చంపాలా? వద్దా? | Kill? Whether or not? | Sakshi
Sakshi News home page

చంపాలా? వద్దా?

Published Mon, Jan 15 2018 1:05 AM | Last Updated on Mon, Jan 15 2018 1:06 AM

Kill? Whether or not? - Sakshi

కథాసారం

అతడు మౌనంగా లోపలికి వచ్చాడు.బుల్లెట్లున్న తోలుపట్టీని, దానికి వేలాడుతున్న తుపాకి సహా తీసి గోడకు వున్న కొక్కానికి తగిలించాడు.  తన మిలిటరీ టోపీని కూడా అక్కడే పెట్టాడు. తర్వాత టై ముడి విప్పుతూ, ‘ఈ వేడిమి భయంకరంగా వుంది. నాకు గడ్డం చెయ్‌’ అని కుర్చీలో కూర్చున్నాడు.


క్యాప్టెన్‌ టోరెస్‌! అతడిని చూడగానే క్షురకుడికి వణుకు మొదలైంది. భయంతో కూడిన భావోద్వేగాన్ని బయట పడనీయకుండా, తన దగ్గరున్న కత్తుల్లో అన్నిటికన్నా వాడిగా వున్నదాన్ని తోలుపట్టీ మీద పైకీ కిందకూ తిప్పుతూ పదునును మరింత పెంచడానికి ప్రయత్నించాడు. తర్వాత చేతి వేలితో సుతారంగా ఆ పదునును అంచనా వేశాడు. టోరెస్‌ గడ్డం నాలుగు రోజులదై వుంటుంది! అతడు నాలుగు రోజులుగా దళాలను వెతికే పనిలో ఉన్నాడు. అందువల్ల ముఖం ఎండ వేడిమికి కమిలి ఎర్రబడింది. 

క్షురకుడు జాగ్రత్తగా సబ్బు నురగ తయారు చేయటం ప్రారంభించాడు. కొన్ని సబ్బుముక్కల్ని ప్లాస్టిక్‌ కప్పులో పడేసి, కొన్ని వేణ్నీళ్లను అందులో పోసి, బ్రష్‌తో తిప్పటం మొదలెట్టాడు. 
‘మా పటాలంలోని మిగిలినవాళ్లక్కూడా ఇంతే గడ్డం పెరిగి వుండాలి’ అన్నాడు టోరెస్‌. ‘ముఖ్యమైనవాళ్లు మాకు దొరికారు. కొందర్ని చంపేశాం. మరికొందరు ఇంకా బతికేవున్నారు. కానీ త్వరలోనే వాళ్లంతా చనిపోతారు’ అని కూడా అన్నాడు. ‘ఎందర్ని పట్టుకున్నారు మీరు?’ అడిగాడు క్షురకుడు.

‘పద్నాలుగు మందిని. వాళ్ల ఆచూకీ కనుక్కోవటం కోసం మేము అడవిలో చాలా లోపలికి వెళ్లాల్సి వచ్చింది. మిగిలినవాళ్లను కూడా పట్టుకుంటాం. ఒక్కడు... ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు’.
క్షురకుడు ఆందోళన చెందాడు. అతడు కూడా రహస్య దళానికి చెందినవాడే! డ్రాయరు సొరుగులోంచి గుడ్డను తీసి టోరెస్‌ మెడ వెనకాల ముడి వేశాడు. ‘మా చర్య ఈ నగర ప్రజలకు మంచి గుణపాఠాన్ని నేర్పివుండాలి’ అన్నాడు టోరెస్‌. అతడు బాగా అలసిపోయినట్టుగా కళ్లు మూసుకుని, సబ్బు నురగ తాలూకు చల్లదనాన్నీ, హాయినీ అనుభవించడానికి వేచి వున్నాడు. 

టోరెస్‌కు అంత సమీపంగా ఎప్పుడూ వెళ్లలేదు క్షురకుడు. నగర ప్రజలందరినీ స్కూలు ప్రాంగణంలో గుమిగూడాలని టోరెస్‌ ఆజ్ఞ జారీ చేసినప్పుడు మాత్రం ఒక్క నిమిషం సేపు అతడికి ఎదురుగా నిలిచాడు. అక్కడ నలుగురు విప్లవకారులను చెట్లకు వేలాడదీసి తుపాకులతో కాల్చేస్తుంటే ప్రజలందరూ చూడాలని టోరెస్‌ కోరిక. గాయాలతో చెదిరిపోయిన ఆ శవాలను చూసి, ఆ చర్యకు ముఖ్యకారకుడైన మిలిటరీ అధికారి ముఖాన్ని అప్పుడు అంత పరీక్షగా చూడలేదు. కానీ ఆ ముఖాన్నే ఇప్పుడు తన చేతుల్లోకి తీసుకోబోతున్నాడు.

టోరెస్‌ అందవికారంగా ఏం లేడు. ఆ గడ్డం వల్ల వయసు కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. అతడు మంచి ఊహాశాలీనత ఉన్నవాడయ్యుండాలి. లేకపోతే విప్లవకారుల్ని నగ్నంగా చెట్లకు వేలాడదీసి, వాళ్ల శరీరాలను టార్గెట్లు చేస్తూ షూట్‌ చేయాలనే ఆలోచన ఎవరికి వస్తుంది? సబ్బు నురగను అనుభవిస్తూ, కళ్లు మూసుకునే అన్నాడు టోరెస్‌: ‘నేను ఎంతగా అలసిపోయి వున్నానంటే ఇప్పుడు నేరుగా నిద్రలోకి జారుకోగలను. కానీ ఈ సాయంత్రం నేను చేయాల్సిన పని ఎంతో వుంది’. సబ్బు నురగ పులమటం ఆపి, ఏమాత్రం ఆసక్తి లేనట్టుగా, ‘మళ్లీ కాల్పులు కొనసాగిస్తారా?’ అడిగాడు క్షురకుడు. 

‘అట్లాంటిదే. కానీ అంత తీవ్రమైన చర్య కాదు’. క్షురకుడి చేతులు మళ్లీ వణికాయి. అయినా ఇతర కస్టమర్లకు చేసినట్టుగానే ఇతడికి కూడా ఒక్క చుక్క రక్తం రాకుండా జాగ్రత్తగా గడ్డం తీయాలి. వెంట్రుకల మీద కత్తిని పక్కకు పోనీయకూడదు. అరచేతి వెనుక భాగాన్ని ముఖానికి ఆనించి కదిపితే ఒక్క వెంట్రుక కూడా లేనట్టు తెలియాలి. కత్తి బ్లేడును తెరిచి సైడ్‌ లాక్‌ నుండి గీయటం మొదలెట్టాడు. కత్తి మెత్తగా జారుతోంది. టోరెస్‌ వెంట్రుకలు మందంగా, బిరుసుగా ఉన్నాయి. గీస్తుంటే చిన్నగా చర్మం తేలుతోంది.

‘ఈరోజు ఆరు గంటలకు బడి దగ్గరకు రా’ అన్నాడు టోరెస్‌. ‘ఆరోజు లాగానే జరగబోతోందా?’ ‘ఇంకా బాగా కూడా వుండొచ్చు’ ‘ఏం చెయ్యాలనుకుంటున్నారు?’ ‘ఇంకా నాకే తెలియదు. కానీ మంచి వినోదం వుండబోతోంది’ ‘అందర్నీ శిక్షించాలని ప్లాను వేసుకున్నారా?’ ధైర్యం చేసి అడిగాడు. ‘అందర్నీ’  అద్దంలో కనబడే వీధిని చూశాడు క్షురకుడు. ముందరిలాగే కిరాణా దుకాణం, అందులో ఇద్దరో ముగ్గురో కస్టమర్లు ఉన్నారు. గడియారం రెండూ ఇరవై సూచిస్తోంది. మెడమీద కత్తిని మెల్లగా కదుపుతున్నాడు. అక్కడ గీసేటప్పుడు చాలా చాకచక్యంగా ఉండాలి.

వెంట్రుకలు మందంగా లేకపోయినా చిన్నచిన్న రింగులుగా మెలి తిరిగినయ్‌. ఆ చర్మరంధ్రాల్లో ఏదైనా ఒకటి తెరుచుకుని రక్తాన్ని స్రవింపజేయగలదు. విప్లవకారుల్లో ఎంతమంది చంపించాడతడు! ఎంతమందిని చిత్రవధల పాలు చేశాడు! తన చేతుల్లో వున్న టోరెస్‌ ముఖానికి శుభ్రంగా గడ్డం గీసి, భద్రంగా ప్రాణాలతో వదిలేయటం భరించరాని విషయమనిపించింది. నిజానికి అతణ్ని చంపటం ఇప్పుడు ఎంత సులభం! గొంతును సర్రుమని కోసి. ప్రతిఘటించటానికి కూడా సమయం ఇవ్వకుండా. కళ్లు మూసుకుని వున్నాడు కనుక మెరిసే కత్తిని గుర్తించలేడు.

మెడలోకి కత్తిని దించితే అందులోంచి రక్తం చిమ్మి గుడ్డనూ, కుర్చీనీ, నేలనూ మొత్తంగా తడిపేయగలదు. వెచ్చని రక్తం నేల మీదుగా పారి వీధిలోకి కూడా ప్రవహిస్తుంది. లోతుగా పెట్టే గాటు పెద్ద నొప్పిని కూడా కలిగించదు. మరి శవాన్ని ఏం చేయాలి? ఎక్కడ దాచాలి? క్యాప్టెన్‌ టోరెస్‌ను చంపిన హంతకుడు... గడ్డం గీస్తున్నప్పుడు గొంతు కోశాడు పిరికిపంద, అనుకుంటారు జనం. మనందరి వైపు నుండి ప్రతీకారం తీర్చుకున్నాడు, అని కూడా అనుకోవచ్చు! పట్టువస్త్రంలాగా, మెత్తని రబ్బరు ముక్కలాగా అతని చర్మం సులభంగా తెగిపోతుంది.

మనిషి చర్మం కన్నా ఎక్కువ మెత్తనైనది మరేదీ లేదేమో! బయటికి చిమ్ముకుని రావడానికి లోపల రక్తం వుండనే వుంటుంది. కానీ నేను హంతకుణ్ని కాదలుచుకోలేదు. నువ్వు గడ్డం గీయించుకోవటం కోసం నా దగ్గరికి వచ్చావు. నేను నా పనిని గౌరవప్రదంగా చేస్తాను. నా చేతులకు రక్తం అంటుకోవడం నాకిష్టం లేదు. కేవలం సబ్బు నురగ చాలు! నున్నగా శుభ్రంగా గడ్డం గీకేశాడు క్షురకుడు. టోరెస్‌ అద్దంలో చూసుకున్నాడు. అరచేతుల్తో చెంపల్ని ముట్టుకుని, ‘థాంక్స్‌’ అన్నాడు. 

కుర్చీలోంచి లేచి, బెల్టు, పిస్తోలు, టోపీ చేతిలోకి తీసుకున్నాడు. ప్యాంటు జేబులోంచి నాణాల్ని బయటికి తీసి ఇచ్చాడు. బయటికి వెళ్లబోతూ, ద్వారం దగ్గర ఆగి– ‘నువ్వు నన్ను చంపుతావని అన్నారు కొందరు. ఆ విషయం తేల్చుకోవటానికి ఇక్కడికి వచ్చాను. చంపటం అంత సులువైన పనికాదు. నేను చెబుతున్న ఈ వాక్యంలో ఎంతో వాస్తవం ఉంది’ అన్నాడు టోరెస్‌. క్షురకుడు అక్కడే ఉండిపోయాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement