కనగానపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న దృశ్యం
సంపాదించడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నేతల చూపు చిన్నారుల మధ్యాహ్న భోజనంపై పడింది. సరుకుల నాణ్యతను సాకుగా చూపి... పంపిణీ చేసే బాధ్యతను తమ అనుచరులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇప్పటికే కూలి గిట్టుబాటు కాక అల్లాడి పోతున్న వంట ఏజెన్సీల నిర్వాహకులకు కష్టకాలం వచ్చిపడింది. సరుకులన్నీ ప్రైవేటు వ్యక్తులే సరఫరా చేస్తే వండేందుకు తమకు వేతనం ఇవ్వాలని..లేకపోతే మానుకుంటామని వారు అల్టిమేటం జారీ చేశారు. అదే జరిగితే పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం వేళ ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
అనంతపురం , కనగానపల్లి: పేద విద్యార్థులకు ఒక్క పూటయినా నాణ్యమైన పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ఈ పథకం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే నెలల తరబడి బిల్లుల పెండింగ్ పెట్టడంతో అల్లాడిపోతున్న వంట ఏజెన్సీలకు... రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. నవంబర్ 1 నుంచి మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే సరకులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లు తెలిపింది. ఇప్పటికే సకాలంలో బిల్లులు అందక...అప్పులు చేయలేక చాలా ఏజెన్సీలు వంట వండేందుకు ముందుకు రావడం లేదు. ఇపుడు సరుకుల పంపిణీ బాధ్యతనూ ప్రైవేటుకు అప్పగిస్తే... వంట చేసేవారికి కూలీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంటుంది. దీంతో ఏజెన్సీ సభ్యులు మధ్యాహ్న భోజనం వంటకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రమాదం ఉంది. అదే జరిగితే పాఠశాలల్లో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటించే పరిస్థితి తలెత్తనుంది.
ప్రైవేటు ఏజెన్సీలకు సరుకుల పంపిణీ బాధ్యత
నవంబర్ 1వ నుంచి మధ్యాహ్న భోజనానికి వినియోగించే కంది బేడలు, వంట నూనెను ఏజెన్సీల ద్వారా సరఫరా చేస్తామనిఅధికారులు ప్రకటించారు. అందువల్ల భోజన ఏజెన్సీలకు అందించే బిల్లుల్లో 30 శాతం వరకు కోత విధిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలోనే కోడి గుడ్డు సరఫరాను ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చి బిల్లుల్లో కోత పెట్టారు. దీనివల్ల ప్రతీసారి బిల్లులు తగ్గిపోతే తమకు గిట్టుబాటు కాదని వంట ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు. అధికారులు సరుకులు, బియ్యం పంపిణీ చేసినా గ్యాస్, కాయగూరలు ధరలు పెరుగుదలతో బిల్లులు సరిపోవటం లేదంటున్నారు.
మూడు నెలలుగా బిల్లుల పెండింగ్
జిల్లాలో మూడు నెలలకు సంబంధించి సూమారు రూ.7 కోట్లు మధ్యాహ్న భోజన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో ఉన్నత పాఠశాలలకు సంబంధించి బిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో జూలై నుంచి బిల్లులు సక్రమంగా రావటం లేదు. దీంతో ఒక్కో పాఠశాలలో రూ.వేలాది బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. దీనివల్ల రాప్తాడు నియోజక వర్గంలోని పలు పాఠశాలల్లో వంట ఏజన్సీలు భోజనం చేయటం మానుకొంటున్నాయి. ఒక్క కనగానపల్లి మండలంలోనే ఐదు పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందటం లేదు.
వేతనాలిస్తేనే వంట చేస్తాం
మధ్యాహ్న భోజనానికి సరుకులన్నీ సరఫరా చేసి...వంట చేసే వారికి ఒక్కొక్కరికి రూ.5 వేల వేతనం ఇస్తేనే వంట చేస్తాం. అలా కాకుండా బిల్లుల్లో కోత పెడితే ఏజెన్సీలు అప్పుల పాలు కావాల్సిందే. తొలుత సరుకుల పంపిణీని ప్రయివేటు వ్యక్తులకిచ్చి ఆ తర్వాత వంట ఏజెన్సీలను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇలా చేస్తే వేలాది మంది సభ్యులు జీవనోపాధి కోల్పోతారు. – నాగమణి, మధ్యాహ్న భోజన ఏజెన్సీల సంఘం జిల్లా కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment