
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ భారత్‌లో క్రికెట్ దేవుడు. అంతేకాదు అతను మనసున్న మారాజు అని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. తాజాగా మళ్లీ ‘మాస్టర్’ తన పెద్ద మనసు చాటుకున్నాడు. మహిళా క్షురకులతో షేవింగ్ చేయించుకొని వారి ఆర్థిక అవసరాల కోసం స్కాలర్‌షిప్ అందజేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని బన్వారితొల గ్రామానికి చెందిన నేహా, జ్యోతి క్షురకులు. తండ్రి అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ పోషణార్థం ఆయన వృత్తిని ఈ యువతులిద్దరు చేపట్టారు. భారత్‌లాంటి సంప్రదాయ దేశంలో కట్టుబాట్ల కంచెను దాటుకొని మహిళలు క్షౌరం చేయడం మామూలు విషయం కాదు.
దీంతో బయటివారే కాదు సొంత బంధువుల నుంచే ఛీత్కారాలు ఎదురవుతుంటాయి. అలాంటి గేళి, ఎగతాళి చేసే దేశంలో జన్మనిచ్చిన తండ్రి కోసం నేహా, జ్యోతి 2014 నుంచి క్షురక వృత్తి చేపట్టారు. ఈ వార్తను తెలుసుకున్న సచిన్ వాళ్లిద్దరితో షేవింగ్ చేయించుకొని ‘జిల్లెట్’ సంస్థ ద్వారా స్కాలర్‌షిప్ ఇప్పించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను క్రికెట్ దిగ్గజం తన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్స్‌లో పోస్ట్ చేశాడు. బయట షేవ్ చేసుకోవడం తనకిదే తొలిసారి అని చెప్పిన మాస్టర్, ఆ అవకాశం నేహా, జ్యోతిలకు దక్కిందని పోస్ట్ చేశాడు.