Barber
-
మంటతో హెయిర్ కట్ చేస్తాడు... మండిపడకండి సార్!
‘జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే’ అన్నారుగానీ ‘టాలెంట్ ఉన్న వ్యక్తి కత్తెర ఉపయోగించకుండా హెయిర్ కట్ చేసినా జుట్టుకు అందమే’ అని ఎవరూ అనలేదు. విషయంలోకి వస్తే... తమిళనాడులో ఒక బార్బర్ తన కస్టమర్‌కు హెయిర్ కటింగ్ చేయడానికి కత్తెర ముట్టుకోకుండా ‘మంట’ను ఉపయోగించాడు. క్లయింట్ జుట్టు కత్తిరించడానికి, స్టైల్ చేయడానికి ‘ఫైర్ టార్చ్’ను ఉపయోగించి రకరకాల విన్యాసాలు చేశాడు. ‘ఎక్స్’లో ప్రత్యక్షమైన ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోకు వచ్చిన స్పందన విషయానికి వస్తే... బార్బర్ నైపుణ్యం, ధైర్యాన్ని చాలామంది అభినందించగా కొద్దిమంది మాత్రం ‘నీ దుంపతెగ ఇదేమీ దుస్సాహసం’ అన్నట్లుగా కామెంట్లు పెట్టారు. ‘నెత్తి మీద ఇంత దగ్గరగా మంటను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు...’ అంటూ చెప్పుకొచ్చారు కొందరు. క్లయింట్‌కు ఎర్ర వస్త్రం చుట్టి మరీ ప్రయోగంలోకి దిగాడు బార్బర్. రెడ్ క్లాత్ చుట్టడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ‘ఇది ప్రమాదం సుమీ’ అని చెప్పకనే చె΄్పాలకున్నాడో తెలియదు. -
తల్లి పనిమనిషి, కూలీపనులు చేసిన కొడుకు.. ఇప్పుడు ముఖేష్ అంబానీకంటే..
'సక్సెస్'.. ఈ పదం రాసుకోవడానికి చిన్నగా ఉన్నా.. సాధించడానికి చాలా సమయం పడుతుంది. అహర్నిశలు అంకిత భావంతో పనిచేస్తేనే విజయం వరిస్తుంది. ఈ కోవకు చెందిన ఒక వ్యక్తి గురించి మనం ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. బెంగుళూరుకు చెందిన బిలియనీర్ బార్బర్ 'రమేష్ బాబు' అంటే ఈ రోజు అందరికి తెలుసు. ముఖేష్ అంబానీ కంటే కూడా ఎక్కువ కార్లను కలిగి ఉన్న ఈయన ప్రస్తుతం ధనవంతుల జాబితాలో ఒకరు. అయితే ఈయన బాల్యం కడలిలో మునిగిన నావలాంటిదని బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. చిన్నప్పుడే తండ్రి మరణం.. చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవడంతో క్వారికున్న బార్బర్ షాప్ అక్కడితో ఆగింది. తల్లి పనిమనిషిగా చేరింది, రమేష్ బాబు తల్లికి సహాయంగా ఉండాలని కూలిపనులు చేసేవాడు. తండ్రి మరణంతో ఒక్కసారిగా కటిక పేదరికంలో పడిపోయారు. మూడు పూటల ఆహరం కోసం కూడా చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఆ తరువాత తండ్రి మార్గంలో నడవాలని నిర్ణయించుకుని మళ్ళీ బార్బర్ షాప్ ప్రారంభించాడు. తండ్రి బార్బర్ షాప్ ప్రారభించిన అతి తక్కువ కాలంలో వృద్ధిలోకి రావడం ప్రారంభమైంది. బార్బర్షాప్ను స్టైలిష్ హెయిర్ సెలూన్‌గా మార్చాడు. రమేష్ బాబుకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అంతే కాకుండా తన వ్యాపారాన్ని వివిధ మార్గాల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించుకుని కార్లను అద్దెకివ్వాలని నిర్ణయించుకుని మొదటి మారుతి ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేశారు. ట్రావెల్ కంపెనీ.. 1994లో ప్రారంభమైన ఈ బిజినెస్ ఆ తరువాత ట్రావెల్ కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం ఈయన వద్ద సుమారు 400కంటే ఎక్కువ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో మెర్సిడెస్ ఈ క్లాస్ సెడాన్, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్ ఘోస్ట్, జాగ్వార్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. రమేష్ బాబు కార్ రెంటల్ కంపెనీలో 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్! రమేష్ బాబు బిలినీయర్ అయినప్పటికీ తన మూలలను మాత్రం మరచిపోలేదు, దీంతో ఈయన అప్పుడప్పుడు సెలూన్‌కి చాలా సమయం వెచ్చిస్తాడు. మొత్తం మీద భారతదేశంలో బిలియనీర్లైన ముఖేష్ అంబానీ (సుమారు 168 కార్లు), గౌతమ్ అదానీ (10అల్ట్రా లగ్జరీ కార్లు) కంటే ఎక్కువ కార్లను కలిగిన సంపన్నుడిగా రికార్డ్ సృష్టించాడు. కాగా ప్రస్తుతం రమేష్ బాబు నికర ఆస్తుల విలువ రూ. 1200కోట్లు అని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. -
ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!
బెంగళూరు రమేష్ బాబు లేదా ‘ఇండియన్ ' బిలియనీర్ బార్బర్’. 600 కార్ల కలెక్షన్‌ను గమనిస్తే ఎవరైనా ఔరా అనక తప్పదు. అందులోనూ అన్నీ ఖరీదైన కార్లే. ఎక్కువ భాగం బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్ రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్సే.బిలియనీర్ బాబుగా పాపులర్ అయిన రమేష్ బాబు ఒకప్పుడు కడు పేదవాడే. ఒక పూట తింటే రెండోపూటకు కష్టమే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూలిపనులకెళ్లాడు. జీవితం గడవడానికి అమ్మకు తోడుగా చాలా ఉద్యోగాలు చేశాడు. మరి బిలియనీర్‌గా ఎలా అవతరించాడు..? రమేష్ బాబు తండ్రి గోపాల్ బెంగళూరులో క్షురకుడుగా పని చేసేవారు. రమేష్ ఏడేళ్ల వయస్సులోనే తండ్రి కన్నుమూశారు. దీంతో తల్లి ముగ్గురు పిల్లలున్న కుటుంబానికి బెంగళూరులోని బ్రిడ్జ్ రోడ్‌లోని చిన్న బార్బర్ షాప్ ఒక్కటే జీవనాధారం. కేవలం 40-50 రూపాయలతో పిల్లల్ని పోషించేది. పిల్లల్ని చదివించింది. బట్టలు, పుస్తకాలు, ఫీజులు, అన్నింటికీ వినియోగించేది. మరోవైపు బార్బర్షాప్ను నిర్వహించలేక రోజుకు రూ.5 అద్దెకు ఇచ్చేయడంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకునే వారు. 13 సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్ డెలివరీ,మిల్క్ హోమ్ డెలివరీలాంటి ఎన్నో పనులు చేసిన కుటుంబ పోషణలో తల్లి ఆసరాగా ఉండేవాడు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ 10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, చివరికి తండ్రి పాత దుకాణం 'ఇన్నర్ స్పేస్' లో బార్బర్‌గా పని చేయడం ప్రారంభించాడు. పట్టుదలతో కష్టించి పనిచేశాడు. అది త్వరలోనే ట్రెండీ స్టైలింగ్ అవుట్‌లెట్‌గా మారిపోయింది. హెయిర్స్టయిలిస్ట్గా బాగా పేరు గడించాడు. ఆ తర్వాత రమేష్ బాబు 1993లో తన మామ దగ్గర కొంత డబ్బు తీసుకుని మారుతీ ఓమ్నీ వ్యాన్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఈఎంఐ చెల్లించేలేక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాడు. అలా తన తల్లి పనిచేసే కుటుంబానికి చెందిన ఇంటెల్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చే పని తీసుకుని ట్రావెల్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అది లాభసాటిగా ఉండటంతోపాటు, పర్యాటక రంగానికి ప్రభుత్వంప్రోత్సాహంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని లాంచ్ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ముప్పై ఏళ్లుగా సేవలందిస్తూ, ఖరీదైన కార్లను సేకరిస్తూనే ఉన్నాడు. అలా 600కు పైగా కార్లు అతని గారేజ్‌లో ఉన్నాయి.దాదాపు అన్నీ బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లంటేనే అతని వ్యాపారాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు వ్యాన్లు, మినీబస్సులు కూడా ఉన్నాయి. తొలి లగ్జరీ కారు మెర్సిడెస్ ఈ కాస్ల్ సెడాన్ అతని తొలి లగ్జరీ కారు. దీని ధర రూ.38 లక్షలు. ప్రస్తుతం 3 కోట్ల ఆర్ఆర్ ఘోస్ట్, 2.6 కోట్ల ఖరీదైన మేబ్యాచ్ అతని ట్రావెల్స్‌లో ఉన్నాయి. రమేష్ బాబు కంపెనీ ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో నడుస్తుంది. అదే సమయంలో, అతని వ్యాపారం కొన్ని ఇతర దేశాలలో కూడా విస్తరించింది. దాదాపు 300 పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. బిగ్‌బీ, ఆమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీ కస్టమర్లు రమేష్ అన్ని కార్లను డ్రైవ్ చేయగలడు. అతని క్లయింట్ల జాబితా అంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు కూడా వారు పట్టణంలో ఉన్నప్పుడు కార్లను అద్దెకు తీసుకుంటారట. రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. అన్నట్టు ఇప్పటికీ తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. బిలియనీర్ బాబు మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్‌లోని తన దుకాణానికి వెళ్తాడు. నిజంగా రమేష్ బాబు కథ స్ఫూర్తిదాయకం. 2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్‌గా ఫోర్బ్స్ గుర్తించింది. -
గ్రామపెద్ద సరేనంటేనే క్షవరం
సాక్షి, యశవంతపుర: దళితులకు క్షవరం చేయబోమనడంతో గొడవ ఏర్పడింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లా హరిహర తాలూకా ధళెహళె గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఇప్పటికీ అంటరానితనం దురాచారం అమలవుతోంది. ఓ క్షౌరశాలలో క్షవరం కోసం కొందరు దళితులు రాగా, క్షురకుడు అన్నప్ప గ్రామ పెద్ద సరేనంటే మీకు క్షవరం చేస్తానని చెప్పాడు. మాకు ఎందుకు క్షవరం చేయవు అని దళిత యువకులు ప్రశ్నించటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో శనివారం చర్చనీయాంశమైంది. సంఘటనపై జిల్లాస్థాయి అధికారులు గ్రామంలో పర్యటించి విచారణ చేపట్టారు. ఈ గ్రామంలో దళితులను ఆలయాల్లోకి అనుమతించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
తండ్రికి హెయిర్ కటింగ్ చేస్తున్న బండ్ల గణేష్
-
సూపర్ బండ్ల గణేశ్ అన్నా...వీడియో వైరల్
బండ్ల గణేశ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అటు కమెడియన్‌గా, ఇటు నిర్మాతగా టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో అంతకంటే ఎక్కువ గుర్తింపు తన మాటలు, చేష్టలతో తెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో బండ్ల ఒక సెన్సేషన్. చాలా సార్లు ఆయన చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. సెలూన్‌కి వెళ్లి కటింగ్ చేయించుకుంటే ఎక్కడ కరోనా మహమ్మారి సోకుతుందో అనే భయంతో చాలా మంది అలాగే గడ్డాలు, మీసాలు పెంచేస్తున్నారు. కొందరు మాత్రం ఇంట్లోనే కత్తెర పట్టి కటింగ్ చేసుకుంటున్నారు. తాజాగా ఇదే పని బండ్ల గణేశ్ చేశాడు. తన తండ్రికి తానే స్వయంగా కటింగ్ చేశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందిస్తున్నారు. ‘సూపర్ అన్నా’, ‘గుడ్ జాబ్..మంచి కొడుకువని నిరూపించుకున్నావు’, మల్టీ టాలెంటెడ్ పర్సన్‌ని నువ్వు’ అంటూ బండ్ల గణేశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వైరల్: టీకా తీసుకుంటూ ఏడ్చేసిన నటి ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక.. -
డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చిన మినిస్టర్
మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాలోని గులైమల్లో ఉంటాడు రోహీదాస్. లోకల్ కుర్రాడు. చేతిలో పనుంది. చేతికి పని లేదు. హెయిర్ కటింగ్ అతడికి తెలిసిన విద్య. ఎక్కడో పని చేస్తూ కరోనా వల్ల ఆ సెలూన్ మూత పడటంతో తను రోడ్డున పడ్డాడు. సొంతంగా షాప్ పెట్టుకోడానికి కత్తెర్లు క్రీముల వరకు కొనగలడు కానీ, పి.పి.ఇ. సరంజామా కష్టం. అవి లేందే ఎవరూ ధైర్యం చేసి రావడం లేదు. చూసి చూసి తనే ధైర్యం చేశాడు. నేరుగా మంత్రి గారిని కలిశాడు. అడవుల శాఖ మంత్రి ఆయన. పేరు విజయ్ షా. గులైమల్లో చిన్న కార్యక్రమానికి వస్తే అక్కడికి వెళ్లి ఆయనకు తన పరిస్థితి చెప్పుకున్నాడు రోహీదాస్. ‘సరే నేను స్టేజి మీద ఉంటాను. నువ్వెళ్లి నీ కటింగ్ కిట్ తెచ్చుకో..’ అన్నారు మంత్రిగారు. రోహీదాస్కి అర్ధం అయిపోయింది. మంత్రిగారు కటింగ్ చేయించుకుని చేతికొచ్చినంత చేతిలో పెట్టి వెళ్లిపోతారని. వెళ్లి టూల్ బాక్స్ తెచ్చుకున్నాడు. మంత్రిగారు స్టేజ్ పైకి రమ్మన్నారు. వెళ్లాడు. కటింగ్ చెయ్యమన్నారు. చేశాడు. షేవింగ్ కూడా అన్నారు. అదీ చేశాడు. ఎలా చేసిందీ అద్దంలో చూపించాడు. ‘బాగా చేశావోయ్’ అన్నారు మంత్రిగారు. రోహీదాస్ ఊహించినట్లే చేతికి అందినంతా ఇచ్చి స్టేజ్ దిగి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ భుజం తట్టారు. ఆయన దాటి పోయాక, గుప్పెట తెరిచి చూసుకున్నాడు రోహీదాస్. అన్నీ రెండువేల నోట్లు! లెక్కపెట్టుకున్నాడు. 30 ఉన్నాయి. అరవై వేల రూపాయలు!! అంతకన్నా పెద్ద అమౌంట్ మంత్రిగారు భుజం తట్టడం. డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చి వెళ్లారు విజయ్ షా. -
నీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్
మనం హెయిర్‌కట్ చేయించుకోవాలంటే కచ్చితంగా బార్బర్ షాపుకు వెళ్లాల్సిందే. మనం చెప్పిన విధంగా హెయిర్‌కట్ చేసే బార్బర్లను చూసే ఉంటాం. అందులో కొందరు మాత్రం ట్రెండ్‌కు అనుగుణంగా ఫాలో అవుతూ డిఫరెంట్ హెయిర్‌స్టైల్స్ ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఆ కోవకు చెందినవాడే. తన షాపుకు వచ్చిన ఒక కస్టమర్‌కు వినూత్న రీతిలో హెయిర్‌కట్ చేశాడు.ఇది ఎలా ఉందా అని చూడ్డానికి బార్బర్ ఎన్ని కోణాల్లో చూశాడో లెక్కేలేదు. చివరకు దుకాణం నుంచి బయటకు వెళ్లి కూడా చూశాడు. అచ్చం టోపీ పెట్టుకుంటే ఎలా ఉంటుందో కస్టమర్ జట్టును అలానే తయారు చేశాడు. (చదవండి : అద్భుతం.. బ్లాక్ పాంథర్‌ను దించేశాడు) ఈ హెయిర్‌స్టైల్ చేయించుకుంటే దూరం నుంచి చూస్తున్నవారికి టోపీ పెట్టుకున్నాడా అనే సందేహం కూడా కలుగుతుంది. దాదాపు 44 సెకండ్ల నిడివి ఈ వీడియో చూస్తున్నంతసేపు చాలా ఫన్నీగా అనిపించినా.. బార్బర్ పని తనానికి మెచ్చకోకుండా ఉండలేం. ఇది ఎక్కడ జరిగిందన్నది తెలియదుగాని సోషల్ మీడియాలో షేర్ చేసిన కాసేపటికే వైరల్‌గా మారింది. 'నీ క్రియేటివిటీకి హ్యాట్సాఫ్.. భలే ఉంది టోపీ హెయిర్‌స్టైల్.. మీ టాలెంట్‌కు ఇవే మా జోహార్లు ' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. We need more barbers like this guy😂 pic.twitter.com/he4dhLMwlu — 🇧🇧 (@rahm3sh) September 2, 2020 -
మీరు సాయం చేయరు.. చేసే వారిని వద్దంటారా..?
కుప్పం: కోవిడ్ –19 ఎఫెక్ట్‌తో నాయీబ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ నాయకులు సాయం చేయలేదు. వైఎస్సార్ సీపీ నేతలు సాయం చేస్తుంటే విమర్శిస్తారా అంటూ టీడీపీ అనుబంధ నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు శాంతారామ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నేతలు అందించిన సహాయానికి అమ్ముడు పోతారా అని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న పలువురు నాయీ బ్రాహ్మణులు వాదోపవాదానికి దిగారు. బియ్యం, పప్పుకు ఎవరూ అమ్ముడు పోలేదన్నారు. -
రవి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా మిర్దొడ్డి మండలం ఖాజీపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన క్షౌరవృత్తిదారుడు రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్ చేసింది. అతడి కుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం అందించాలని కోరింది. క్షౌరవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రవి లాక్‌డౌన్‌తో ఉపాధిలేక, ఆర్థిక ఇబ్బందులతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడటం దురదృష్టకరమని ఐక్యవేదిక అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ అన్నారు. అతడి ఇద్దరు కూతుళ్లు కావ్య(13), వైష్ణవి(10)లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్నారు. క్షౌరవృత్తిదారులు మనోధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న క్షౌరవృత్తిదారులను ఆదుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతి క్షురకునికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా మూతపడిన సెలూన్లకు మూడు నెలల పాటు కరెంట్ బిల్లులు, అద్దె మాఫీ చేయాలని లింగం నాయీ డిమాండ్ చేశారు. రవి కుటుంబానికి అండగా నిలబడాలని జిల్లా నాయీ బ్రాహ్మణ నాయకులను ఆదేశించారు. -
మెగాస్టారైనా తలవంచాల్సిందే!
సుల్తాన్‌బజార్: నిరుద్యోగ యువతకు క్షురక వృత్తిలో మెలకువలు నేర్పుతూ అధునాతన శిక్షణ ఇస్తూ తోడ్పాటునందిస్తున్నారు. చౌటపల్లికి చెందిన ఎస్. నారాయణ. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన పొట్ట చేతపట్టుకుని తెలిసిన వృత్తి చేస్తూ కడుపునింపుకునే వారు. కాల క్రమేణా హైదరాబాద్ నగరంలో పాటు ఇతర రాష్ట్రాల్లో క్షురక వృత్తిలోని మెలకువలను నేర్చుకున్నారు. నారాయణ చిన్నప్పటి నుంచే తనకు వచ్చిన దానిలో ఇతరులకు తనవంతు సాయం చేసేవాడు. అలా ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి, యువకులకు నేటి ఫ్యాషన్‌కు అనుగుణంగా శిక్షణలు ఇస్తూ ఉపాధి కల్పిస్తుండడం విశేషం.. ప్రముఖుల హెయిర్ స్టైలిస్ట్‌గా.. మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్‌కళ్యాణ్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్‌లతో పాటు దాసరినారాయణరావు లాంటి డైరెక్టర్లకు నారాయణరావు వ్యక్తిగత బార్బర్‌గా పనిచేశాడు. పవన్‌కళ్యాణ్ మొదటి సినిమాకు పవన్‌కళ్యాణ్ హెయిర్ కటింగ్‌ను తీర్చిదిద్దాడు. అంతేకాకుండా క్రికెటర్ అజారుద్దీన్ లాంటి క్రీడాకారులకు ఆయన హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేశారు. దీంతో ఆయనకు ప్రముఖ హెయిర్ సెలూన్లలో పనిచేసే అవకాశం వచ్చింది. తన కుటుంబానికి అవరమైన డబ్బు సరిపోవడంతో తనకు చిన్ననాటి నుంచి అలవాటు ఉన్న సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తూ వచ్చాడు. దీంతో షోలోపూర్ సేవారత్న బిరుదుతో అక్కడి స్వచ్ఛంద సంస్థలు సత్కరించాయి. దీంతో అనాధాలకు వృద్ధులకు ఉచితంగా క్షవరం చేస్తూ తృప్తి పొందుతూ ఉంటారు. షోలాపూర్‌లో సేవారత్న పురస్కారం ఔత్సహికులు శిక్షణ... నగరంలో నిరుదోగ్య యువత చదుకుని ఖాళీగా ఉంటుడం తన దృష్టికి రావడంతో ఆయన యువతకు తమతమ ఉద్యోగాన్వేషణ కొనసాగిస్తూనే తమ కులవృత్తిలో మెలుకువలు నేర్చుకోవాలని వారికి అవగాహన కల్పిస్తూ సికింద్రాబాద్‌లో ఛార్మ్స్ పేరిట ఓ శిక్షణాకేంద్రాన్ని ప్రారంభించి నేటి టెక్నాలజీకి అనుగుణంగా నమామాత్రపు రుసుంతో యువతకు శిక్షణలు ఇస్తున్నాడు. ఇక్కడ శిక్షణ పొందిన వారి నగరంలో ఎంతో ఫెమస్ సేలూన్లు ఏర్పాటు చేసుకుని అతని బాటలో నడుస్తుండడం విశేషం. సమాజ సేవ ఎంతో సంతృప్తి నిస్తోంది.. నా యవ్వనంలో నా కుటుంబ కడుపునింపేందుకు పనిచేసాను. ప్రస్తుతం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఓ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి అదునిక టెక్నాలజీతో బార్బర్ వృత్తిలో శిక్షణ ఇస్తున్నాను. శిక్షణ పొందిన పొందిన వారి ఉపాధి పొందితుండడం చూస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుంది.మహిళలు సైతం బ్యూటీ పార్లర్ లాంటివి నా శిక్షణ ద్వారా ఏర్పాటు చేసుకోవడంపై ఎంతో సంతోషంగా ఉంటుంది. తన కుమారుడు సంపత్ సైతం ఇదే బాటలో నడవడం మనస్సుకు సంతృప్తి. -
బార్బర్ సిస్టర్స్‌తో షేవింగ్ చేయించుకున్న సచిన్
-
‘మాస్టర్’ మనసున్న మారాజు
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ భారత్‌లో క్రికెట్ దేవుడు. అంతేకాదు అతను మనసున్న మారాజు అని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా మళ్లీ ‘మాస్టర్’ తన పెద్ద మనసు చాటుకున్నాడు. మహిళా క్షురకులతో షేవింగ్ చేయించుకొని వారి ఆర్థిక అవసరాల కోసం స్కాలర్షిప్ అందజేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బన్వారితొల గ్రామానికి చెందిన నేహా, జ్యోతి క్షురకులు. తండ్రి అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ పోషణార్థం ఆయన వృత్తిని ఈ యువతులిద్దరు చేపట్టారు. భారత్‌లాంటి సంప్రదాయ దేశంలో కట్టుబాట్ల కంచెను దాటుకొని మహిళలు క్షౌరం చేయడం మామూలు విషయం కాదు. దీంతో బయటివారే కాదు సొంత బంధువుల నుంచే ఛీత్కారాలు ఎదురవుతుంటాయి. అలాంటి గేళి, ఎగతాళి చేసే దేశంలో జన్మనిచ్చిన తండ్రి కోసం నేహా, జ్యోతి 2014 నుంచి క్షురక వృత్తి చేపట్టారు. ఈ వార్తను తెలుసుకున్న సచిన్ వాళ్లిద్దరితో షేవింగ్ చేయించుకొని ‘జిల్లెట్’ సంస్థ ద్వారా స్కాలర్షిప్ ఇప్పించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను క్రికెట్ దిగ్గజం తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్‌లో పోస్ట్ చేశాడు. బయట షేవ్ చేసుకోవడం తనకిదే తొలిసారి అని చెప్పిన మాస్టర్, ఆ అవకాశం నేహా, జ్యోతిలకు దక్కిందని పోస్ట్ చేశాడు. -
అనారోగ్యంతో నాయీబ్రాహ్మణుడు మృతి
బెళుగుప్ప: నిరుపేద నాయీబ్రాహ్మణుడు అనారోగ్యంతో మృతి చెందాడు. నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులే ముందుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాలిలా ఉన్నాయి. బెళుగుప్పకు చెందిన మంగళి కృష్ణమూర్తి (52) బ్యాండ్‌సెట్ వాయిస్తూ వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈయనకు మూగ/మానసిక రోగి అయిన భార్య, ఏడు, ఐదు, మూడు తరగతులు చదువుతున్న కుమార్తెలు ప్రీతి, కీర్తి, దీప్తి ఉన్నారు. ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం జ్వరం తీవ్రంగా ఉండింది. రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. సోమవారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో కుమార్తెలు సమీపంలోని బంధువులకు తెలిపారు. వారు వచ్చి వైద్యులతో చూపించగా.. అప్పటికే కృష్ణమూర్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య స్థిమితంగా లేకపోవడంతో అన్నీ తానై కుమార్తెలను చూసుకునే కృష్ణమూర్తి హఠాన్మరణం అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న నాయీబ్రాహ్మణులు సెలూన్‌షాపులు బంద్ చేసి.. సంక్షేమ సంఘం సభ్యుల సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. దాతలు ముందుకొచ్చి కృష్ణమూర్తి కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి కూడా సాధారణ బీమా సొమ్ముతో పాటు పిల్లల చదువులకు సహకారం అందించాలని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు ధనుంజయ, సభ్యులు ఋషేంద్ర, రామాంజినేయులు, శంకరయ్య, శివానంద కోరారు. -
చంపాలా? వద్దా?
కథాసారం అతడు మౌనంగా లోపలికి వచ్చాడు.బుల్లెట్లున్న తోలుపట్టీని, దానికి వేలాడుతున్న తుపాకి సహా తీసి గోడకు వున్న కొక్కానికి తగిలించాడు. తన మిలిటరీ టోపీని కూడా అక్కడే పెట్టాడు. తర్వాత టై ముడి విప్పుతూ, ‘ఈ వేడిమి భయంకరంగా వుంది. నాకు గడ్డం చెయ్’ అని కుర్చీలో కూర్చున్నాడు. క్యాప్టెన్ టోరెస్! అతడిని చూడగానే క్షురకుడికి వణుకు మొదలైంది. భయంతో కూడిన భావోద్వేగాన్ని బయట పడనీయకుండా, తన దగ్గరున్న కత్తుల్లో అన్నిటికన్నా వాడిగా వున్నదాన్ని తోలుపట్టీ మీద పైకీ కిందకూ తిప్పుతూ పదునును మరింత పెంచడానికి ప్రయత్నించాడు. తర్వాత చేతి వేలితో సుతారంగా ఆ పదునును అంచనా వేశాడు. టోరెస్ గడ్డం నాలుగు రోజులదై వుంటుంది! అతడు నాలుగు రోజులుగా దళాలను వెతికే పనిలో ఉన్నాడు. అందువల్ల ముఖం ఎండ వేడిమికి కమిలి ఎర్రబడింది. క్షురకుడు జాగ్రత్తగా సబ్బు నురగ తయారు చేయటం ప్రారంభించాడు. కొన్ని సబ్బుముక్కల్ని ప్లాస్టిక్ కప్పులో పడేసి, కొన్ని వేణ్నీళ్లను అందులో పోసి, బ్రష్‌తో తిప్పటం మొదలెట్టాడు. ‘మా పటాలంలోని మిగిలినవాళ్లక్కూడా ఇంతే గడ్డం పెరిగి వుండాలి’ అన్నాడు టోరెస్. ‘ముఖ్యమైనవాళ్లు మాకు దొరికారు. కొందర్ని చంపేశాం. మరికొందరు ఇంకా బతికేవున్నారు. కానీ త్వరలోనే వాళ్లంతా చనిపోతారు’ అని కూడా అన్నాడు. ‘ఎందర్ని పట్టుకున్నారు మీరు?’ అడిగాడు క్షురకుడు. ‘పద్నాలుగు మందిని. వాళ్ల ఆచూకీ కనుక్కోవటం కోసం మేము అడవిలో చాలా లోపలికి వెళ్లాల్సి వచ్చింది. మిగిలినవాళ్లను కూడా పట్టుకుంటాం. ఒక్కడు... ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు’. క్షురకుడు ఆందోళన చెందాడు. అతడు కూడా రహస్య దళానికి చెందినవాడే! డ్రాయరు సొరుగులోంచి గుడ్డను తీసి టోరెస్ మెడ వెనకాల ముడి వేశాడు. ‘మా చర్య ఈ నగర ప్రజలకు మంచి గుణపాఠాన్ని నేర్పివుండాలి’ అన్నాడు టోరెస్. అతడు బాగా అలసిపోయినట్టుగా కళ్లు మూసుకుని, సబ్బు నురగ తాలూకు చల్లదనాన్నీ, హాయినీ అనుభవించడానికి వేచి వున్నాడు. టోరెస్‌కు అంత సమీపంగా ఎప్పుడూ వెళ్లలేదు క్షురకుడు. నగర ప్రజలందరినీ స్కూలు ప్రాంగణంలో గుమిగూడాలని టోరెస్ ఆజ్ఞ జారీ చేసినప్పుడు మాత్రం ఒక్క నిమిషం సేపు అతడికి ఎదురుగా నిలిచాడు. అక్కడ నలుగురు విప్లవకారులను చెట్లకు వేలాడదీసి తుపాకులతో కాల్చేస్తుంటే ప్రజలందరూ చూడాలని టోరెస్ కోరిక. గాయాలతో చెదిరిపోయిన ఆ శవాలను చూసి, ఆ చర్యకు ముఖ్యకారకుడైన మిలిటరీ అధికారి ముఖాన్ని అప్పుడు అంత పరీక్షగా చూడలేదు. కానీ ఆ ముఖాన్నే ఇప్పుడు తన చేతుల్లోకి తీసుకోబోతున్నాడు. టోరెస్ అందవికారంగా ఏం లేడు. ఆ గడ్డం వల్ల వయసు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. అతడు మంచి ఊహాశాలీనత ఉన్నవాడయ్యుండాలి. లేకపోతే విప్లవకారుల్ని నగ్నంగా చెట్లకు వేలాడదీసి, వాళ్ల శరీరాలను టార్గెట్లు చేస్తూ షూట్ చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? సబ్బు నురగను అనుభవిస్తూ, కళ్లు మూసుకునే అన్నాడు టోరెస్: ‘నేను ఎంతగా అలసిపోయి వున్నానంటే ఇప్పుడు నేరుగా నిద్రలోకి జారుకోగలను. కానీ ఈ సాయంత్రం నేను చేయాల్సిన పని ఎంతో వుంది’. సబ్బు నురగ పులమటం ఆపి, ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా, ‘మళ్లీ కాల్పులు కొనసాగిస్తారా?’ అడిగాడు క్షురకుడు. ‘అట్లాంటిదే. కానీ అంత తీవ్రమైన చర్య కాదు’. క్షురకుడి చేతులు మళ్లీ వణికాయి. అయినా ఇతర కస్టమర్లకు చేసినట్టుగానే ఇతడికి కూడా ఒక్క చుక్క రక్తం రాకుండా జాగ్రత్తగా గడ్డం తీయాలి. వెంట్రుకల మీద కత్తిని పక్కకు పోనీయకూడదు. అరచేతి వెనుక భాగాన్ని ముఖానికి ఆనించి కదిపితే ఒక్క వెంట్రుక కూడా లేనట్టు తెలియాలి. కత్తి బ్లేడును తెరిచి సైడ్ లాక్ నుండి గీయటం మొదలెట్టాడు. కత్తి మెత్తగా జారుతోంది. టోరెస్ వెంట్రుకలు మందంగా, బిరుసుగా ఉన్నాయి. గీస్తుంటే చిన్నగా చర్మం తేలుతోంది. ‘ఈరోజు ఆరు గంటలకు బడి దగ్గరకు రా’ అన్నాడు టోరెస్. ‘ఆరోజు లాగానే జరగబోతోందా?’ ‘ఇంకా బాగా కూడా వుండొచ్చు’ ‘ఏం చెయ్యాలనుకుంటున్నారు?’ ‘ఇంకా నాకే తెలియదు. కానీ మంచి వినోదం వుండబోతోంది’ ‘అందర్నీ శిక్షించాలని ప్లాను వేసుకున్నారా?’ ధైర్యం చేసి అడిగాడు. ‘అందర్నీ’ అద్దంలో కనబడే వీధిని చూశాడు క్షురకుడు. ముందరిలాగే కిరాణా దుకాణం, అందులో ఇద్దరో ముగ్గురో కస్టమర్లు ఉన్నారు. గడియారం రెండూ ఇరవై సూచిస్తోంది. మెడమీద కత్తిని మెల్లగా కదుపుతున్నాడు. అక్కడ గీసేటప్పుడు చాలా చాకచక్యంగా ఉండాలి. వెంట్రుకలు మందంగా లేకపోయినా చిన్నచిన్న రింగులుగా మెలి తిరిగినయ్. ఆ చర్మరంధ్రాల్లో ఏదైనా ఒకటి తెరుచుకుని రక్తాన్ని స్రవింపజేయగలదు. విప్లవకారుల్లో ఎంతమంది చంపించాడతడు! ఎంతమందిని చిత్రవధల పాలు చేశాడు! తన చేతుల్లో వున్న టోరెస్ ముఖానికి శుభ్రంగా గడ్డం గీసి, భద్రంగా ప్రాణాలతో వదిలేయటం భరించరాని విషయమనిపించింది. నిజానికి అతణ్ని చంపటం ఇప్పుడు ఎంత సులభం! గొంతును సర్రుమని కోసి. ప్రతిఘటించటానికి కూడా సమయం ఇవ్వకుండా. కళ్లు మూసుకుని వున్నాడు కనుక మెరిసే కత్తిని గుర్తించలేడు. మెడలోకి కత్తిని దించితే అందులోంచి రక్తం చిమ్మి గుడ్డనూ, కుర్చీనీ, నేలనూ మొత్తంగా తడిపేయగలదు. వెచ్చని రక్తం నేల మీదుగా పారి వీధిలోకి కూడా ప్రవహిస్తుంది. లోతుగా పెట్టే గాటు పెద్ద నొప్పిని కూడా కలిగించదు. మరి శవాన్ని ఏం చేయాలి? ఎక్కడ దాచాలి? క్యాప్టెన్ టోరెస్‌ను చంపిన హంతకుడు... గడ్డం గీస్తున్నప్పుడు గొంతు కోశాడు పిరికిపంద, అనుకుంటారు జనం. మనందరి వైపు నుండి ప్రతీకారం తీర్చుకున్నాడు, అని కూడా అనుకోవచ్చు! పట్టువస్త్రంలాగా, మెత్తని రబ్బరు ముక్కలాగా అతని చర్మం సులభంగా తెగిపోతుంది. మనిషి చర్మం కన్నా ఎక్కువ మెత్తనైనది మరేదీ లేదేమో! బయటికి చిమ్ముకుని రావడానికి లోపల రక్తం వుండనే వుంటుంది. కానీ నేను హంతకుణ్ని కాదలుచుకోలేదు. నువ్వు గడ్డం గీయించుకోవటం కోసం నా దగ్గరికి వచ్చావు. నేను నా పనిని గౌరవప్రదంగా చేస్తాను. నా చేతులకు రక్తం అంటుకోవడం నాకిష్టం లేదు. కేవలం సబ్బు నురగ చాలు! నున్నగా శుభ్రంగా గడ్డం గీకేశాడు క్షురకుడు. టోరెస్ అద్దంలో చూసుకున్నాడు. అరచేతుల్తో చెంపల్ని ముట్టుకుని, ‘థాంక్స్’ అన్నాడు. కుర్చీలోంచి లేచి, బెల్టు, పిస్తోలు, టోపీ చేతిలోకి తీసుకున్నాడు. ప్యాంటు జేబులోంచి నాణాల్ని బయటికి తీసి ఇచ్చాడు. బయటికి వెళ్లబోతూ, ద్వారం దగ్గర ఆగి– ‘నువ్వు నన్ను చంపుతావని అన్నారు కొందరు. ఆ విషయం తేల్చుకోవటానికి ఇక్కడికి వచ్చాను. చంపటం అంత సులువైన పనికాదు. నేను చెబుతున్న ఈ వాక్యంలో ఎంతో వాస్తవం ఉంది’ అన్నాడు టోరెస్. క్షురకుడు అక్కడే ఉండిపోయాడు. -
నేను ఇలాగే చేస్తా!.. అయితే ఏంటి??
వాషింగ్టన్ : అమెరికాలోని మిస్కాన్సన్ నగరంలోని 22 ఏళ్ల యువకుడు.. క్రిస్మస్ సందర్భంగా అందంగా రెడీ అవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా లేటెస్ట్ హెయిర్ స్టయిల్ కోసం క్షౌరశాలకు వెళ్లాడు. లేటెస్ట్ ట్రెండ్ అయిన.. ‘2’ ఆకారంలో హెయిర్ కటింగ్ చేయాలని క్షురకుడికి చెప్పాడు. యువకుడి చెప్పింది వినిపించుకోని క్షరుకుడు.. ‘0’ ఆకారంలో హెయిర్ కటింగ్ చేశాడు. క్షరకుడు చెప్పినట్లు చేస్తున్నాడులే అన్న ధైర్యంతో యువకుడు కళ్లు మూసుకుని పాటలు వింటూ కాలం గడిపేశాడు. కటింగ్ అంతా పూర్తయ్యాక.. అద్దంలో చూసుకుని యువకుడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అంతే నేను చెప్పిందేమిటి? నువ్వేచేసిందేమిటి? అని క్షురకుడితో యువకుడు గొడవకు దిగాడు. ‘నేను ఇలాగే చేసా.. నువ్వు చెప్పింది వినపడలేదు.. ఇప్పుడు ఏం చేయగలవు’ అంటూ అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో.. క్షురకుడు చేతిలోకి కత్తి తీసుకుని యువకుడిపై దాడి చేశాడు. ఈ హఠాత్ పరిణామాన్ని యువకుడు ఊహించే లోపు.. చెవి భాగం కోసుకుపోయింది. ఈ ఘటనపై ఆగ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు క్షురకుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షురకుడిని 46 ఏళ్ల షబానీ ఖలీద్‌గా పోలీసులు గుర్తించారు. -
మంగళవారం షాపు తెరిచాడని ఘర్షణ
బెంగళూరు: మంగళవారం పూట బార్బర్ షాపు తెరిచాడనే ఆవేశంతో ఓ ముస్లిం షాపు యజమానిపై దాడిచేసిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళూరుకు సమీపంలోని నెల్లివాడి గ్రామంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతమంది భజరంగ్ దళ్ కార్యకర్తలు నాయకులు, మూకుమ్మడిగా షాపు యజమాని సల్మాన్ పై దాడి చేశారు. షాపులను ధ్వంసం చేశారు. దీంతో ముస్లిం, విశ్వహిందూ పరిషత్ కు చెందిన రెండు గ్రూపుల మధ్య వివాదం రాజుకుంది. ఉదయ్ కుమార్, బాలయ్య ఆధ్వర్యంలో సల్మాన్ పై దాడి చేశారు. దీంతో పాటు స్థానిక మసీద్ పై దాడికి దిగారు. దీనికి ప్రతిగా మరో గ్రూపు ఎదురు దాడికి పూనుకుంది. స్థానిక ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీసినందుకు సల్మాన్ పై దాడి చేసినట్టుగా భజరగ్ దళ్ నాయకుడు రవి బాలయ్య తన వైఖరిని సమర్ధించుకున్నారు. హిందువులు మంగళవారం క్షవరం చేయించుకోరనే సంగతి అందరికీ తెలుసన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ పనికి పూనుకున్నారని ఆరోపించారు. అటు వీరి ఆరోపణలు తిప్పికొట్టిన ముస్లిం నేతలు ప్రత్యారోపణలు చేశారు. ఒక పథకం ప్రకారం భజరంగ్ దళ్ నేతలు ముస్లింలపై దాడి దిగారని స్థానిక మసీదు పెద్ద ఆరోపించారు. యువతను రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించారన్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ మతఘర్షణలో లక్షల రూపాయల ఆస్తి ధ్వంసమైంది. పలువురుకి గాయాలయ్యాయి. వివాదాన్ని చక్కదిద్దేందుకు పోలీసులు కర్ఫూ విధించారు. ఇరువర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. పరిస్థితి అదుపులో ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. -
గంటలో 75 మందికి గుండు!
యూకేకు చెందిన క్షురకుడు శామ్ ర్యాన్ గంటలో 75 మందికి గుండు కొట్టేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కేశాడు. రికార్డుల పిచ్చికాకపోతే.. గుండు కొట్టించుకున్నవాళ్ల పరిస్థితి ఏంటో పాపం! అని విచారించాల్సిన పనిలేదు. గుండు కొట్టడంలో మనోడు ఎక్స్పర్ట్. ఇంతకీ ర్యాన్ ఈ పని చేయడానికి కారణమేంటో తెలుసా..? అతని స్నేహితురాలి మరణం! అవును.. క్యాన్సర్‌తో చనిపోయిన క్లేర్ ఎల్లిస్ కోసమే ఈ గుండు గీత కార్యక్రమం! రెగ్యులర్‌గా తన సెలూన్‌కి వచ్చే ఎల్లిస్‌కు కొన్ని సంవత్సరాల క్రితం క్యాన్సర్ సోకింది. దీంతో ఆమె కీమోథెరపీ చేయించుకోవాల్సివచ్చింది. ఈ కారణంగా జుట్టు కోల్పోయిన ఆమె.. తర్వాత పూర్తిగా సెలూన్‌కు రావడం మానేసింది. ఆరోగ్యం క్షీణించిన ఎల్లిస్ కొద్దిరోజులకే మరణించింది. ఈ వార్త తెలుసుకున్న శామ్ ర్యాన్ ఆమె జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. ముందుగా ఓ పెద్ద పార్కుని ఎంచుకున్న ఆయన.. 75 మందికి ఊదారంగు టీషర్టులు తొడిగి, వరుసగా కూర్చోబెట్టి పనికానిచ్చేశాడు. ఒక్కోగుండుకు సగటున 48 సెకండ్లు తీసుకున్న ర్యాన్, గంటలోనే మొత్తాన్నీ ఫినిష్ చేసేశాడు. వారి నుంచి సేకరించిన నగదును ఓ స్వచ్ఛంద సంస్థకు అందించాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న గిన్నిస్ ప్రతినిధులు ఆయనకు ఇటీవలే సర్టిఫికెట్ కూడా అందించారు. -
క్షురకుడిపై టీటీడీ అధికారి దాడి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలో పనిచేస్తున్న సురేశ్ బాబు అనే క్షురకుడిపై టీటీడీ అధికారి రామారావు దాడి చేశారు. అక్కడితో ఆగకుండా కులం పేరుతో దూషించారు. దీనిపై బాధితుడు కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో బేబీ సరోజినికి ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన రామారావుపై చర్య తీసుకోవాలని కోరాడు. బాధితుడికి న్యాయం జరగకపోతే ఆందోళన చేపడతామని క్షురకుల సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఈవోకు నివేదిక ఇస్తామని డిప్యూటీ ఈవో తెలిపారు. -
టీటీడీలో ‘బ్లేడ్’బాబ్జీ
బ్లేడ్ల సరఫరా టెండర్లను ఎప్పటికప్పుడురద్దు చేస్తున్న ఉన్నతాధికారి! అస్మదీయునికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా నామినేషన్ పద్ధతిలో అప్పగింత టీటీడీలో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్‌కు పని కట్టబెట్టడం ఇదే తొలిసారి నాసిరకం బ్లేడ్లను సరఫరా చేస్తుండడంతో ఇబ్బంది పడుతున్న క్షురకులు, భక్తులు అయిన వారికి ఆకుల్లో చదివించడం అంటే ఇదే..! టీటీడీ లో ఏ వస్తువునైనా టెండర్ విధానంలోనే కొనుగోలు చేయ డం రివాజు. ఇలా అయితే అస్మదీయునికి లబ్ధి చేకూర్చలేమని గ్రహించిన ఓ ఉన్నతాధికారి.. ఏకంగా నాలుగు సార్లు టెండర్లు రద్దుచేశారు. చివరకు నామినేషన్ పద్ధతిలో అస్మదీయునికి పనిని కట్టబెట్టారు. ఇంతకూ ఆ పని ఏంటంటే.. కల్యాణకట్టకు అవసరమైన బ్లేడ్లను సరఫరా చేయడం. ఆ పనులను దొడ్డిదారిన దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకం బ్లేడ్లను సరఫరా చేస్తుండడంతో అటు క్షురకులు.. ఇటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది టీటీడీలో హాట్‌టాపిక్‌గా మారింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల కల్యాణకట్టల్లో రోజుకు సగటున 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నట్టు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. భక్తుల తలనీలాలు విక్రయించడం వల్ల ఏటా టీటీడీకి రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతోంది. భక్తుల తలానీలాలు తీయడానికి ఏడాదికి 70 లక్షల డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్లు అవసరం. ఆ బ్లేడ్లను ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానంలో కొనుగోలు చేస్తారు. నిబంధనలు తుంగలోకి.. బ్లేడ్ల కొనుగోలుకు సెప్టెంబర్ 18, 2013న మొదటి సారి టెండర్ పిలిచారు. బ్లేడ్ల తయారీదారులు మాత్రమే టెండర్లో పాల్గొనడానికి అర్హులని ఓ నిబంధన పెట్టారు. క్రోమియం 12.81 శాతం, 0.1 శాతం మందం, ఎలాంటి మచ్చలు, క్రాక్స్ లేకుండా ఉండే బ్లేడ్లను మాత్రమే సరఫరా చేయాలని షరతు పెట్టారు. ప్రసిద్ధిగాంచిన ఓ రెండు సంస్థలతోపాటు మరో సంస్థ డిస్ట్రిబ్యూటర్(తిరుపతి) టెండర్ షెడ్యూళ్లను దాఖలు చేశారు. ఆ డిస్ట్రిబ్యూటర్ టీటీడీ ఉన్నతాధికారికి సన్నిహితుడు. నిబంధన మేరకు అధికారులు డిస్ట్రిబ్యూటర్‌పై వేటు వేయడంతో ఉన్నతాధికారి ఆగ్రహించారు. టెండర్లో పేర్కొన్న నిబంధనల మేరకు ఓ ప్రసిద్ధిగాంచిన సంస్థ బహిరంగ మార్కెట్లో రూ.6 కు లభించే బ్లేడ్‌ను రూ.రెండుకు సరఫరా చేయడానికి అంగీకరించింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థకే టెండర్ ఖరారు చేయాలి. కానీ.. ఉన్నతాధికారి టెండర్‌ను రద్దు చేశారు. బ్లేడ్ల సరఫరాకు ఫిబ్రవరి 14న రెండోసారి టెండర్ పిలిచారు. ఏ ఒక్క సంస్థ షెడ్యూలు దాఖలు చేయకపోవడంతో టెండర్‌ను రద్దు చేశారు. మార్చి 7న ముచ్చటగా మూడోసారి టెండర్ పిలిచారు. తొలిసారి రూ.రెండుకే బ్లేడ్‌ను సరఫరా చేయడానికి ముందుకొచ్చిన ఒక సంస్థ మాత్రమే సింగిల్ షెడ్యూలు దాఖలు చేసింది. దాంతో.. టెండర్‌ను మూడోసారి రద్దు చేశారు. అస్మదీయుడికి టెండర్‌ను కట్టబెట్టాలనే లక్ష్యంతో సరికొత్త నిబంధనలు రూపొందించి నాలుగోసారి ఏప్రిల్ 9న టెండర్ పిలిచారు. ఈ టెండర్లో అస్మదీయుడుతోపాటు మరో రెండు సంస్థలు షెడ్యూళ్లను దాఖలు చేశాయి. అస్మదీయుడు సరఫరా చేసే బ్లేడ్లు నాణ్యంగా లేవని ల్యాబ్‌లో తేలడంతో ఉన్నతాధికారి మళ్లీ టెండర్‌ను రద్దు చేశారు. కుంటి సాకు చూపి.. ఈలోగా కల్యాణకట్టలో బ్లేడ్ల కొరత ఏర్పడింది. ఇదే సాకుగా చూపి తొలుత ఐదు లక్షల బ్లేడ్లను సరఫరా చేసే పనిని అస్మదీయునికి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. ఓ సంస్థ ఉత్పత్తి చేసే బ్లేడ్లను ఒక్కోదానిని రూ.1.22కు సరఫరా చేసేలా టీటీడీతో అస్మదీయుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రకం బ్లేడ్ బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్ దుకాణాల్లో 75 పైసలకే దొరుకుతోంది. ఉన్నతాధికారి సన్నిహితుడు కళ్యాణకట్టకు నాసిరకం బ్లేడ్లను సరఫరా చేస్తున్నారు. ఆ బ్లేడ్లతో తల నీలాలు తీసేందుకు క్షురకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలనీలాలు తీసేటపుడు గాట్లు పడి.. రక్తం వస్తుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అత్యవసరమైన సాకు చూపి మరో 65 లక్షల బ్లేడ్లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడానికి ఆ ఉన్నతాధికారి సిద్ధమయ్యారు. ఆ ఉన్నతాధికారి నిర్ణయం వల్ల టీటీడీ ఖజానాకు రూ.35 లక్షల మేర కన్నం పడుతుంది. ఇదే సాకు చూపి అన్నదానంలో వినియోగించే వస్తువులను కూడా నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడానికి ఉన్నతాధికారి కసరత్తు చేస్తోండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భక్తులకు క్షవరమే..
టికెట్‌తో పాటు అదనపు వసూళ్లు చేస్తున్న క్షురకులు అప్పన్న భక్తుల నిరసన పట్టించుకోని దేవస్థానం అధికారులు సింహాచలం : మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి క్షురకులు అదనంగా సొమ్ము డిమాండ్ చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామికి తలనీలాలు సమర్పించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సింహగిరికి తరలి వస్తుంటారు. వీరంతా దేవస్థానం విక్రయించే రూ.10 టికెట్ కొంటారు. ఈ సొమ్ములో రూ.5 ఆలయానికి, మరో రూ.5 కాంట్రాక్టు క్షురకులకు వెళ్తుంది.కేశఖండనశాలలో దేవస్థానానికి చెందిన శాశ్వత ఉద్యోగులు ఏడుగురు మినహాయిస్తే 63 మంది వరకు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో కొంతమంది క్షురకులు తలనీలాలు తీసిన తర్వాత నగదు డిమాండ్ చేస్తుండటంపై భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమశక్తిననుసరించి భక్తులు ఐదో, పదో అదనంగా బహుమతిగా చేతిలో పెడితే క్షురకులు తీసుకోకుండా రూ. 20కి తక్కువ కాకుండా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో భక్తులు అవాక్కవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందయినా వారడిగింది ఇవ్వవలసి వస్తోంది. ఈ సంఘటనలపై దేవస్థానం అధికారులకు గతంలో పలువురు భక్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వచ్చేనెల 1 నుంచి తలనీలాల టికెట్ 15 రూపాయలకు దేవస్థానం పెంచింది. ఈ మొత్తంలో రూ. 10 క్షురకులకు, రూ. 5 దేవస్థానానికి వచ్చేలా నిర్దేశించింది. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాతైనా క్షురకులు తమ నుంచి నగదు డిమాండ్ చేసే పద్ధతి విడనాడాలని పలువురు భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.