సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాష్ట్ర విభజన నేపథ్యంలో ‘అనంత’ పారిశ్రామిక ప్రగతి ప్రశ్నార్థకం అవుతోంది. అవగాహన ఒప్పందాల (ఎంవోయూ)కే పరిమితమైన పరిశ్రమలు కార్యరూపం దాల్చడంపై అనుమానాలు వ్యక్తవుతున్నాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో వాటి ఊసే లేకపోవడం దీన్ని బలపరుస్తోంది. ఇది దుర్భిక్ష ‘అనంత’లో నిరుద్యోగ యువత ఉపాధికి శరాఘాతంగా మారింది. దేశంలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో యువతకు ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలను స్థాపించడం ఒక్కటే మార్గం. ఇదే విషయాన్ని గుర్తించిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై ఒత్తిడి తెచ్చారు.
ఫలితంగా భారత్ దైనిక్స్ లిమిటెడ్(బీడీఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎస్), హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లు రూ.11 వేల కోట్లతో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఆ సంస్థల యాజమాన్యంతో 2008లో అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది. క్షిపణుల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు బీడీఎల్‌కు.. హెలికాప్టర్ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు హెచ్‌ఏఎల్‌కు ఆ ఏడాదిలోనే భూమిని కేటాయించింది. ఆ పరిశ్రమలు కార్యరూపం దాల్చే క్రమంలోనే వైఎస్ హఠాన్మరణం చెందారు.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు పలుమార్లు జిల్లాలో పర్యటించి.. హిందూపురం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, చెన్నై ఓడరేవు దగ్గరలో ఉండటం, ఎన్‌హెచ్-44, రైల్వే మార్గాలు అందుబాటులో ఉండటం, చౌక ధరలకు భూములు లభిస్తుండటం, మానవ వనరులు అపారంగా ఉండటాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు అంగీకారం తెలిపాయి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు నోచుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పరిశ్రమదీ ఇదే దుస్థితి. డి.హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల పరిధిలో నేమకల్లు-హిబ్సేహాల్ వద్ద ఇనుప పిల్లెట్ల పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు కుద్రేముఖ్ ఐరన్ వోర్ కంపెనీ లిమిటెడ్(కేఐవోసీఎల్), ఆంధ్రప్రదేశ్ మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎండీసీ) సంస్థలు ముందుకొచ్చాయి. ఇందులో 51 శాతం ఏపీఎండీసీ, 49 శాతం కేఐవోసీఎల్‌కు వాటాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదర్చుకున్నాయి. వీటికి నేమకల్లు సమీపంలోని 1,200 హెక్టార్లలో ఇనుప ఖనిజం నిల్వలను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది జనవరి నాటికి పరిశ్రమ పనులను ప్రారంభిస్తామని కేఐవోసీఎల్-ఏపీఎండీసీలు పేర్కొన్నాయి. కానీ.. ఇప్పటిదాకా శంకుస్థాపన కూడా చేయలేదు. పైన పేర్కొన్న పరిశ్రమలు ఏర్పాటైతే జిల్లాలో 1.50 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎంవోయూలకు ఆ పరిశ్రమల యాజమాన్యాలు ఏ మేరకు కట్టుబడతాయన్నది అంతుచిక్కడం లేదు. సీమాంధ్రకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో కూడా ఆ పరిశ్రమల ఊసు లేకపోవడం గమనార్హం. జిల్లా నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి.. ఆ ఎంవోయూలు కార్యరూపం దాల్చేలా చూడాలన్న అభిప్రాయం జిల్లా ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది.
ఏమిటీ ప్రగతి!
Published Sun, May 25 2014 2:07 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement