Private organizations
-
భోజన పథకాన్ని ప్రైవేటుకు అప్పగించొద్దు
సాక్షి, అనంతపురం అర్బన్ : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థల అప్పగిస్తే ఉద్యమిస్తామని ప్రజా సంఘాల నాయకుల స్పష్టం చేశారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగమణి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జిలాన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, రమణయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈటెనాగరాజు, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కసాపురం ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్రయాదవ్ మాట్లాడారు. ప్రైవేటు ఏజెన్సీలకు మధ్యాహ్న భోజన పథకం అప్పగించి కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోందని మండిపడ్డారు. పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం, కస్టర్ల ఏర్పాటు ఉపసంహరించుకోవాలన్నారు. వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం రూ.5 వేలు ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. బిల్లులు, వేతనాలు ప్రతి నెల 5లోగా చెల్లించాలన్నారు. మెనూ చార్జీలు రూ.10లకు పెంచాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి వేతనం నిర్ణయించి అమలు చేయాలన్నారు. వీటి సాధనకు ఈ నెల 25 నుంచి 29 వరకు తహసీల్దార్లు, ఎంఈఓలకు వినతిపత్రం అందజేస్తామన్నారు. జూలై 1న జిల్లా సదస్సు, 9న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాలని సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు తీర్మానించారు. నాయకులు శ్రీనివాసులు, బాలరంగయ్య, అనిల్, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూలో.. అవినీతి జాడలెన్నో.
తీగ లాగిన కొద్దీ కదులుతున్న డొంక ఏ విభాగం చూసినా అదే పరిస్థితి కాసులు కురిపిస్తున్న కన్సల్టెన్సీ వ్యవహారం {పపంచ బ్యాంకు నిధులనూ వదలని ఘనులు విద్యార్థుల అటెండెన్స్లోనూ చేతివాటం రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక సాంకేతిక విశ్వవిద్యాలయమైన జేఎన్టీయూలో అవినీతి అంతా ఇంతా కాదు. తీగ లాగితే డొంక కదులుతోంది. ఒక్కొక్కటిగా బయటపడుతుండడం ప్రతి ఒక్కరిని నిర్ఘాంతపరుస్తోంది. వర్సిటీలోని కీలక స్థానాల్లో ఉన్న అధికారులే అవినీతికి సూత్రధారులవుతుండడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. గతంలో తప్పుడు కన్సల్టెన్సీ నివేదికలిచ్చి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా దండుకున్న ఘనుల ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ అక్రమాల జాడలకు ఆనవాళ్లిలా... నిబంధనలకు నీళ్లొదిలి నివేదికలు.. సాధారణంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వివిధ ప్రాజెక్టు అవసరాల నిమిత్తం నిపుణుల నివేదిక(కన్సల్టెన్సీ రిపోర్టు)కోసం జేఎన్టీయూను ఆశ్రయిస్తాయి. ఇందుకు ప్రత్యేకంగా ఓ విధానం ఉంది. దీనిప్రకారం సంబంధిత ల్యాబ్ ఇన్చార్జి ఈ రిపోర్టుకు బాధ్యులుగా ఉంటారు. ఆయన జారీ చేసిన రిపోర్టును అతని పైఅధికారి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కానీ కొందరు అక్రమార్కులు ఈ నిబంధనలను తుంగలోకి తొక్కి వర్సిటీ లెటర్‌హెడ్స్‌పై కనీస ప్రమాణాలు, నిబంధనలు పాటించకుండా సొంతంగా తప్పుడు కన్సల్టెన్సీ నివేదికలిచ్చి ఆయా సంస్థల నుంచి భారీగా సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయం వర్సిటీ ఉన్నతాధికారులకు తెలియకుండా సదరు వ్యక్తులు పలు జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. సొంత పేర్లపై కన్సల్టెన్సీ చార్జీల వసూలు.. ఇక కన్సల్టెన్సీ నివేదికల కోసం వర్సిటీని ఆశ్రయించే వారిని సదరు వ్యక్తులు తమ వైపు తిప్పుకొంటున్నారు. వర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా సదరు అక్రమార్కు లు సొంత పేర్లపై డిమాండ్ డ్రాఫ్టులు, పెద్ద మొ త్తంలో నగదు స్వీకరించి ప్రిన్సిపాల్ లెటర్‌హెడ్‌పై కన్సల్టెన్సీ నివేదికలిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా వర్సిటీతో సంబంధం లేకుండా నకిలీ రశీదు పుస్తకాలను ముద్రించి సంబంధిత వ్యక్తులకు బిల్లులిచ్చినట్టు తెలిసింది. ఇలా ఒకటి రెం డు కాదు వర్సిటీ కళ్లు గప్పి ఏకంగా తొమ్మిది కన్సల్టెన్సీ నివేదికలిచ్చి లక్షల రూపాయలు దం డుకున్నట్టు సమాచారం. పలు బహు ళ అంతస్తుల భవనాలను కనీసం తనిఖీ చేయకుండానే లంచం పుచ్చుకొని నాణ్యతా సర్టిఫికెట్లు జారీ చేసి జేబులు నింపుకొన్నట్టు తెలిసింది. సర్కార్ విభాగాలకూ శఠగోపం.. గతంలో పంజగుట్ట ఫ్లైఓవర్ కూలిన ఘటనలో సదరు కాంట్రాక్టర్ తప్పిదం పెద్దగా లేదంటూ క్లీన్చిట్ ఇచ్చిన సదరు అధికారి ప్రగతినగర్‌లో విలువైన స్థలాన్ని గిఫ్ట్‌గా పొందినట్టు సమాచారం. ఆర్ అండ్ బీ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలతో జరిగే పలు నిర్మాణ పనులకు సైతం తప్పుడు నిపుణుల కమిటీ రిపోర్టులిచ్చి గుత్తేదారుల నుంచి భారీగా నజరానాలు పొందిన వర్సిటీ ఘనుల ఉదంతాలు కళ్లుబైర్లుకమ్మేలా ఉన్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కవుతున్న వర్సిటీ అధికారులు కొందరు వారితో కలిసి విదేశీ పర్యటనలు చేసినట్టు తెలియవచ్చింది. అంతేకాదు స్టడీ టూర్ల పేరిట వర్సిటీ నిధులతో ఎంటర్టైన్మెంట్ టూర్లకు వెళ్లివచ్చినట్టు సమాచారం. హాజరు విషయంలోనూ.. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు తరగతిలో 75 శాతం హాజరు విధిగా ఉండాలి. కానీ అక్రమార్కులు విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకొని హాజరుశాతాన్ని పెంచారు. ఏకంగా అటెండెన్స్ రిజిష్టర్లోనే మార్పులు చేసి పరీక్షలకు అనుమతించిన విషయం వెలుగు చూసింది. ప్రపంచబ్యాంకు నిధులూ దుర్వినియోగం..! వర్సిటీలో మౌలిక వసతుల కల్పన, ప్రయోగశాలల్లో వివిధ వస్తువుల కొనుగోలుకు ప్రపంచ బ్యాంకు జారీ చేసిన నిధులను సైతం కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేసినట్టు తెలిసింది. తప్పుడు ఓచర్లు, కమీషన్ల కక్కుర్తితో నాసిరకం పనులు చేపట్టడంతోపాటు నాణ్యతలేని వస్తువులు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఎంసెట్ పరీక్ష కేంద్రాల్లోనూ ఇష్టారాజ్యమే.. ఇక ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు వారు కోరిన చోట ఎంసెట్ పరీక్షా కేంద్రాలు కేటాయించడం ద్వారా వర్సిటీలోని కొందరు అధికారులు కోట్లాది రూపాయలు దండుకున్నట్టు తెలిసింది. సొంతపనులకే ప్రాధాన్యం.. వర్సిటీలో పరిపాలనపై దృష్టిసారించాల్సిన పలువురు అధికారులు సొంత పనులు, కన్సల్టెన్సీ నివేదికల తయారీకే అధిక సమయం కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. బయటి నుంచి వచ్చే గుత్తేదారులకు, ప్రైవేటు వ్యక్తులకే అధిక సమయం కేటాయిస్తూ వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు పనిచేస్తుండడం శోచనీయం. వర్సిటీలో ప్రధానంగా అవినీతికి అవకాశం కల్పిస్తున్న మార్గాలివీ.. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతుల మంజూరు. నిబంధనల ప్రకారం స్టాఫ్ లేకపోయినా అనుమతి పత్రాల జారీ. కాంట్రాక్టర్లు, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు బిల్లుల మంజూరు.వర్సిటీకి అవసరమైన వస్తువులు, ప్రయోగ పరికరాలు సరఫరా చేసే సంస్థలకు బిల్లుల చెల్లింపు.వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య కన్సల్టెన్సీ నివేదికల కోసం కుదుర్చుకునేఅవగాహన ఒప్పందాలు.వర్సిటీలో కొందరు అక్రమార్కులకు మేలు చేసే విధంగా నిబంధనల మార్పు. -
ఈసీ వద్దన్నా.. వీసీ కానిచ్చేశారు!
సాక్షి, సిటీబ్యూరో : జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో పాలకమండలి, ఉపకులపతిల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. పలు ప్రైవేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడంలో యాజమాన్యం అనుసరిస్తోన్న తీరును పాలకమండలి సభ్యులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలకమండలి అభ్యంతరాలను పక్కనపెట్టిన ఉపకులపతి, ఇతర అధికారులు ఎంచక్కా ఎంవోయూలను కానిచ్చేశారు. ఈ నేపథ్యంలో.. పాలకమండలి సమావేశం జరిగితే తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, గత రెండు నెలలుగా సమావేశాలను ఏర్పాటు చేయడం లేదని సమాచారం. గతంలో నెలకు రెండు మార్లు సమావేశాలు నిర్వహించిన అధికారులు.. రెండు నెలలువుతున్నా పాలకమండలి సమావే శం ఏర్పాటుపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహేంద్ర‘టెక్’పై ఎంత ప్రేమో! పలు సాంకేతిక కోర్సుల నిర్వహణ కోసం జేఎన్టీయూహెచ్తో ఎంఓయూ కుదుర్చుకునేందుకు నగరంలోని మహేంద్ర టెక్ సంస్థ గతేడాది నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. మహేంద్ర టెక్ సంస్థతో అవగాహనకు జేఎన్టీయూహెచ్ పాలకమండలి తొలిదశలోనే తిరస్కరించింది. అయినప్పటికీ యూని వర్సిటీ యాజమాన్యం పదేపదే ఈ ప్రతిపాదనలను ఈసీ సమావేశంలో పెడుతుండటంపై సభ్యుల నుం చి సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేటు సంస్థ నిర్వహించే టెక్నికల్ కోర్సులకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి అనుమతి లేకపోవడం, కోర్సులకు వసూలు చేసే ఫీజులు భారీగా ఉండడం, సంస్థ ప్రతిపాదనల్లో సామాజిక బాధ్యతను విస్మరించడం.. తదితర ప్రతికూల అంశాలను పాలకమండలి ఎత్తి చూపింది. గుట్టుగా కానిచ్చేశారు ఏఐసీటీఈ అనుమతి లేనిదే మహేంద్ర టెక్‌తో ఎంవోయూ తగదని గత ఐదు సమావేశాల్లోనూ పాలకమండలి స్పష్టం చేసింది. అయినప్పటికీ గతనెల 29న సదరు సంస్థతో జేఎన్టీయూహెచ్ యాజమాన్యం ఎంవోయూ కుదుర్చుకుంది. పాలకమండలి వద్దన్నా.. ఉపకులపతి మాత్రం కానిచ్చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారంలో పెద్దెత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ రమణరావును వివరణ కోరగా.. ‘ఏఐసీటీఈ అనుమతి ఉంటేనే ఏం వోయూ కుదుర్చుకోవాలని ఈసీ సూచిం చింది. అయితే.. టెక్ మహేంద్ర సంస్థ తాము నిర్వహించబోయే కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. ప్రస్తుతానికి ఆ సంస్థతో కేవలం ‘కండిషనల్ ఎంవో యూ’ మాత్రమే కుదుర్చుకున్నాం. ఏఐసీటీఈ అనుమతి లేకుండా సదరు సంస్థ ఎటువంటి కోర్సు లు నిర్వహించేందుకు వీలు కాదు’ అన్నారు.