మాట్లాడుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం.నాగమణి
సాక్షి, అనంతపురం అర్బన్ : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థల అప్పగిస్తే ఉద్యమిస్తామని ప్రజా సంఘాల నాయకుల స్పష్టం చేశారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జిలాన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, రమణయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటెనాగరాజు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కసాపురం ఆంజనేయులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్రయాదవ్ మాట్లాడారు. ప్రైవేటు ఏజెన్సీలకు మధ్యాహ్న భోజన పథకం అప్పగించి కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని మండిపడ్డారు.
పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం, కస్టర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలన్నారు. వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం రూ.5 వేలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. బిల్లులు, వేతనాలు ప్రతి నెల 5లోగా చెల్లించాలన్నారు. మెనూ చార్జీలు రూ.10లకు పెంచాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి వేతనం నిర్ణయించి అమలు చేయాలన్నారు. వీటి సాధనకు ఈ నెల 25 నుంచి 29 వరకు తహసీల్దార్లు, ఎంఈఓలకు వినతిపత్రం అందజేస్తామన్నారు. జూలై 1న జిల్లా సదస్సు, 9న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు తీర్మానించారు. నాయకులు శ్రీనివాసులు, బాలరంగయ్య, అనిల్, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment