మధ్యప్రదేశ్ ఖండ్వా జిల్లాలోని గులైమల్‌లో ఉంటాడు రోహీదాస్. లోకల్ కుర్రాడు. చేతిలో పనుంది. చేతికి పని లేదు. హెయిర్ కటింగ్ అతడికి తెలిసిన విద్య. ఎక్కడో పని చేస్తూ కరోనా వల్ల ఆ సెలూన్ మూత పడటంతో తను రోడ్డున పడ్డాడు. సొంతంగా షాప్ పెట్టుకోడానికి కత్తెర్లు క్రీముల వరకు కొనగలడు కానీ, పి.పి.ఇ. సరంజామా కష్టం. అవి లేందే ఎవరూ ధైర్యం చేసి రావడం లేదు. చూసి చూసి తనే ధైర్యం చేశాడు. నేరుగా మంత్రి గారిని కలిశాడు. అడవుల శాఖ మంత్రి ఆయన. పేరు విజయ్ షా. గులైమల్‌లో చిన్న కార్యక్రమానికి వస్తే అక్కడికి వెళ్లి ఆయనకు తన పరిస్థితి చెప్పుకున్నాడు రోహీదాస్. ‘సరే నేను స్టేజి మీద ఉంటాను. నువ్వెళ్లి నీ కటింగ్ కిట్ తెచ్చుకో..’ అన్నారు మంత్రిగారు. రోహీదాస్‌కి అర్ధం అయిపోయింది. మంత్రిగారు కటింగ్ చేయించుకుని చేతికొచ్చినంత చేతిలో పెట్టి వెళ్లిపోతారని.
వెళ్లి టూల్ బాక్స్ తెచ్చుకున్నాడు. మంత్రిగారు స్టేజ్ పైకి రమ్మన్నారు. వెళ్లాడు. కటింగ్ చెయ్యమన్నారు. చేశాడు. షేవింగ్ కూడా అన్నారు. అదీ చేశాడు. ఎలా చేసిందీ అద్దంలో చూపించాడు. ‘బాగా చేశావోయ్’ అన్నారు మంత్రిగారు. రోహీదాస్ ఊహించినట్లే చేతికి అందినంతా ఇచ్చి స్టేజ్ దిగి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ భుజం తట్టారు. ఆయన దాటి పోయాక, గుప్పెట తెరిచి చూసుకున్నాడు రోహీదాస్. అన్నీ రెండువేల నోట్లు! లెక్కపెట్టుకున్నాడు. 30 ఉన్నాయి. అరవై వేల రూపాయలు!! అంతకన్నా పెద్ద అమౌంట్ మంత్రిగారు భుజం తట్టడం. డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చి వెళ్లారు విజయ్ షా.
Comments
Please login to add a commentAdd a comment