కృష్ణమూర్తి మృతదేహం వద్ద విషణ్ణ వదనంలో భార్యాపిల్లలు
బెళుగుప్ప: నిరుపేద నాయీబ్రాహ్మణుడు అనారోగ్యంతో మృతి చెందాడు. నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులే ముందుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. వివరాలిలా ఉన్నాయి. బెళుగుప్పకు చెందిన మంగళి కృష్ణమూర్తి (52) బ్యాండ్‌సెట్ వాయిస్తూ వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈయనకు మూగ/మానసిక రోగి అయిన భార్య, ఏడు, ఐదు, మూడు తరగతులు చదువుతున్న కుమార్తెలు ప్రీతి, కీర్తి, దీప్తి ఉన్నారు. ఉన్నపళంగా అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం జ్వరం తీవ్రంగా ఉండింది.
రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. సోమవారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో కుమార్తెలు సమీపంలోని బంధువులకు తెలిపారు. వారు వచ్చి వైద్యులతో చూపించగా.. అప్పటికే కృష్ణమూర్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య స్థిమితంగా లేకపోవడంతో అన్నీ తానై కుమార్తెలను చూసుకునే కృష్ణమూర్తి హఠాన్మరణం అందరినీ కలచివేసింది. విషయం తెలుసుకున్న నాయీబ్రాహ్మణులు సెలూన్‌షాపులు బంద్ చేసి.. సంక్షేమ సంఘం సభ్యుల సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. దాతలు ముందుకొచ్చి కృష్ణమూర్తి కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి కూడా సాధారణ బీమా సొమ్ముతో పాటు పిల్లల చదువులకు సహకారం అందించాలని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు ధనుంజయ, సభ్యులు ఋషేంద్ర, రామాంజినేయులు, శంకరయ్య, శివానంద కోరారు.
Comments
Please login to add a commentAdd a comment