sinhacalam
-
భక్తులకు క్షవరమే..
టికెట్‌తో పాటు అదనపు వసూళ్లు చేస్తున్న క్షురకులు అప్పన్న భక్తుల నిరసన పట్టించుకోని దేవస్థానం అధికారులు సింహాచలం : మొక్కు తీర్చుకునేందుకు వచ్చిన భక్తుల నుంచి క్షురకులు అదనంగా సొమ్ము డిమాండ్ చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామికి తలనీలాలు సమర్పించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సింహగిరికి తరలి వస్తుంటారు. వీరంతా దేవస్థానం విక్రయించే రూ.10 టికెట్ కొంటారు. ఈ సొమ్ములో రూ.5 ఆలయానికి, మరో రూ.5 కాంట్రాక్టు క్షురకులకు వెళ్తుంది.కేశఖండనశాలలో దేవస్థానానికి చెందిన శాశ్వత ఉద్యోగులు ఏడుగురు మినహాయిస్తే 63 మంది వరకు కాంట్రాక్టు పద్ధతిపై విధులు నిర్వహిస్తుంటారు. వీరిలో కొంతమంది క్షురకులు తలనీలాలు తీసిన తర్వాత నగదు డిమాండ్ చేస్తుండటంపై భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమశక్తిననుసరించి భక్తులు ఐదో, పదో అదనంగా బహుమతిగా చేతిలో పెడితే క్షురకులు తీసుకోకుండా రూ. 20కి తక్కువ కాకుండా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో భక్తులు అవాక్కవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందయినా వారడిగింది ఇవ్వవలసి వస్తోంది. ఈ సంఘటనలపై దేవస్థానం అధికారులకు గతంలో పలువురు భక్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. వచ్చేనెల 1 నుంచి తలనీలాల టికెట్ 15 రూపాయలకు దేవస్థానం పెంచింది. ఈ మొత్తంలో రూ. 10 క్షురకులకు, రూ. 5 దేవస్థానానికి వచ్చేలా నిర్దేశించింది. ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాతైనా క్షురకులు తమ నుంచి నగదు డిమాండ్ చేసే పద్ధతి విడనాడాలని పలువురు భక్తులు అంటున్నారు. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
నిజరూపం.. అపురూపం
అప్పన్న చందనోత్సవానికి పోటెత్తిన భక్తులు స్వామిని దర్శించి పులకించిన భక్తజనం పకడ్బందీగా ఏర్పాట్లు ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి పట్టు వస్త్రాల సమర్పణ సింహాచలం, న్యూస్‌లైన్ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఏడాదికి ఒక్క రోజు మా త్రమే లభించే ఈ అరుదైన దర్శనాన్ని చేసుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. వైశాఖ శుద్ద తదియని పురస్కరించుకుని అప్పన్న చందనోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి గురువారం అర్ధరాత్రి 12.30 నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, కలశారాధన చేశారు. ఒంటి గంట సమయంలో స్వామిపై ఉన్న చందనాన్ని వెండి బొరుగులతో తొలగించి నిజ రూపభరితున్ని చేశారు. తెల్లవారుజామున 2.45 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు కుటుంబ సమేతంగా తొలిదర్శనాన్ని చేసుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 3.15 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి 8.30 నుంచి సహస్ర ఘటాభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. శ్రీ వైష్ణవస్వాములు గంగధార నుం చి వెయ్యి కలశాలతో జలాలను తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకించారు. 108 వెండి కలశాలతో అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు శీతలోపచారాలు చేశారు. అనంతరం స్వామికి తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించి నిత్య రూపభరితున్ని చేశారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ రాష్ర్ట ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశ్వరరావు, టీటీడీ తరపున డాలర్ శేషాద్రి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాదాయశాఖ కమిషనర్ ముక్తేశ్వరరావు కూడా స్వామికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శించుకున్నారు. విశాఖ శారదా పీఠం స్వామిజీ స్వరూపనందేంద్ర సరస్వతి, రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తులు సూరి అప్పారావు, నూతి రామ్మోహనరావు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి, కలెక్టర్ ఆరోఖ్యరాజ్, పోలీస్ కమిషనర్ శివధర్‌రెడ్డి, మాజీ మంత్రులు రెడ్డి సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తిప్పల గురుమూర్తిరెడ్డి, గాజువాక అసెంబ్లీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి తదితరులు స్వామిని దర్శించుకున్నారు. విస్తృత ఏర్పాట్లు తెల్లవారుజామున 3.15 నుంచే సాధారణ భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని అధికారులు కల్పించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది ఫ్రీ పాస్‌లు జారీ చేయలేదు. ప్రొటోకాల్ వీఐపీలు, వీఐపీలకు వెయ్యి రూపాయల టికెట్లు అందజేశారు. లక్షా 25 వేల లడ్డూలను ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. అడవివరం ఆరోగ్య కేద్రం ప్రధాన వైద్యాధికారి జగదీష్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఆర్టీసీ పలు ప్రత్యేక బస్సులను నడిపింది. దేవస్థానం 40 బస్సులను ఉచితంగా కొండపైకి నడిపింది. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు విశేషలం దించాయి. -
అప్పన్న కల్యాణోత్సవం నేడే
సాయంత్రం 4 గంటలకు కొట్నాలు ఉత్సవం రాత్రి 7 గంటల నుంచి ధ్వజారోహణం 8గంటల నుంచి ఎదురు సన్నాహం 9 గంటల నుంచి రథోత్సవం 10.30 నుంచి కల్యాణం విస్తృత ఏర్పాట్లు సింహాచలం, న్యూస్‌లైన్ : చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం సింహాచలేశుడి వార్షిక కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. సింహగిరిపై ఉన్న నృసింహ మండపంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు అర్చకులు, ముత్తైవులు పసుపు కొమ్ములను శాస్త్రోక్తంగా దంచి కొట్నాలు ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు ధ్వజస్తంభం వద్ద దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల నుంచి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకిలో, ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు పల్లకిలో ఉంచి మాడ వీధుల్లో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేసి తొలి దర్శనాన్ని వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజుకు కల్పిస్తారు. రాత్రి 9 గంటల నుంచి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 10.30 గంటల నుంచి నృసింహ మండపంలో ప్రత్యేక వేదికపై కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. విస్తృత ఏర్పాట్లు : రథోత్సవం, కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు విస్తృత ఏ ర్పాట్లు చేశారు. నృసింహ మండపంలో భారీ కల్యాణవేదికను ఏర్పాటు చేశా రు. సుమారు 20 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు నృసింహ మండపం నాలుగు గేట్లలో ముత్యాల తలంబ్రాలు ఇవ్వనున్నారు. -
అప్పు తీరే దారేది?
యలమంచిలికి చెందిన సింగవరపు సన్యాసిరావు రెండెకరాల రైతు. తనకున్న పొలంలో 2011లో వరి సాగు చేశాడు. కానీ అప్పట్లో వచ్చిన లైలా తుపానుతో కొట్టుకుపోయింది. చేసిన అప్పులు తీరకపోయినా గతేడాది మళ్లీ వేశాడు. దాదాపు రూ.24 వేలు మదుపు పెట్టారు. నీలం తుపాను తాకిడికి అదీ నీట మునిగింది. వ్యవసాయాన్ని వదులుకోలేక ఈ ఏడాది కూడా సాగు చేశాడు. కానీ తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా పడుతున్న వర్షం ముంచేసింది. మూడేళ్లుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఏటా సరాసరి రూ.25 వేలు నష్టపోతున్నాడు. చేసిన అప్పులు తీరక, ఫలసాయం రాక నిండా మునిగిపోయాడు. సాక్షి, విశాఖపట్నం: ఇది ఒక్క సన్యాసిరావుదే కాదు వేలాది మంది రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఆశలతో మదుపు పెడుతున్నారు. కరువు కోరలకో, వరద ఉధృతికో ఫలసాయాన్ని నష్టపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు. దీంతో మూడేళ్లుగా తీసుకున్న బ్యాంకు రుణాల్ని రీషెడ్యూల్ చేసుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పులకు వడ్డీలు పెంచుకుంటున్నారు. అప్పు తీర్చే దారి లేక నిలువునా మునిగిపోతున్నారు. 2010లో అటు కరువు, ఇటు జల్ తుపాను ధాటికి 76,837 మంది రైతులు పంట నష్టపోయారు. 2011లో కరువుతో పాటు లైలా తుపాను బీభత్సానికి 96,219మంది రైతులు దెబ్బతిన్నారు. గతేడాది ఏకంగా లక్షా ఆరు వేల మంది కరువు, నీలం తుపాను దెబ్బకు పంటల్ని కోల్పోయారు. ఏటా సరాసరి 20 మండలాలు కరువు బారిన పడితే, మిగతా గ్రామాలు వరద తాకిడి గురవుతున్నాయి. ఏటా నష్టాల పాలవుతున్నా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించడంతో వర్షాలు బాగా పడతాయన్న ఆశతో దొరికిన చోట అప్పులు చేశారు. కానీ ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో పలు మండలాల్లో కరువు ఏర్పడింది. దీంతో ఉన్న దాన్నైనా కాపాడుకోవాలని చూశారు. ఈలోపు పై-లీన్ తుపాను రావడంతో ఆందోళన చెందినా ప్రభావం చూపకుండానే వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. హమ్మాయ్యా! అనుకునే లోపు అల్పపీడనం ప్రభావంతో ఆరు రోజులగా ఎడతెరిపిలేకుండా వర్షాల ధాటికి వరదలొచ్చాయి. వరి, చెరకు తదితర పంటలన్నీ నీటమునిగాయి. మరోసారి రైతన్నను ముంచేశాయి. చేసిన అప్పులు పేరుకుపోతున్నాయి. రుణ బకాయిలు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. వడ్డీలు కట్టాలంటూ వడ్డీ వ్యాపారులు సతాయిస్తున్నారు. కాని తీర్చే దారి రైతులకు కన్పించడం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల మధ్య అన్నదాతలకు ఇళ్లు గడవడమే కాదు.. పిల్లల్ని చదివించుకోవడమూ కష్టమవుతోంది. ఏటా నష్టమే... ఏటా పంట పండే సమయంలో తుపాను వర్షాలు ముంచేయడంతో ఎంతో నష్టపోతున్నాను. కిందటేదాది నీలం తుపాను వల్ల పొలం మునిగిపోయి రూ.30 వేలు నష్టపోతే ఇప్పుడు వర్షాలకు పూర్తిగా నష్టపోయేలా ఉన్నాను. నాకున్న మూడెకరాల పొలంలో ఎకరాలో వరి , రెండెకరాల్లో చెరకు వేశాను. వరికి రూ.15వేలు, చెరకుకు ఎకరాకి రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. సరిగ్గా పంట పక్వానికి వచ్చేసరికి వానొచ్చి ముంచేసింది. చెరకు దిగుబడి తగ్గిపోతాది, వరి అయితే పొట్టదశలోనే కుళ్లిపోయింది. గత ఏడాది పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు రూ.30వేలు ఇంకా తీర్చలేదు. మరలా ఈ ఏడాది రూ.40వేలు అప్పు చేశాను. పంట నీటిపాలవ్వడంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చేలాలేదు. ఇప్పుడు ఈ అప్పులు ఎలా తీర్చాలో అర్థంకావడం లేదు. -జొన్న సింహాచలం, రైతు, రామజోగిపాలెం.