'తెలంగాణను డిస్టర్బ్ చేయడం మంచిదికాదు'
న్యూఢిల్లీ: వ్యక్తిగతంగా రాయలతెలంగాణకు తాను వ్యతిరేకమని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఇది తెలంగాణ ప్రజలకు గాని, కర్నూలు- అనంతపురం జిల్లాల ప్రజలకుగానీ మంచిది కాదన్నారు. అన్ని స్థాయిల్లోనూ తాను దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చానని వెల్లడించారు. చాలారోజులనుంచి ఈ ప్రతిపాదన వస్తూనే ఉందన్నారు.
సీడబ్ల్యూసీ తీర్మానంలోగాని, కేబినెట్ నోట్‌లోగాని రాయల తెలంగాణ అంశం లేదని తెలిపారు. రాష్ట్ర విభజనకు సీడబ్ల్యూసీ నిర్ణయమే కొలబద్దకావాలన్నారు. లేదంటే విభజన ప్రక్రియకు అంతరాయం కలిగించినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఈ దశలో రాయల తెలంగాణ అంటే తెలంగాణ, రాయలసీమ ప్రజలు ఆవేశానికి లోనయ్యే అవకాశముందన్నారు. 10 జిల్లాల తెలంగాణను డిస్టర్బ్ చేయడం మంచిదికాదన్నారు.
తనకు తెలిసిన ఏ కాంగ్రెస్ నేతా రాయల తెలంగాణకు అనుకూలంగాలేరని జైపాల్‌రెడ్డి అన్నారు. ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకోవాల్సిన అవసరంలేదన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు నదీజలాల విషయంలో అన్యాయం జరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు వస్తుందని, ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.