అన్నీ చేస్తా..
సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జిల్లా పర్యటన తొలి రోజు ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. ఎక్కడా ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. ముందుగా నిర్ణయించుకున్న విధంగా చెప్పాల్సింది చెప్పారు. రాష్ట్రం కష్టాల్లో ఉందని, ప్రజలు సహకరించాలని ప్రతి చోటా చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి సమయం పడుతుందని, ఓపికతో ఉండాలని కోరారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలన్నీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నా.. రాష్ట్ర విభజన జరగడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. మనకు అప్పులు మిగిలాయి. వనరులు కూడా కొద్దిగానే ఉన్నాయి. ఉన్నవాటిని ఉపయోగించుకుని అన్ని హామీలనూ ఒకొక్కటిగా నెరవేరుస్తా. నేను ఒక్కటే చెబుతున్నాను. నాకు మీ సహకారం ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చడం పెద్ద కష్టమేమీ కాదు’ అని అన్నారు. గురువారం ఆయన పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉదయం ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకున్నాక.. తొలుత పుట్టపర్తి సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు.. జిల్లా ఎమ్మెల్యేలు ,మంత్రులతో మాట్లాడారు.
అక్కడి నుంచి నేరుగా ఎనుములపల్లి క్రాస్‌లో ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్వాక్రా రుణాల మాఫీపై సంఘానికి రూ.లక్ష కాకుండా మరేదైనా ప్రకటన చేస్తారేమోనని ఆశతో మహిళలు తరలివచ్చారు. రుణం ఎప్పుడు మాఫీ అవుతుందన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో మహిళలు గందరగోళానికి గురయ్యారు. రుణమాఫీకే ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు రాష్ట్రాన్ని మరో అమెరికా, సింగపూర్‌లా తీర్చిదిద్దుతానని పదే పదే చెబుతుండటంతో పలువురు నవ్వుకున్నారు.
ఎన్నికల యాత్రలా..
బాబు పర్యటల ఆద్యంతం ఎన్నికల యాత్రను తలపించింది. ‘వ్యవసాయంలో సాంకేతిక, ఆధునిక పద్ధతులు ప్రవేశ పెట్టి లాభసాటిగా మారుస్తా. కొత్తగా పరిశ్రమలు తీసుకువస్తా. విద్యార్థులకు, డ్వాక్రా మహిళలకు ఐపాడ్‌లు ఇస్తా. యువతకు ఉద్యోగాలు కల్పిస్తా. పుట్టపర్తిని ప్రపంచంలోనే మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తా. బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు ఆరు లేన్ల రోడ్లు వేయిస్తా.
అనంతపురం-బెంగళూరు మధ్యలో అందమైన సిటీని నిర్మించి యువతకు ఉద్యోగాలు ఇస్తా. అనంతపురం జిల్లాకు నిట్‌ను తీసుకువస్తా. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేశా.. మరో నాలుగేళ్లలో హంద్రీ-నీవా పూర్తి స్తాయిలో నిర్మించి అనంతకు కృష్టా జలాలు తీసుకువస్తా’నని వెల్లడించారు. ఎన్నికల్లో లాగా హామీలు గుప్పించడంతో.. రుణమాఫీనే ఎప్పుడు చేస్తారో చెప్ప లేదు కానీ.. ఇవన్నీ ఎప్పుడు చేస్తారో అంటూ ప్రజలు చర్చించుకోవడం వినిపించింది.
సీఎం పర్యటన తొలిరోజు ఇలా సాగింది..
గురువారం ఉదయం 10ః55 గంటలకు పుట్టపర్తి విమానశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత సాయి కుల్వంత్ హాలులో ట్రస్టు సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అనంతపురం ఎనుమలపల్లి క్రాస్‌లో డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అక్కడే ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయల్దేరి సాయంత్రం ఐదు గంటలకు నల్లమాడ, వెంగళమ్మచెరువు, బొగ్గులపల్లి, కొండమనాయని పల్లెల మీదుగా రాత్రి 8.45 గంటలకు కదిరికి చేరుకుని.. టవర్‌క్లాక్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బెల్టుషాపులను తొలగించాల్సిన బాధ్యత అధికారులదేనని అంటూనే.. తమ్ముళ్లూ తక్కువ తాగండి.. ఎక్కువ తాగితే ఆరోగ్యం చెడిపోతుందని సూచించారు. అవసరమైతే బెల్టుషాపులు నిర్వహించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తానని అన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి రాత్రికి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బస చేశారు.