అప్పన్న కల్యాణోత్సవం నేడే
- సాయంత్రం 4 గంటలకు కొట్నాలు ఉత్సవం
- రాత్రి 7 గంటల నుంచి ధ్వజారోహణం
- 8గంటల నుంచి ఎదురు సన్నాహం
- 9 గంటల నుంచి రథోత్సవం
- 10.30 నుంచి కల్యాణం
- విస్తృత ఏర్పాట్లు
సింహాచలం, న్యూస్‌లైన్ : చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం సింహాచలేశుడి వార్షిక కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. సింహగిరిపై ఉన్న నృసింహ మండపంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు అర్చకులు, ముత్తైవులు పసుపు కొమ్ములను శాస్త్రోక్తంగా దంచి కొట్నాలు ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు ధ్వజస్తంభం వద్ద దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహిస్తారు.
రాత్రి 8 గంటల నుంచి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ముత్యాల పల్లకిలో, ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు పల్లకిలో ఉంచి మాడ వీధుల్లో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేసి తొలి దర్శనాన్ని వ్యవస్థాపక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజుకు కల్పిస్తారు. రాత్రి 9 గంటల నుంచి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 10.30 గంటల నుంచి నృసింహ మండపంలో ప్రత్యేక వేదికపై కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.
విస్తృత ఏర్పాట్లు : రథోత్సవం, కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు విస్తృత ఏ ర్పాట్లు చేశారు. నృసింహ మండపంలో భారీ కల్యాణవేదికను ఏర్పాటు చేశా రు. సుమారు 20 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు నృసింహ మండపం నాలుగు గేట్లలో ముత్యాల తలంబ్రాలు ఇవ్వనున్నారు.