
ఆత్మహత్యకు పాల్పడిన రవి(ఫైల్).. రవి కుమార్తెలు, అతడి సెలూన్.
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మిర్‌దొడ్డి మండలం ఖాజీపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన క్షౌరవృత్తిదారుడు రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అతడి కుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం అందించాలని కోరింది. క్షౌరవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రవి లాక్‌డౌన్‌తో ఉపాధిలేక, ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని ఐక్యవేదిక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ అన్నారు. అతడి ఇద్దరు కూతుళ్లు కావ్య(13), వైష్ణవి(10)లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు.
క్షౌరవృత్తిదారులు మనోధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. లాక్‌డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షౌరవృత్తిదారులను ఆదుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి క్షురకునికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి అండగా నిలబడాలని జిల్లా నాయీ బ్రాహ్మణ నాయకులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment