- టికెట్‌తో పాటు అదనపు వసూళ్లు చేస్తున్న క్షురకులు
- అప్పన్న భక్తుల నిరసన
- పట్టించుకోని దేవస్థానం అధికారులు
సింహాచలం : మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి క్షురకులు అదనంగా సొమ్ము డిమాండ్ చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామికి తలనీలాలు సమర్పించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సింహగిరికి తరలి వస్తుంటారు. వీరంతా దేవస్థానం విక్రయించే రూ.10 టికెట్ కొంటారు.
ఈ సొమ్ములో రూ.5 ఆలయానికి, మరో రూ.5 కాంట్రాక్టు క్షురకులకు వెళ్తుంది.కేశఖండనశాలలో దేవస్థానానికి చెందిన శాశ్వత ఉద్యోగులు ఏడుగురు మినహాయిస్తే 63 మంది వరకు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో కొంతమంది క్షురకులు తలనీలాలు తీసిన తర్వాత నగదు డిమాండ్ చేస్తుండటంపై భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
తమశక్తిననుసరించి భక్తులు ఐదో, పదో అదనంగా బహుమతిగా చేతిలో పెడితే క్షురకులు తీసుకోకుండా రూ. 20కి తక్కువ కాకుండా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో భక్తులు అవాక్కవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందయినా వారడిగింది ఇవ్వవలసి వస్తోంది.
ఈ సంఘటనలపై దేవస్థానం అధికారులకు గతంలో పలువురు భక్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వచ్చేనెల 1 నుంచి తలనీలాల టికెట్ 15 రూపాయలకు దేవస్థానం పెంచింది. ఈ మొత్తంలో రూ. 10 క్షురకులకు, రూ. 5 దేవస్థానానికి వచ్చేలా నిర్దేశించింది. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాతైనా క్షురకులు తమ నుంచి నగదు డిమాండ్ చేసే పద్ధతి విడనాడాలని పలువురు భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.