యలమంచిలికి చెందిన సింగవరపు సన్యాసిరావు రెండెకరాల రైతు. తనకున్న పొలంలో 2011లో వరి సాగు చేశాడు. కానీ అప్పట్లో వచ్చిన లైలా తుపానుతో కొట్టుకుపోయింది. చేసిన అప్పులు తీరకపోయినా గతేడాది మళ్లీ వేశాడు. దాదాపు రూ.24 వేలు మదుపు పెట్టారు. నీలం తుపాను తాకిడికి అదీ నీట మునిగింది. వ్యవసాయాన్ని వదులుకోలేక ఈ ఏడాది కూడా సాగు చేశాడు. కానీ తాజాగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా పడుతున్న వర్షం ముంచేసింది. మూడేళ్లుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఏటా సరాసరి రూ.25 వేలు నష్టపోతున్నాడు. చేసిన అప్పులు తీరక, ఫలసాయం రాక నిండా మునిగిపోయాడు.
సాక్షి, విశాఖపట్నం: ఇది ఒక్క సన్యాసిరావుదే కాదు వేలాది మంది రైతులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఆశలతో మదుపు పెడుతున్నారు. కరువు కోరలకో, వరద ఉధృతికో ఫలసాయాన్ని నష్టపోతున్నారు. చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు. దీంతో మూడేళ్లుగా తీసుకున్న బ్యాంకు రుణాల్ని రీషెడ్యూల్ చేసుకుంటున్నారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పులకు వడ్డీలు పెంచుకుంటున్నారు. అప్పు తీర్చే దారి లేక నిలువునా మునిగిపోతున్నారు.
2010లో అటు కరువు, ఇటు జల్ తుపాను ధాటికి 76,837 మంది రైతులు పంట నష్టపోయారు. 2011లో కరువుతో పాటు లైలా తుపాను బీభత్సానికి 96,219మంది రైతులు దెబ్బతిన్నారు. గతేడాది ఏకంగా లక్షా ఆరు వేల మంది కరువు, నీలం తుపాను దెబ్బకు పంటల్ని కోల్పోయారు. ఏటా సరాసరి 20 మండలాలు కరువు బారిన పడితే, మిగతా గ్రామాలు వరద తాకిడి గురవుతున్నాయి. ఏటా నష్టాల పాలవుతున్నా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించడంతో వర్షాలు బాగా పడతాయన్న ఆశతో దొరికిన చోట అప్పులు చేశారు.
కానీ ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో పలు మండలాల్లో కరువు ఏర్పడింది. దీంతో ఉన్న దాన్నైనా కాపాడుకోవాలని చూశారు. ఈలోపు పై-లీన్ తుపాను రావడంతో ఆందోళన చెందినా ప్రభావం చూపకుండానే వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. హమ్మాయ్యా! అనుకునే లోపు అల్పపీడనం ప్రభావంతో ఆరు రోజులగా ఎడతెరిపిలేకుండా వర్షాల ధాటికి వరదలొచ్చాయి.
వరి, చెరకు తదితర పంటలన్నీ నీటమునిగాయి. మరోసారి రైతన్నను ముంచేశాయి. చేసిన అప్పులు పేరుకుపోతున్నాయి. రుణ బకాయిలు చెల్లించాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. వడ్డీలు కట్టాలంటూ వడ్డీ వ్యాపారులు సతాయిస్తున్నారు. కాని తీర్చే దారి రైతులకు కన్పించడం లేదు. ఇలాంటి దుర్భర పరిస్థితుల మధ్య అన్నదాతలకు ఇళ్లు గడవడమే కాదు.. పిల్లల్ని చదివించుకోవడమూ కష్టమవుతోంది.
ఏటా నష్టమే... ఏటా పంట పండే సమయంలో తుపాను వర్షాలు ముంచేయడంతో ఎంతో నష్టపోతున్నాను. కిందటేదాది నీలం తుపాను వల్ల పొలం మునిగిపోయి రూ.30 వేలు నష్టపోతే ఇప్పుడు వర్షాలకు పూర్తిగా నష్టపోయేలా ఉన్నాను. నాకున్న మూడెకరాల పొలంలో ఎకరాలో వరి , రెండెకరాల్లో చెరకు వేశాను. వరికి రూ.15వేలు, చెరకుకు ఎకరాకి రూ.30 వేలు పెట్టుబడి పెట్టాను. సరిగ్గా పంట పక్వానికి వచ్చేసరికి వానొచ్చి ముంచేసింది. చెరకు దిగుబడి తగ్గిపోతాది, వరి అయితే పొట్టదశలోనే కుళ్లిపోయింది. గత ఏడాది పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు రూ.30వేలు ఇంకా తీర్చలేదు. మరలా ఈ ఏడాది రూ.40వేలు అప్పు చేశాను. పంట నీటిపాలవ్వడంతో కనీసం పెట్టుబడి కూడా వచ్చేలాలేదు. ఇప్పుడు ఈ అప్పులు ఎలా తీర్చాలో అర్థంకావడం లేదు.
-జొన్న సింహాచలం, రైతు, రామజోగిపాలెం.
అప్పు తీరే దారేది?
Published Sun, Oct 27 2013 3:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement