రాయల తెలంగాణ కోసం ఉద్యమం: జేసీ
అనంతపురం: రాష్ట్ర విభజన జరిగిపోతోందని, ఈ పరిస్థితుల్లో వెనుకబడిన అనంతపురం జిల్లాను దృష్టిలో పెట్టుకుని ‘రాయల తెలంగాణ’ సాధించుకునే దిశగా ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి, తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ దివాకరరెడ్డి తెలిపారు. ఇందు కోసం పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక సంఘాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని విభజించాలనే విషయంలో కేంద్ర ప్రభుత్వం అహంకార ధోరణి అవలంబిసోందన్నారు.
‘మన అనంతపురం జిల్లాను పరిరక్షించుకుందాం’ (సేవ్ అనంతపురం) పేరుతో ఆదివారం అనంతపురం నగరంలో సమావేశం నిర్వహించారు. ఇందులో జేసీతో పాటు డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్ గుప్తా, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు, కొన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విభజన తరువాత సీమాంధ్రకు రాజధాని ఏర్పాటు విషయంలో కర్నూలు కావాలని తాము పట్టుబడతామన్నారు. ఆంధ్ర-సీమ ప్రజల సంస్కృతీ సంప్రదాయాల్లో సారూప్యత ఉండదని, సీమాంధ్ర ప్రాంతం ఎప్పటికీ కలిసి ఉంటుందనే నమ్మకం తనకు లేదని చెప్పారు. ఈ నెల 21న ‘రాయల తెలంగాణ’ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
కాగా...ఈ ప్రతిపాదన విభజన నిర్ణయం వెలువడిన వెంటనే చేసి వుంటే బాగుండేదని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. మరికొందరు మాత్రం తమ అధి నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇంకొందరు ఈ ప్రతిపాదన మంచిదేనంటూ మద్దతు ప్రకటించారు.