నిరుద్యోగులకు ఆర్థిక సహకారం కోసం ఇంటర్వ్యూలు
ఆదిలాబాద్‌అర్బన్: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద జిల్లాలోని నిరుద్యోగ యువతకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహకారం అందించడానికిఇంటర్వ్యూలు నిర్వహించామని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జాదవ్ రాంకిషన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల కేంద్రం, ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సంస్థల ద్వారా నిరుద్యోగులకు సేవారంగం, పరిశ్రమల స్థాపన వంటి వాటిని నెలకొల్పడానికి బ్యాంకులు, ఆయా సంస్థల ద్వారా రుణాల మంజూరుకు ఇంటర్వూ్యలు నిర్వహించామని పేర్కొన్నారు.
జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా రుణాలు పొందడానికి 81మంది దరఖాస్తు చేసుకోగా.. 42 మంది హాజరయ్యారని, కె.వీ.ఐ.బీ నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి 149మంది దరఖాస్తు చేసుకోగా 65 మంది హాజరయ్యారని, కేవీఐసీ ద్వారా రుణాల కోసం 27మంది దరఖాస్తు చేసుకోగా 11మంది హాజరైనట్లు తెలిపారు. ఎంపికైన జాబితా అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం.ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.కిషన్, కేవీఐబీ సహాయ సంచాలకులు ఎం.సీ.రాంప్రసాద్, కేవీఐసీ జిల్లా కో ఆర్డినేటర్ జి.నారాయణరావు, ధన్నూర్ సర్పంచ్, కమిటీ సభ్యురాలు బి.లక్ష్మీ, మెప్మా నుండి సుభాష్ పాల్గొన్నారు.