ఇంటి వద్ద అనా«థలా వదిలేసిన వృద్ధుడి శవం (ఇన్‌సెట్‌లో) అంకిరెడ్డి మృతదేహం
అమ్మ..కనిపెంచి లాలించి, పాలిస్తే..నాన్న నడక, నడత నేర్పుతాడు. కొడుకు బుడిబుడి నడకలు వేసేటప్పుడు తప్పటడుగులు వేస్తాడేమోనని.. నీడలా తోడుగా వెన్నంటే ఉంటాడు. ఎదుగుదలకు ఊతమవుతాడు.. సంపాదనంతా కొడుకులకే అనుకుంటాడు. కోరింది తెచ్చి తినిపిస్తాడు. పస్తులుండి పైసా పైసా కూడబెట్టిందల్లాకొడుక్కే ఇస్తాడు. కొడుకులు చల్లగ ఉంటే అదే చాలనుకుంటాడు. కొడుకు కోసం ఇన్ని చేసిన నాన్న.. వెంట ఏమీ తీసుకుపోడు. హైటెక్ కాలంలో ‘తండ్రి’ని తండ్రిలా కాకుండా కొడుకులా చూసుకునే కొడుకులు ఎందరున్నారు.. అవసాన దశలోనూ కాళ్లు కదలకపోయినా చేతులు ఆడకపోయినా.. అవసరాలు తీర్చమని నోరు తెరిచి అడగడు.
ఇన్ని చేసిన నాన్నకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. నాన్నపై ప్రేమంతా హైటెక్ మాయ. ఆస్తిపాస్తుల కోసం వ్యామోహం తప్ప..నాన్నపై మోహం ఎక్కడిది? కాలం చెల్లినంక గుమ్మం ముంగిట శవం ఉంచి ఆస్తి కోసం ఆలోచించే కొడుకులూ ఉన్నారని ఈసడించుకుంటున్నా..దహన సంస్కారాలు చేయడానికి బేరసారాలు ఆడుతూ ‘సంస్కారం’లేని వాడనిపించుకుంటున్న కొడుకులే అధికం. బతికినంత కాలం నాన్న దగ్గర ఆస్తి ఉందని.. ఊపిరిపోయిన వెంటనే నాన్నకంటే ఆస్తే మిన్న అని శవాన్ని ముంగిట ఉంచి, దహన సంస్కారాలు చేయకుండా కొడుకు పారిపోయిన ఘటన ధర్మవరంలోని శాంతినగర్‌లో చోటు చేసుకుంది.
అనంతపురం, ధర్మవరం అర్బన్ : ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో నివసిస్తున్న యర్రజిన్నె అంకిరెడ్డి(86)కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట్రామిరెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. రెండో కుమారుడు గోవిందరెడ్డి. శాంతినగర్‌లో అంకిరెడ్డికి రెండు ఇళ్లు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం అనారోగ్యంతో అంకిరెడ్డి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు వెంకట్రామిరెడ్డి భార్య ప్రమీల, మనవళ్లు అజయ్‌కుమార్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌రెడ్డిలు కడసారి చూపు చూసేందుకు వచ్చారు. దీంతో కులస్తులు ఉన్న రెండు ఇళ్లను అన్నదమ్ములు ఇద్దరూ ఒక్కో ఇంటిని పంచుకోవాలని సలహా ఇచ్చారు. పెద్ద కుమారుడు వెంకట్రామిరెడ్డి మూడేళ్ల క్రితమే మృతిచెందడంతో మనవళ్లకు ఒక ఇల్లు ఇవ్వాలని పెద్దలు సూచించారు.
దీంతో ఆగ్రహానికి గురైన రెండో కుమారుడు గోవిందరెడ్డి ‘నాకు రెండేళ్ల క్రితమే రెండు ఇళ్లనూ మా నాన్న రాయించాడు. ఇప్పుడు ఇంటిని ఇవ్వాలని చెబితే నేను నివ్వను’ అంటూ సమాధానం చెప్పాడు. కులస్తులు అందరూ రెండు ఇళ్లలో ఒక ఇంటిని పెద్ద కుమారుడి పిల్లలకు ఇవ్వాలని చెప్పడంతో శుక్రవారం తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు ఫోన్ చేసి దహనసంస్కారాలు చేసేందుకు రావాలని కోరగా.. ‘నేను అక్కడికి వస్తే నాతో ఆస్తిని రాయించుకుంటారు. నేను రాను. శవాన్ని పూడ్చుకుంటారో.. పారేసుకుంటారో.. లేక మున్సిపాలిటీ వారికి అప్పగిస్తారో మీ ఇష్టం. ఏమైనా చేసుకోండి’ అంటూ సమాధానం చెప్పి పెట్టేశాడు. మనవళ్లు అజయ్‌కుమార్‌రెడ్డి, ఆనంద్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రాత్రి వరకు చూసి తాత శవానికి దహన సంస్కారాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment