టీటీడీలో ‘బ్లేడ్’బాబ్జీ | Tenders for the supply of blades | Sakshi
Sakshi News home page

టీటీడీలో ‘బ్లేడ్’బాబ్జీ

Published Mon, Jul 28 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:58 AM

Tenders for the supply of blades

  •      బ్లేడ్ల సరఫరా టెండర్లను ఎప్పటికప్పుడురద్దు చేస్తున్న ఉన్నతాధికారి!
  •      అస్మదీయునికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా     నామినేషన్ పద్ధతిలో అప్పగింత
  •      టీటీడీలో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్‌కు పని కట్టబెట్టడం ఇదే తొలిసారి
  •      నాసిరకం బ్లేడ్‌లను సరఫరా చేస్తుండడంతో ఇబ్బంది పడుతున్న క్షురకులు, భక్తులు
  • అయిన వారికి ఆకుల్లో చదివించడం అంటే ఇదే..! టీటీడీ లో ఏ వస్తువునైనా టెండర్ విధానంలోనే కొనుగోలు చేయ డం రివాజు. ఇలా అయితే అస్మదీయునికి లబ్ధి చేకూర్చలేమని గ్రహించిన ఓ ఉన్నతాధికారి.. ఏకంగా నాలుగు సార్లు టెండర్లు రద్దుచేశారు. చివరకు నామినేషన్ పద్ధతిలో అస్మదీయునికి పనిని కట్టబెట్టారు. ఇంతకూ ఆ పని ఏంటంటే.. కల్యాణకట్టకు అవసరమైన బ్లేడ్‌లను సరఫరా చేయడం. ఆ పనులను దొడ్డిదారిన దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకం బ్లేడ్‌లను సరఫరా చేస్తుండడంతో అటు క్షురకులు.. ఇటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది టీటీడీలో హాట్‌టాపిక్‌గా మారింది.        
     
    సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల కల్యాణకట్టల్లో రోజుకు సగటున 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నట్టు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. భక్తుల తలనీలాలు విక్రయించడం వల్ల ఏటా టీటీడీకి రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతోంది. భక్తుల తలానీలాలు తీయడానికి ఏడాదికి 70 లక్షల డబుల్ ఎడ్జ్‌డ్ బ్లేడ్‌లు అవసరం. ఆ బ్లేడ్‌లను ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్ విధానంలో కొనుగోలు చేస్తారు.
     
    నిబంధనలు తుంగలోకి..

    బ్లేడ్‌ల కొనుగోలుకు సెప్టెంబర్ 18, 2013న మొదటి సారి టెండర్ పిలిచారు. బ్లేడ్‌ల తయారీదారులు మాత్రమే టెండర్‌లో పాల్గొనడానికి అర్హులని ఓ నిబంధన పెట్టారు. క్రోమియం 12.81 శాతం, 0.1 శాతం మందం, ఎలాంటి మచ్చలు, క్రాక్స్ లేకుండా ఉండే బ్లేడ్‌లను మాత్రమే సరఫరా చేయాలని షరతు పెట్టారు. ప్రసిద్ధిగాంచిన ఓ రెండు సంస్థలతోపాటు మరో సంస్థ డిస్ట్రిబ్యూటర్(తిరుపతి) టెండర్ షెడ్యూళ్లను దాఖలు చేశారు. ఆ డిస్ట్రిబ్యూటర్ టీటీడీ ఉన్నతాధికారికి సన్నిహితుడు. నిబంధన మేరకు అధికారులు డిస్ట్రిబ్యూటర్‌పై వేటు వేయడంతో ఉన్నతాధికారి ఆగ్రహించారు. టెండర్‌లో పేర్కొన్న నిబంధనల మేరకు ఓ ప్రసిద్ధిగాంచిన సంస్థ బహిరంగ మార్కెట్లో రూ.6 కు లభించే బ్లేడ్‌ను రూ.రెండుకు సరఫరా చేయడానికి అంగీకరించింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థకే టెండర్ ఖరారు చేయాలి. కానీ.. ఉన్నతాధికారి టెండర్‌ను రద్దు చేశారు.
         
    బ్లేడ్‌ల సరఫరాకు ఫిబ్రవరి 14న రెండోసారి టెండర్ పిలిచారు. ఏ ఒక్క సంస్థ షెడ్యూలు దాఖలు చేయకపోవడంతో టెండర్‌ను రద్దు చేశారు.
         
    మార్చి 7న ముచ్చటగా మూడోసారి టెండర్ పిలిచారు. తొలిసారి రూ.రెండుకే బ్లేడ్‌ను సరఫరా చేయడానికి ముందుకొచ్చిన ఒక సంస్థ మాత్రమే సింగిల్ షెడ్యూలు దాఖలు చేసింది. దాంతో.. టెండర్‌ను మూడోసారి రద్దు చేశారు.
         
    అస్మదీయుడికి టెండర్‌ను కట్టబెట్టాలనే లక్ష్యంతో సరికొత్త నిబంధనలు రూపొందించి నాలుగోసారి ఏప్రిల్ 9న టెండర్ పిలిచారు. ఈ టెండర్‌లో అస్మదీయుడుతోపాటు మరో రెండు సంస్థలు షెడ్యూళ్లను దాఖలు చేశాయి. అస్మదీయుడు సరఫరా చేసే బ్లేడ్‌లు నాణ్యంగా లేవని ల్యాబ్‌లో తేలడంతో ఉన్నతాధికారి మళ్లీ టెండర్‌ను రద్దు చేశారు.
     
    కుంటి సాకు చూపి..

    ఈలోగా కల్యాణకట్టలో బ్లేడ్‌ల కొరత ఏర్పడింది. ఇదే సాకుగా చూపి తొలుత ఐదు లక్షల బ్లేడ్‌లను సరఫరా చేసే పనిని అస్మదీయునికి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. ఓ సంస్థ ఉత్పత్తి చేసే బ్లేడ్‌లను ఒక్కోదానిని రూ.1.22కు సరఫరా చేసేలా టీటీడీతో అస్మదీయుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రకం బ్లేడ్ బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్ దుకాణాల్లో 75 పైసలకే దొరుకుతోంది. ఉన్నతాధికారి సన్నిహితుడు కళ్యాణకట్టకు నాసిరకం బ్లేడ్‌లను సరఫరా చేస్తున్నారు. ఆ బ్లేడ్‌లతో తల నీలాలు తీసేందుకు క్షురకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలనీలాలు తీసేటపుడు గాట్లు పడి.. రక్తం వస్తుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అత్యవసరమైన సాకు చూపి మరో 65 లక్షల బ్లేడ్‌లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడానికి ఆ ఉన్నతాధికారి సిద్ధమయ్యారు. ఆ ఉన్నతాధికారి నిర్ణయం వల్ల టీటీడీ ఖజానాకు రూ.35 లక్షల మేర కన్నం పడుతుంది. ఇదే సాకు చూపి అన్నదానంలో వినియోగించే వస్తువులను కూడా నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడానికి ఉన్నతాధికారి కసరత్తు చేస్తోండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement