్లలెందరు..?) -
కృష్ణదేవరాయ యూనివర్శిటీలో కి‘లేడీ’
సాక్షి, ఎస్కేయూ(అనంతపురం) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల కల్పన పేరుతో నిరుద్యోగులను వంచనకు గురిచేసిన వ్యవహారం సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆరుగురు యువకులు సోమవారం ఎస్కేయూ వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు వచ్చారు. వారి వద్ద ఉన్న నియామక పత్రాలను అధికారులకు అందజేసి, మాట్లాడారు. ఆ పత్రాలను పరిశీలించిన అధికారులు అవి నకలీవిగా ధ్రువీకరించారు. వీసీ ఆచార్య రహంతుల్లా సంతకాన్ని ఫోర్జరీ చేసి నియామక పత్రాలు జారీ చేసినట్లు తేలిచెప్పారు. దీంతో వాటిని తీసుకువచ్చిన నిరుద్యోగులు అయోమయానికి గురయ్యారు. వెంటనే తమకు ఆ నియామక పత్రాలు అందజేసిన యువతని ఫోన్లో నిలదీశారు. అధికారుల ఎదుట తాము భంగపడిన వైనాన్ని వివరించారు. దీంతో స్వీయ రక్షణలో పడిన ఆ యువతి వెంటనే వారిని అక్కడి నుంచి వచ్చేయాలని, వారు ఇచ్చిన డబ్బును వెనక్కు చెల్లిస్తానంటూ నమ్మబలికింది. దీంతో వారు అక్కడి నుంచి ఉడాయించారు. ఈ వ్యవహారంలో సదరు నిరుద్యోగుల నుంచి రూ. 6 లక్షలు ఆ యువతి దండుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నకిలీ నియామక పత్రాలు, వీసీ సంతకం ఫోర్జరీ వ్యవహారంపై ఎస్కేయూ ఉన్నతాధికారులు ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నోటిఫికేషన్‌తోనే ఉద్యోగాల భర్తీ ఎస్కేయూలో ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఈ సందర్భంగా వర్సిటీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఒకవేళ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తే కచ్చితంగా పబ్లిక్ నోటిఫికేషన్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. వర్సిటీలో ఉద్యోగాల పేరుతో గతంలో చాలా మంది నిరుద్యోగులను పలువురు మోసం చేసి సొమ్ము చేసుకున్నారని గుర్తు చేశారు. ఇటీవల క్యాంపస్ కళాశాలలోని విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చామని, వెంటనే విధుల్లోకి చేరాలంటూ నిరుద్యోగులను మోసం చేసి రూ. లక్షల్లో ఓ యువతి దండుకున్న వైనంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. తాజాగా వీసీ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏకంగా నియామక పత్రాలు జారీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ఉత్త డప్పే.. జాబేదీ?
సాక్షి, గూడూరు : ‘జాబు రావాలంటే.. బాబు రావాలంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మర్చిపోయారు. కొత్త ఉద్యోగాల సృష్టి దేవుడెరుగు.. కనీసం ఖాళీ పోస్టులను భర్తీ చేయండని అడిగితే పోలీసులతో కొట్టిస్తున్నారు. కూలీనాలి చేసి మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించారు. కానీ ఉద్యోగాలు మాత్రం రావడం లేదు’ అంటూ నిరుద్యోగులు ఆక్రోశం వెలిబుచ్చారు. ‘పరిశ్రమల కోసం భూములిచ్చినా ఉపయోగం లేకపోయింది. నాయుడుపేట, తడ ప్రాంతాల్లో సెజ్‌లున్నా ఉద్యోగాలు రాలేదు. ఇప్పటికీ తల్లిదండ్రులపై ఆధారపడుతున్నాం. నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు చివరకు అదికూడా సక్రమంగా ఇవ్వలేదు’ అంటూ విరుచుకుపడ్డారు. ‘జాబు రావాలంటే బాబు గద్దె దిగాలి. మా బాగోగులు చూసే వారికే ఈ ఎన్నికల్లో పట్టం కడతాం’ అని స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పెద్ద మసీదు సమీపంలోని రచ్చబండ వద్ద కూర్చొని ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికలు తిరగేస్తున్న యువతను కదిలించగా వారి మనోగతాన్ని వెలుబుచ్చారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భాళీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీని పునరుద్ధరించని ఫలితంగా గ్రూప్ 1, 2 వంటి 25 వేల పోస్టులు భర్తీ కావట్లేదు. గ్రూప్ 4, ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనూ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న కార్యదర్శుల పోస్టులను, పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలి’ అని డిమాండ్ చేశారు. ‘జాబు’ రాసి మరీ ఆత్మహత్య చంద్రబాబు హయాంలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందనే దానికి 2017 ఏప్రిల్ 17న విశాఖలో చోటుచేసుకున్న ఘటన సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మర్రిపాలెంకు చెందిన నిరుద్యోగి పితాని శివదుర్గా ప్రసాద్.. చంద్రబాబు గెలిస్తే తన కష్టాలు తీరిపోతాయని భావించాడు. తన ఓటు టీడీపీకే వేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడేళ్లు పూర్తయ్యాయి. అయినా ఉద్యోగం రాలేదు. ఉపాధి సైతం దొరకలేదు. దీంతో ఆ యువకుడు సీఎం చంద్రబాబుకు తన బాధను, అవేదనను వ్యక్తం చేస్తూ ఓ లేఖ రాసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘జాబు లేదని నా భార్య కూడా నన్ను వదిలేసి వెళ్లిపోయింది. ఇది నాలాంటి నిరుద్యోగ యువతకు కనువిప్పు కావాలి’ అని చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. నిరుద్యోగ యువత తనలా అత్మహత్యకు పాల్పడవద్దని, హోదా వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆ లేఖలో పేర్కొన్నాడు. చంద్రబాబు మోసం చేశారు మా నాన్న నజీర్ కూలీకి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నన్ను బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివించాడు. చదువు పూర్తయ్యాక బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరా. ప్రాజెక్ట్ పూర్తవగానే ఇంటికి పంపేశారు. అప్పటి నుంచి ఉద్యోగావకాశాల కోసం తిరుగుతున్నా ఫలితం లేదు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. – ఎస్కే జిలానీబాషా, గూడూరు ఉద్యోగాలు రావడం లేదు ప్రభుత్వ విధానాలవల్లే ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగాలు రావడం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు గొప్పలు చెప్పి నాలుగున్నరేళ్ల తర్వాత అందుకు సవాలక్ష నిబంధనలు పెట్టారు. రాష్ట్రంలో 1.30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం గ్రూప్–4 పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. – కె.నేతాజీ, బీటెక్, గూడూరు ఉపాధి అవకాశాలు కల్పించాలి ఐటీఐ డీజిల్ మెకానిక్ కోర్సు పూర్తి చేశాను. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాను. చదువు పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రాష్ట్రంలో ఉన్న ఖాళీ పోస్టులను ఏటా భర్తీ చేస్తే కొంతవరకైనా నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదు. ఇలా అయితే నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి. – కె.నవీన్, గూడూరు -
‘ఖాళీల భర్తీకి తొలిరోజే సంతకం చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై అధికారంలోకి వచ్చిన తొలిరోజే సంతకం చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాంటి పార్టీకే నిరుద్యోగులు మద్దతు ఇస్తారని ఆయన స్పష్టం చేశారు. బుధవారం బీసీ భవన్లో తెలంగాణ నిరుద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి, ఓయూ నిరుద్యోగ జాక్, రాష్ట్ర నిరుద్యోగ సంఘర్షణ సమితి, రాష్ట్ర నిరుద్యోగ యువజన సంఘం, బీసీ విద్యార్థి సంఘాల సమితితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలు సృష్టించమనడం లేదని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలనే భర్తీ చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో కేవలం 18వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసినట్లు చెప్పారు. -
నిరుద్యోగులకు ఆర్థిక సహకారం కోసం ఇంటర్వ్యూలు
ఆదిలాబాద్‌అర్బన్: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద జిల్లాలోని నిరుద్యోగ యువతకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందించడానికిఇంటర్వ్యూలు నిర్వహించామని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జాదవ్ రాంకిషన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం, ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థల ద్వారా నిరుద్యోగులకు సేవారంగం, పరిశ్రమల స్థాపన వంటి వాటిని నెలకొల్పడానికి బ్యాంకులు, ఆయా సంస్థల ద్వారా రుణాల మంజూరుకు ఇంటర్వూ్యలు నిర్వహించామని పేర్కొన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా రుణాలు పొందడానికి 81మంది దరఖాస్తు చేసుకోగా.. 42 మంది హాజరయ్యారని, కె.వీ.ఐ.బీ నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి 149మంది దరఖాస్తు చేసుకోగా 65 మంది హాజరయ్యారని, కేవీఐసీ ద్వారా రుణాల కోసం 27మంది దరఖాస్తు చేసుకోగా 11మంది హాజరైనట్లు తెలిపారు. ఎంపికైన జాబితా అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం.ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.కిషన్, కేవీఐబీ సహాయ సంచాలకులు ఎం.సీ.రాంప్రసాద్, కేవీఐసీ జిల్లా కో ఆర్డినేటర్ జి.నారాయణరావు, ధన్నూర్ సర్పంచ్, కమిటీ సభ్యురాలు బి.లక్ష్మీ, మెప్మా నుండి సుభాష్ పాల్గొన్నారు. -
వచ్చేనెల 4నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ర్యాలీ
నిజామాబాద్‌నాగారం : నిరుద్యోగ యువత కోసం ఆసక్తి ఉన్న వారికి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్టెప్ ఇన్చార్జి సీఈవో ముత్తెన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ర్యాలీ ఫిబ్రవరి4నుంచి 13వరకు ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉంటుందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 19లోగా www.joinindianarmy.nic.in నందు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారికి అదే వెబ్సైట్లో అడ్మిట్‌కార్డు వస్తుందన్నారు. -
నో ప్లేస్మెంట్
నిరుద్యోగ యువతకు ఉపాధి కరువు ఖరారు కానీ ఈజీఎంఎంకు విధివిధానాలు ఈఎస్టీలో శిక్షణ పూర్తి చేసుకున్న మూడు బ్యాచ్‌లు ఉద్యోగాలు చూపని అధికారులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఉద్యోగం పురుష లక్షణం.. ఇది ఒకప్పటి మాట. ఉద్యోగం జీవనాధారం అనేది ప్రస్తుతం వాస్తవం. నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వం ఉద్యోగం సాధించాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. ప్రైవేటు రంగంలోనైనా ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందామనుకున్నా అవసరమైన నైపుణ్యం, శిక్షణ అవసరం. గత ప్రభుత్వం రాజీవ్ యువకిరణాల పేరుతో వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపాధిని చూపించారు. గత ఏడాది అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఈజీఎంఎం(ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మేనేజింగ్ మిషన్) ప్రారంభించారు. అయితే నేటికి దానికి సంబంధించిన విధివిధానాలు, లక్ష్యాలు ఖరారు కాలేదు. దీంతో జిల్లా అధికారులు చేతులెత్తాశారు. ఏడాది నుంచి ఒక్కరికీ ప్లేస్మెంట్ చూపించలేకపోయారు. ఫలితంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కరువైంది. ఒక్కరికీ ఉపాధి చూపని ఈజీఎంఎం ఈజీఎంఎంకు సంబంధించిన విధివిధానాలు, లక్ష్యాలేవి ఖరారు కాలేదు. దీంతో నిరుద్యోగ యువతకు శిక్షన ఇచ్చి ఉపాధిని చూపించేందుకు వీలుకావడం లేదని డీఆర్డీఏ అధికారులు పేర్కొంటున్నారు. జూన్, జూలై నెలల్లో విధివిధానాలు వచ్చే అవకాశం ఉంది. కాగా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో తాండ్రపాడులోని శిక్షణ కేంద్రంలో ప్రస్తుతం 39 మంది నిరుద్యోగులతో ఒక బృందం శిక్షణ పొందుతోంది. వీరికి స్కిల్ డెవలప్‌మెంట్‌తోపాటు ఇంగ్లిషు, కంప్యూటర్స్, వర్క్రెడీ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ తరగతులు మరో మూడు నెలల్లో పూర్తవ్వగానే స్థానికంగా లభించే ప్రైవేట్ ఉద్యోగాలను చూపిస్తామని జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రసాదుబాబు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో పట్టణ జీవనోపాధుల మిషన్‌లో అమలవుతోంది. ఇందులో భాగంగా ఈఎస్టీ(ఎంప్లాయ్మెంట్ త్రో స్కిల్ అండ్ ట్రైనింగ్) పథకంలో ఇప్పటి వరకు 16 బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. అందులో మూడు బ్యాచ్‌లకు మాత్రమే శిక్షణ తరగతులు ఇటీవలే పూర్తయ్యాయి. మిగతావి మరో రెండు మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. శిక్షణ తరగతుల నిర్వహణలో పరుగులు పెట్టిన మెప్మా అధికారులు ప్లేస్మెంట్లు చూపడంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. ఒక్కరికీ ఉపాధిని చూపిన దాఖలాలు కనిపించడంలేదు. శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు మరో రెండు, మూడు వారాల్లో ఉద్యోగాలు చూపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మెప్మా అధికారులు పేర్కొంటున్నారు. యువతకు ఉద్యోగ నైపుణ్యాలు నేర్పాలి ప్రైవేట్ ఉద్యోగల కోసం అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పించాలి. అందుకు సంబంధించిన శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు చూపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. రాజీవ్ యువ కిరణాల స్థానంలో వచ్చిన ఈజీఎంఎంకు విధివిధానాలను వెంటనే విడుదల చేయాలి. పథకం అమలయితే కొంతమందైనా శిక్షణ తీసుకొని ఉపాధిని పొందుతారు. స్థానికంగా ఉండే ప్రైవేట్ ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. - లెనిన్‌బాబు, ఏఐవైఎఫ్ నాయకులు 16 బ్యాచ్‌లకు శిక్షణ తరగతులు నడుస్తున్నాయి పట్టణ జీవనోపాధుల మిషన్‌లో యువతకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని నంద్యాల, ఆదోని, కర్నూలు నగరల్లోని యువతకు మెళకువలను నేర్పేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకు 16 బ్యాచ్‌లు ప్రారంభం కాగా మూడు పూర్తయ్యాయి. శిక్షణ పూర్తయిన బ్యాచ్‌లకు స్థానికంగా ఉండే ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - వెంకటేశ్, జిల్లా ఉపాధికల్పనాధికారి, మెప్మా కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలి ప్రభుత్వం ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వాలి. ఈ రోజు ఏ ఉద్యోగానికి వెళ్లిన కంప్యూటర్‌పై పట్టు ఉందా అని అడుగుతున్నారు. కనీసం బేసిక్స్పైనైనా శిక్షణ ఇవ్వాలి. గతంలో స్థానికంగానే కంప్యూటర్ ఉచితంగా నేర్పేవారు. ఇప్పుడు అలాంటి పద్ధతినే ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో కంప్యూటర్ కోర్సులకు వేలల్లో తీసుకుంటున్నారు. - అంజి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
ఏమిటీ ప్రగతి!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర విభజన నేపథ్యంలో ‘అనంత’ పారిశ్రామిక ప్రగతి ప్రశ్నార్థకం అవుతోంది. అవగాహన ఒప్పందాల (ఎంవోయూ)కే పరిమితమైన పరిశ్రమలు కార్యరూపం దాల్చడంపై అనుమానాలు వ్యక్తవుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వాటి ఊసే లేకపోవడం దీన్ని బలపరుస్తోంది. ఇది దుర్భిక్ష ‘అనంత’లో నిరుద్యోగ యువత ఉపాధికి శరాఘాతంగా మారింది. దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో యువతకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలను స్థాపించడం ఒక్కటే మార్గం. ఇదే విషయాన్ని గుర్తించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా భారత్ దైనిక్స్ లిమిటెడ్(బీడీఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎస్), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లు రూ.11 వేల కోట్లతో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఆ సంస్థల యాజమాన్యంతో 2008లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. క్షిపణుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు బీడీఎల్‌కు.. హెలికాప్టర్ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు హెచ్ఏఎల్కు ఆ ఏడాదిలోనే భూమిని కేటాయించింది. ఆ పరిశ్రమలు కార్యరూపం దాల్చే క్రమంలోనే వైఎస్ హఠాన్మరణం చెందారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు పలుమార్లు జిల్లాలో పర్యటించి.. హిందూపురం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై ఓడరేవు దగ్గరలో ఉండటం, ఎన్‌హెచ్-44, రైల్వే మార్గాలు అందుబాటులో ఉండటం, చౌక ధరలకు భూములు లభిస్తుండటం, మానవ వనరులు అపారంగా ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు అంగీకారం తెలిపాయి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిశ్రమదీ ఇదే దుస్థితి. డి.హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల పరిధిలో నేమకల్లు-హిబ్సేహాల్ వద్ద ఇనుప పిల్లెట్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కుద్రేముఖ్ ఐరన్ వోర్ కంపెనీ లిమిటెడ్(కేఐవోసీఎల్), ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో 51 శాతం ఏపీఎండీసీ, 49 శాతం కేఐవోసీఎల్కు వాటాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదర్చుకున్నాయి. వీటికి నేమకల్లు సమీపంలోని 1,200 హెక్టార్లలో ఇనుప ఖనిజం నిల్వలను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది జనవరి నాటికి పరిశ్రమ పనులను ప్రారంభిస్తామని కేఐవోసీఎల్-ఏపీఎండీసీలు పేర్కొన్నాయి. కానీ.. ఇప్పటిదాకా శంకుస్థాపన కూడా చేయలేదు. పైన పేర్కొన్న పరిశ్రమలు ఏర్పాటైతే జిల్లాలో 1.50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంవోయూలకు ఆ పరిశ్రమల యాజమాన్యాలు ఏ మేరకు కట్టుబడతాయన్నది అంతుచిక్కడం లేదు. సీమాంధ్రకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో కూడా ఆ పరిశ్రమల ఊసు లేకపోవడం గమనార్హం. జిల్లా నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి.. ఆ ఎంవోయూలు కార్యరూపం దాల్చేలా చూడాలన్న అభిప్రాయం జిల్లా ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. -
రాబోయేది ప్రజల పాలన
వీరపునాయునిపల్లె, న్యూస్‌లైన్ : రెండు నెలల్లో ప్రజలు కోరుకున్న పాలన రాబోతోందని వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. మండలంలోని అంకిరెడ్డిపల్లె గ్రామంలో ఎస్.మునిరెడ్డి, ఆంజనేయరెడ్డి, ఎస్.చిన్నమునిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, ఓబన్న, ఓబులు, పోతులూరయ్య, బాల వీరయ్య తదితరులు తమ అనుచరులతో వైఎస్ఆర్ సీపీలో చేరారు. వీరిని రవీంద్రనాథరెడ్డి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వీరిని అభినందించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. త్వరలో మంచి పాలన అందుతుందని.. జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, వైఎస్ఆర్ సీపీ విద్యుత్ విభాగపు రాష్ట్ర నాయకులు పాండు రంగారెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ సుదర్శన్‌రెడ్డి, స్థానిక నాయకులు శంభురెడ్డి, అడవిచెర్లోపల్లె సర్పంచ్ సాంబశివారెడ్డి పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకే ఫ్యాక్టరీల ఏర్పాటు కడప జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వైఎస్ జగన్ భారతి సిమెంటు కర్మాగారం ఏర్పాటు చేశారని వైఎస్ఆర్ సీపీ సీజీసీ సభ్యులు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం అంకిరెడ్డిపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించి వెనుకబడిన ప్రాంతమైన కమలాపురం నియోజకవర్గంలో భారతి సిమెంటు కర్మాగారాన్ని జగన్ ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుపై కొంతమంది చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. జగన్ సీఎం అయిన వెంటనే అంబవరం దగ్గర ఉన్న 6వేల ఎకరాలను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారన్నారు. మండల కన్వీనర్ రఘునాథరెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ సుదర్శన్‌రెడ్డి వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర నాయకులు పాండు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.