విలేకరుల సమావేశంలో అశోక్, లింగం, రవీందర్ రాణా
సాక్షి, హైదరాబాద్ : నాయీ బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా నాయీ, సెయిన్, సవితా, విల్లంకితుల నాయర్, ఇసాయ్ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్‌ఐయూఎఫ్) డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రీయ సెయిన్ సమాజ్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్) జాతీయ అధ్యక్షుడు రవీందర్ రాణా మాట్లాడుతూ... చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. నాయీ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నెల రోజులు గడుస్తున్నా కనీసం క్షమాపణ చెప్పకపోవడం బాధాకరమన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని పేర్కొన్నారు.
కనీస వేతనాలు ఇవ్వాల్సిందే..
తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులు, వాయిద్య కళాకారులకు కనీస వేతనాలు ఇవ్వాలని నాయీ బ్రాహ్మణ మేధావులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆలయాల్లో సేవలు అందిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనుచ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐఎన్‌ఐయూఎఫ్ కన్వీనర్ దుగ్యాల అశోక్, తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్ చంద్ర, చైర్మన్ మద్దికుంట లింగం, ఎం నరసింహారావు, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు పాల్గొన్నారు.
నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులతో మంద కృష్ణమాదిగ
చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తా: కృష్ణ మాదిగ
నాయీ బ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతానని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ హామీయిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయనను నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు కలిశారు. ఏపీ సచివాలయంలో నాయీ బ్రాహ్మణులను బెదిరిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తానని ఈ సందర్భంగా కృష్ణమాదిగ అన్నారు. నాయీ బ్రాహ్మణులు తన మద్దతు ఉంటుందని, వారు ఎక్కడికి పిలిచినా వస్తానని హామీయిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment