రాష్ట్ర విభజన ప్రభావం అనంతపురం నగర పాలక సంస్థపై తీవ్ర స్థాయిలో పడనుంది. లోటు బడ్జెట్‌తో కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు.
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రభావం అనంతపురం నగర పాలక సంస్థపై తీవ్ర స్థాయిలో పడనుంది. లోటు బడ్జెట్‌తో కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. నగర పాలక సంస్థ సొంత నిధులతోనే నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంటుంది.
అసలే ఆదాయానికి మించి ఖర్చుతో నడుస్తున్న సంస్థకు ఇది ఇబ్బందికర పరిస్థితే. ఈ తరుణంలో పొదుపు పాటించకపోతే ఖజానా ఖాళీ కాక తప్పదు. అదే జరిగితే అత్యవసర పనులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొంటుంది. నగర పాలక సంస్థకు పన్నులు, ఇతర ఫీజుల రూపంలో ఏటా రూ.18 కోట్ల ఆదాయం వస్తోంది. కాంట్రాక్టు కార్మికులకు ఏటా వేతనాల చెల్లింపునకు రూ.7 కోట్లు, విద్యుత్ చార్జీలకు రూ.5 కోట్లు, నీటి సరఫరాకు రూ.4 కోట్లు, పారిశుద్ధ్య కల్పనకు రూ.1.50 కోట్లు, పాలకవర్గ సభ్యుల గౌరవ వేతనం, వాహనాల నిర్వహణ, విద్యుత్ సామగ్రి కొనుగోలు, ఇతరత్రా పనులకు రూ.2.50 కోట్లు ఖర్చవుతోంది. మొత్తమ్మీద రూ.20 కోట్లు ఖర్చు వస్తోంది.
ఇది ఆదాయం కంటే రూ.2 కోట్లు అదనం. ఇప్పటి వరకు సంస్థ పరిధిలో అధిక శాతం అభివృద్ధి పనులను ప్రభుత్వ గ్రాంట్లు, 13వ ఆర్థిక సంఘం, బీఆర్‌జీఎఫ్ నిధులతో చేపట్టారు. సాధారణ నిధులతో అత్యవసరమైన చిన్నపాటి పనులను మాత్రమే చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వచ్చే అవకాశం లేనందున పొదుపు చర్యలే శరణ్యంగా కన్పిస్తున్నాయి. సొంత ఆదాయ వనరుల పెంపుపైనా నగర పాలక సంస్థ దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాల్సి ఉంటుంది. ఆర్భాటాలకు వెళ్లి ఇష్టారాజ్యంగా చేపడితే ఇబ్బందులు తప్పవు. నిధుల నిర్వహణలో ఏమాత్రం అదుపు కోల్పోయినా పరిస్థితి చేజారిపోతుంది.
ఆదాయం వంద శాతం రాబట్టాలి..
నగర పాలక సంస్థకు ఆస్తి, నీటి పన్ను ప్రధాన ఆదాయ వనరులు. పన్నేతర ఆదాయం కింద బిల్డింగ్, ఎన్‌క్రోచ్‌మెంట్, ప్రకటనలు, డీఓటీ లెసైన్స్ ఫీజులు వస్తాయి. సంస్థకు పన్నులు, పన్నేతర వాటి ద్వారా రావాల్సిన ఆదాయాన్ని వంద శాతం వసూలు చేయాల్సిన అవసరముంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను రూ.3 కోట్లు, నీటి పన్ను రూ.3 కోట్లు రావాల్సి ఉంది. ఇక పన్నేతర ఆదాయం చాలా వరకు రావడం లేదు. ముందున్న క్లిష్ట పరిస్థితుల్లో సంస్థ ఒడ్డున పడాలంటే వీటన్నింటినీ వంద శాతం వసూలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.