అనంతపురం కల్చరల్ : రాష్ట్ర విభజనతో పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేస్తారన్నది మాటల్లో కాదని చేతల్లో చూపాలని లోకసత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ పేర్కొన్నారు. ‘తెలుగు భవిత’ పేరిట నిరశన దీక్షను మంగళవారం స్థానిక సప్తగిరి సర్కిల్ వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా ఉందని, తెలుగు రాష్ట్రాల పట్ల వారికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానా ఖాళీ అయిందని అభివృద్ధి పనులకు నిధులు లేవని చెప్పడం సత్యదూరంగా ఉందన్నారు.
నిజానిజాలను శ్వేత పత్రంద్వారా ప్రజలకు వెళ్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ బూటకమని ఒప్పుకోవాలన్నారు. రాష్ట్రంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు, నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగం దేశంలోనే అత్యధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత ఉండాలంటే పరిశ్రమలు రావాలని, కానీ ఇక్కడ కరెంటు ఎప్పుడిస్తారో...ఎప్పుడు తీస్తారో తెలియదని ఎద్దేవా చేశారు. పాలకులకు సమగ్ర అవగాహన లేకపోవడం వల్లే అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శించారు.
రాయలసీమకు రావాల్సిన నీటి పంపకాల గురించి స్పష్టత తీసుకురాకపోతే భవిష్యత్తు తరాలు కష్టాలలో మునిగిపోతాయన్నారు. దీక్షకు ముందు ఉదయం స్థానిక కెఎస్‌ఆర్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి చర్చ ద్వారా రాష్ట్ర పరిస్థితులు వివరించారు. భవిష్యత్తులో ఆశాకిరణాలు యువత మాత్రమేనని, సమాజంలో ఏం జరుగుతుందో నిత్యం తెలుసుకోవాలని వారికి సూచించారు.
వందలాదిగా తరలి వచ్చిన లోకసత్తా అభిమానులతో దీక్ష శిబిరం కిటకిటలాడింది. పలు ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జేపీకి బాసటగా నిలుస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా యువ కన్వీనర్ సోమనాథరెడ్డి, విద్యార్థి సత్తా జిల్లా అధ్యక్షులు అమర్‌యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సరస్వతీ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు.
మాటలు వద్దు.. చేతల్లో చూపండి
Published Wed, Mar 4 2015 2:33 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement