సాక్షి, అనంతపురం : ప్రజా సమస్యల పరిష్కారంపై కొందరు అధికారులు దృష్టి సారించడం లేదు. ‘స్పందన’ ద్వారా అందుతున్న అర్జీల విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. సమస్యలపై అందుతున్న అర్జీలనూ పరిశీలించని అధికారులు ఉన్నారు. ‘స్పందన’ అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సత్యనారాయణ ప్రత్యేక దృష్టి సారిస్తున్నా... మండల స్థాయి అధికారులు మాత్రం పనితీరు మార్చుకోవడం లేదు.
లాగిన్ ఐడీ కూడా తెలియదు
‘స్పందన’లో అందే అర్జీల పరిష్కారం కోసం ఒక్కో తహసీల్దార్‌కు లాగిన్ ఐడీ ఇస్తారు. ఇటీవల జాయింట్ కలెక్టర్ డిల్లీరావు రెవెన్యూభవన్‌లో తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో పెండింగ్ అర్జీల అంశాన్ని ప్రస్తావించారు. ఆన్‌లైన్‌లో చూసి ఎవరి వద్ద ఎన్ని అర్జీలు పెండింగ్ ఉన్నాయో చెప్పాలని కోరారు. ఈ క్రమంలో కొందరు తహసీల్దార్లు తమ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్‌కు ఫోన్ చేసి తమ లాగిన్‌ఐడీ అడిగి తెలుసుకున్నారు. ఇది గమనించిన జాయింట్ కలెక్టర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. కనీసం లాగిన్ ఐడీ కూడా తెలుసుకోనంత నిర్లక్ష్యంగా ఉన్న మీరు...ప్రజా సమస్యలను పరిష్కరించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపుతున్నారో అర్థ అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ హెచ్చరిస్తున్నా... మారని తీరు
ప్రజాసమస్యలపై ‘స్పందన’కు వచ్చే అర్జీల విషయంలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పదేపదే చెబుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే వారుపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నా.. కొందరు తహసీల్దార్లు, ఎంపీడీఓల తీరులో మార్పురావడం లేదు. స్పందన అర్జీల పరిష్కారంపై ప్రతి సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి డివిజన్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా ప్రతి శనివారమూ సమీక్షిస్తున్నారు... ఇక ప్రతి మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో ‘స్పందన’ అర్జీల పరిష్కారంపై సమీక్షిస్తున్నారు. అర్జీల పరిష్కారంలో వెనుబడి ఉన్న మండలాలను పేర్కొంటూ సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలను హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొందరు అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. స్పందనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న దృష్ట్యా..ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment