Barbers
-
ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి
సాక్షి, హైదరాబాద్: క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బడా పారిశ్రామిక వేత్తలు, ఇతర కులాలు తమ వృత్తిలోకి ప్రవేశించి నాయీబ్రాహ్మణుల జీవనోపాధికి గండికొడుతున్నాయని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు యం. లింగం నాయీ ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్ సహా పలు బడా సంస్థలు మోడ్రన్ సెలూన్స్ పేరుతో తమ పొట్ట కొడుతున్నాయని.. ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మోడ్రన్ సెలూన్స్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనకు కేసీఆర్ అండగా నిలబడ్డారని.. ప్రత్యేక రాష్ట్రం రాగానే క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ జీవో ఇస్తానని మాటిచ్చినట్టు గుర్తు చేశారు. ఇతర కులవృత్తులను కాపాడటానికి జీవోలు ఇచ్చినట్టుగానే తమకు కూడా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థించారు. నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య ద్వారా క్షౌరవృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించాలని పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కాగా, రిలయన్స్ సెలూన్స్ వ్యాపారంలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణులు ఆందోళనలకు దిగుతున్నారు. -
గుళ్లలోని క్షురకులకు రూ.20 వేల కనీస ఆదాయం
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రధాన ఆలయాల్లోని కేశఖండనశాలల్లో క్షురకులుగా పనిచేసే వారికి ప్రతి నెలా కనీసం రూ.20 వేలు ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ధార్మిక పరిషత్ తొలి సమావేశం సోమవారం ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. అనంతరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రధాన ఆలయాల్లోని క్షురకులు ప్రస్తుతం టికెట్ల ఆధారంగా ప్రతి నెలా ఆదాయం పొందుతున్నారని చెప్పారు. వాళ్లకు నెలకు రూ.20 వేల కంటే తక్కువ ఆదాయం దక్కే సమయంలో.. ఆయా ఆలయాల్లోని వెల్ఫేర్ ట్రస్టు ద్వారా మిగిలిన మొత్తాన్ని ఇప్పించాలని సీఎం వైఎస్ జగన్ తమకు సూచించారని పేర్కొన్నారు. రూ.20 వేల కంటే ఎక్కువ ఆదాయం వస్తే.. వారికే ఆ మొత్తం చెందుతుందన్నారు. తక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఆ మొత్తాన్ని అదనంగా అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. సమావేశంలో హథీరాంజీ, బ్రహ్మంగారి మఠం,అహోబిలం, గాలి గోపురం, బ్రహ్మానంద మఠాలకు సంబంధించిన పాలనపరమైన అంశాలపైనా చర్చించినట్టు చెప్పారు. బెజవాడ దుర్గ గుడిలో అంతరాలయ దర్శన టికెట్ ధర ఎప్పటి నుంచో రూ.500గానే ఉందన్నారు. -
TS: ‘ఉచిత విద్యుత్’ లబ్ధిదారుల నమోదుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: సెలూన్లు, ధోబీఘాట్లకు సంబంధించి ఉచిత విద్యుత్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వీలుగా జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. లబ్ధిదారులు తమ దరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటీ శాఖ అధికారులను కోరా రు. పథకం అమలుపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు నివేదించారు. -
లాక్డౌన్ వేళ.. నాయీబ్రాహ్మణుల విలవిల
సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు విలవిలలాడుతున్నాయి. వేలాది మంది నాయీబ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. ఏ రోజుకు ఆ రోజు సెలూన్ తెరిస్తే తప్ప ఆదాయం లభించని నాయీబ్రాహ్మణుల ఉపాధిపైన లాక్డౌన్ దారుణంగా వేటు వేసింది. 90 శాతం మందికి ఇల్లు గడవడం కష్టంగా మారింది. సొంతంగా సెలూన్లు నిర్వహిస్తున్న వాళ్లకు వాటి అద్దెలు, ఇంటి కిరాయిలు, విద్యుత్ బిల్లులు తదితర ఖర్చులు మరింత భారంగా మారాయి. లాక్డౌన్ విధించి నెల రోజులైంది. దీంతో ఇప్పటికే ఎంతోమంది నాయీబ్రాహ్మణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ వృత్తిలో కొనసాగడం సాధ్యం కాబోదని నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సెలూన్లు, బ్యూటీపార్లర్లతో పాటు సన్నాయి వాయిద్యాలపైన కూడా లాక్డౌన్ వేటు పడింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, వేడుకల్లో సన్నాయి వాయించే వారు సైతం ఉపాధిని కోల్పోయారు. ఉన్నత చదువులు చదివినా... హెయిర్ కటింగ్, హెయిర్ రీ ట్రీట్మెంట్, ఫేషియల్, బ్రైడల్ మేకప్, మెనిక్యూర్, పెడిక్యూర్ వంటి సేవలతో బ్యూటీపార్లర్లు, హెయిర్‌కటింగ్ సెలూన్లు ఎప్పటికప్పుడు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత చదువులు చదివినప్పటికీ ఎలాంటి ఉద్యోగాలు లభించక చాలామంది సెలూన్లలో పని చేస్తున్నారు. నగరంలో చిన్నచిన్న ఇళ్లు అద్దెకు తీసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ‘లాక్డౌన్ కారణంగా ఇంటినుంచి బయటకు వెళ్లలేకపోతున్నాం. ఉన్న కొద్దిపాటి డబ్బులు కూడా అయిపోయాయి. షాపు తెరిస్తే తప్ప సరుకులు తెచ్చుకొనేందుకు అవకాశం లేదు’ అని బోడుప్పల్‌కు చెందిన సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 17,500కు పైగా కటింగ్ షాప్స్‌తో 50 వేల మందికి పైగా పనిచేస్తున్నారు. కనీసం 2 లక్షల మంది వీరిపైన ఆధారపడి ఉన్నారు. మరోవైపు తెలంగాణ అంతటా 10 లక్షల మంది కులవృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు. అప్పుల భారంతో కుదేల్... మరోవైపు చాలామంది నాయీబ్రాహ్మణులు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి రూ.లక్షల్లో రుణాలు తీసుకొని షాపులు ఏర్పాటు చేసుకున్నారు. డెయిలీ ఫైనాన్స్పైన ఆధారపడి షాపులు నడుపుతున్న వాళ్లు ఉన్నారు. లాక్డౌన్ కారణంగా షాçపులు మూసివేయడంతో రుణాలు భారంగా మారాయని, వడ్డీలు పెరిగాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ‘అప్పుల భారం వల్ల షాపులను శాశ్వతంగా మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది’ అని సికింద్రాబాద్‌కు చెందిన వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మూగవోయిన ‘సన్నాయి’ లాక్డౌన్ కారణంగా దేవాలయాలు మూత పడ్డాయి. పలుచోట్ల కల్యాణకట్టలో పనిచేస్తున్న 1500 మంది నాయీ బ్రాహ్మణులకు పనులు లేవు. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేయడం వల్ల సన్నాయి వాయిద్య కళాకారులకు పని లేకుండా పోయింది. ఈ వృత్తిపైన ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి లాక్డౌన్ కారణంగా 90 శాతానికి పైగా నాయీబ్రాహ్మణులు ఉపాధిని కోల్పోయారు. షాపులు, ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లులు, వీటికి తోడు రుణాలు, వాటిపైన వడ్డీలు తీవ్ర భారంగా మారాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. అత్యవసర పరిస్థితుల కింద రాష్ట్ర ప్రభుత్వం హెయిర్ కట్టింగ్ షాపులు ఉన్న ప్రతి ఒక్కరికీ, వాయిద్య కళాకారులకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలి. – రాచమల్ల బాలకృష్ణ, అధ్యక్షుడు, తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవాసంఘం ఆర్థిక సాయం చేయాలి సెలూన్లు, బ్యూటీపార్లర్లకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి. పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయాలి. అలాగే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాస్క్‌లు, గ్లౌస్లు, ప్రత్యేక కిట్లు అందజేసి ఈ వృతిని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటే మంచిది. – మామిడాల శ్రీనివాస్, వోగ్ బ్యూటీపార్లర్, ఆర్టీసీ కాలనీ సన్నాయి వాయిద్యాన్ని కాపాడండి బ్యాండుమేళాలు, డీజేల్లాంటివి ఎన్ని ఉన్నప్పటికీ పెళ్లిళ్లు, శుభకార్యాల్లో సన్నాయి తప్పనిసరి. అలాంటి శుభప్రదమైన వాద్యం ఇప్పుడు మూగవోయింది. ప్రభుత్వం స్పందించాలి. – నర్సింహులు -
నాయీ బ్రహ్మణులకు అండగా ఉంటాం: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, కృష్ణా : దేవాలయాల్లోని నాయీ బ్రాహ్మణుల సమస్యలపై విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయీ బ్రహ్మణులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. అందుకే ఈ ఎన్నికల్లో నాయీ బ్రహ్మణులు చంద్రబాబును ఓడించారన్నారు. కాగా మన ప్రభుత్వం నాయీ బ్రహ్మణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కోన్నారు. త్వరలోనే వారి సమస్యలపై చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
కులవృత్తికి భరోసా..!
సాక్షి, వరదయ్యపాళెం: నాయీ బ్రాహ్మణులు కులవృత్తిని వదులుకోలేక.. ఇతర ఉపాధి పనులు దొరకక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఆదాయం లేక.. సాంకేతికతతో పోటీ పడలేక అష్టకష్టాలు పడుతున్నారు. అరకొరగా వచ్చే ఆదాయంతో అద్దెలు చెల్లించలేకపోతున్నారు. ఆధునిక సాంకేతికతతో సెలూన్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికస్థోమత సరిపోక అవస్థలు పడుతున్నారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్‌లో నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రకటించిన హామీలు ఆ వర్గాల్లో భరోసా కల్పించాయి. జగనన్నకు రుణపడి ఉంటాం.. జగనన్న మా గురించి ఆలోచించి హామీలు ప్రకటించడం ఆనందంగా ఉంది. బార్బర్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆపైన కూడా కమర్షియల్ చార్జీలు కాకుండా డొమస్టిక్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తామని హామీ ఇవ్వడం క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. -అశోక్, బార్బర్ షాపు, వరదయ్యపాళెం హామీలు చారిత్రాత్మకం.. నాయీ బ్రాహ్మణుల కష్టాలను గుర్తించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉచిత విద్యుత్, కార్పొరేషన్ ఏర్పాటు హామీలు ప్రకటించడం హర్షణీయం. ఇంతవరకు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక మా సంక్షేమాన్ని విస్మరించారు. కానీ వైఎస్ జగన్ మా సంక్షేమం కోసం ప్రకటించిన హామీలు చారిత్రాత్మకం. – చిన్నా, బార్బర్ షాపు, వరదయ్యపాళెం -
ఒకరికి వాడిన రేజర్‌నే మరో రోగికి వాడుతున్నారు
గుంటూరు మెడికల్: రోగంతో బాధపడుతూ రాజధాని ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్న పేద రోగులకు ఆస్పత్రి అధికారులు, సిబ్బంది చేస్తున్న నిర్వాకంతో కొత్త రోగాలు వచ్చే ప్రమాదం మెండుగా ఉంది. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో హెచ్ఐవీ, హెపటైటిస్ లాంటి వైరస్లు సోకే ప్రమాదం ఉన్నా నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండి పోవడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఆపరేషన్ చేయాల్సిన రోగులకు ఆ పరేషన్ ముందు తప్పనిసరిగా వెంట్రుకలను క్షురకులు తొలగిస్తారు. తల లేదా ఇతర శరీర భాగాలకు తీవ్రమైన గాయాలై కుట్టు వేయాల్సిన సమయాల్లో సైతం వెంట్రుకలను తొలగించిన పిదప మాత్రమే కుట్లు వేస్తారు. అయితే బార్బర్లకు బ్లేడ్లు, రేజర్లు కొనుగోలు చేసి ఇవ్వాల్సిన అధికారులు ఆ విషయం పట్టించుకోవడం లేదు. క్షురకులు తమకు నెలకు వస్తున్న ఆరువేల జీతంలోనే కొంత మొత్తం బ్లేడ్లు, రేజర్ల కొనుగోలుకు వినియోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు. రోగులు కొనుగోలు చేయని పక్షంలో ఒకరికి వినియోగించిన రేజర్‌తోనే మరో రోగికి వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఒకరి నుంచి మరొకరికి రోగాలు వ్యాప్తి చెందుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ కొత్త రేజర్ కొనుగోలు చేయలేకపోతున్నామని అందువల్లే బ్లేడ్‌ను మార్చి అదే రేజర్‌తో షేవింగ్ చేస్తున్నట్టు క్షురకులు వెల్లడించారు. చాలీచాలని వేతనాలు... జీజీహెచ్‌లో ప్రస్తుతం రెండు క్షురకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2010లో ఒకరు పదవీ విరమణ చేయగా, 2015లో మరో వ్యక్తి చనిపోవటంతో రెండు రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. అవుట్‌సోర్సింగ్‌లో 2010 నుంచి ఒకరు, 2015 నుంచి ఇద్దరు చొప్పున, ప్రస్తుతం ముగ్గురు క్షురకులు మూడు పూటలా విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఒక్కరే క్షురకుడు ఉండటంతో పలుమార్లు రాత్రి వేళల్లో క్షురకులు లేక నాల్గోతరగతి వైద్య సిబ్బంది షేవింగ్ చేసేందుకు అవస్థలు పడేవారు. అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న క్షురకులకు ఒక్కొక్కరికి నెలకు ఆరువేల వేతనం ఇస్తున్నారని, ఆరువేలతో తమ కుటుంబం గడవడం లేదని వాపోతున్నారు. క్షురకులు వేచి ఉండేందుకు ఎలాంటి గదులు లేకపోవటంతో రాత్రి వేళ విధులకు చాలా ఇబ్బందిగా ఉంటున్నట్లు తెలిపారు. బ్లేడ్లు, రేజర్లు కొత్తవి కొనుగోలు చేసి ఇవ్వటంతో పాటుగా తమకు వేతనాలు పెంచేలా ఉన్నతాధికారులు చూడాలని వారు కోరుతున్నారు. నా దృష్టికి రాలేదు బ్లేడ్లు, రేజర్ల సమస్య ఉన్నట్టు నా దృష్టికి ఇప్పటివరకు రాలేదు. క్షురకులు, రోగులు వాటిని కొనుగోలు చేసే పనిలేకుండా ఆస్పత్రి నుంచి కొనుగోలు చేసి అందజేసి ఇన్ఫెక్షన్లు సోకకుండా చర్యలు తీసుకుంటాం. క్షురకుల పోస్టులతో పాటుగా నాల్గోతరగతి పోస్టులను ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా త్వరలోనే రిక్రూట్ చేయనుంది. వారు కనీస వేతనాలు ఇవ్వటంతో పాటుగా ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో అర్హత ఉన్నవారిని రిక్రూట్ చేసుకుంటారు.–డాక్టర్ రాజునాయుడు,జీజీహెచ్ సూపరింటెండెంట్ -
రోడ్డెక్కిన నాయీబ్రాహ్మణులు
చీమకుర్తి రూరల్(ప్రకాశం): సన్నాయి, డోలు వాయిద్యాలతో తమ సమస్యలను పరిష్కరించాలంటూ నాయీబ్రాహ్మణులు మంగళవారం సంతనూతలపాడు పట్టణంలో రోడ్డెక్కారు. జిల్లా అధ్యక్షుడు మిరియాల రాఘవ ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి గుడిదగ్గర నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా వాయిద్య కళాకారులందరూ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మిరియాల రాఘవ మాట్లాడుతూ హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో తల నీలాలపై వచ్చే ఆదాయంలో సగభాగం నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి ఖర్చుపెట్టాలని, కేశఖండనలో పనిచేసే క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నాయీ బ్రాహ్మణులపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నాయీబ్రాహ్మణులకు కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా తమ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరంటే ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం తమ దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నియోజకవర్గం నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు కరేటి నరసింహరావు, బూసరపల్లి శ్రీనివాసరావు, గుంటూరు ఆంజనేయులు, గోనుగుంట నరేష్, మద్దులూరి ప్రసాద్, ఏడుకొండలు పాల్గొన్నారు. -
చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వం
సాక్షి, హైదరాబాద్ : నాయీ బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా నాయీ, సెయిన్, సవితా, విల్లంకితుల నాయర్, ఇసాయ్ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్‌ఐయూఎఫ్) డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రీయ సెయిన్ సమాజ్ సంఘ్(ఆర్ఎస్ఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు రవీందర్ రాణా మాట్లాడుతూ... చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. నాయీ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నెల రోజులు గడుస్తున్నా కనీసం క్షమాపణ చెప్పకపోవడం బాధాకరమన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. కనీస వేతనాలు ఇవ్వాల్సిందే.. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులు, వాయిద్య కళాకారులకు కనీస వేతనాలు ఇవ్వాలని నాయీ బ్రాహ్మణ మేధావులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆలయాల్లో సేవలు అందిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనుచ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐఎన్‌ఐయూఎఫ్ కన్వీనర్ దుగ్యాల అశోక్, తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్ చంద్ర, చైర్మన్ మద్దికుంట లింగం, ఎం నరసింహారావు, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులతో మంద కృష్ణమాదిగ చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తా: కృష్ణ మాదిగ నాయీ బ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతానని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ హామీయిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయనను నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు కలిశారు. ఏపీ సచివాలయంలో నాయీ బ్రాహ్మణులను బెదిరిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తానని ఈ సందర్భంగా కృష్ణమాదిగ అన్నారు. నాయీ బ్రాహ్మణులు తన మద్దతు ఉంటుందని, వారు ఎక్కడికి పిలిచినా వస్తానని హామీయిచ్చారు. ఇది కూడా చదవండి : నడిరోడ్డుపై చంద్రబాబు గూండాగిరి -
భక్తులపై క్షురకత్తి!
పశ్చిమ గోదావరి, ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో పనిచేసే క్షురకులకు టిక్కెట్టుపై రూ.25 ఆయా దేవస్థానాలు చెల్లించాలంటూ ప్రభుత్వం బుధవారం ఒక మెమో జారీ చేసింది. దీంతో కొన్ని దేవాలయాల్లో పనిచేసే క్షురకులు లాభ పడుతుండగా, మరికొన్ని దేవాలయాల్లో పనిచేసే వారికి నష్టమే మిగలనుంది. దీంతో క్షురకుల్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వీరికి దేవస్థానం ఒక్కో టిక్కెట్టుపై చెల్లించనున్న రూ. 25 పారితోషికాన్ని క్షేత్రాలకు వచ్చే భక్తుల నుంచే వసూలు చేయాలనేది మోమో సారాంశం. దీంతో భక్తులపై అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పెద్ద తిరుపతి తరువాత చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమలలో ఎక్కువగా భక్తులు తలనీలాలను సమర్పిస్తుంటారు. కాబట్టి ఈ క్షేత్రంపైనే అధికంగా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ద్వారకాతిరుమలలో తలనీలాలు సమర్పించుకునే టికెట్టు విలువ రూ.15 కాగా, ఇందులో రూ.10ని దేవస్థానం క్షురకులకు ఇస్తోంది. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టికెట్టు ధరను రూ. 25కు పెంచి, ఆ మొత్తాన్ని క్షురకులకు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉంటే గతేడాది ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో 11.28 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఈ టికెట్ల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ. 1,69,20,000 రాగా, ఇందులో క్షురకులకు రూ. 1,12,80,000లను చెల్లించారు. మిగిలిన రూ. 56,40,000ల ఆదాయం దేవస్థానానికి సమకూరింది. అయితే రేపోమాపో పెరగనున్న రూ.25 టికెట్ ధరను క్షురకులకే పూర్తిగా ఇవ్వడం వల్ల ఇకపై టికెట్ ఆదాయాన్ని దేవస్థానం కోల్పోనుంది. అయోమయంలో క్షురక సంఘ నేతలు దేవాలయాల్లో పనిచేసే క్షురకులు జేఏసీగా ఏర్పడి, తమకు నెలకు రూ.15 వేలు జీతం ఇవ్వడంతో పాటు, ఉద్యోగులకు అందే అన్ని సౌకర్యాలూ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కత్తి డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు వీరికి టికెట్‌పై రూ. 25 చెల్లించాలని దేవాలయాలను ఆదేశించారు. అయితే దీనివల్ల భక్తులు అధికంగా మొక్కులు చెల్లించే ద్వారకాతిరుమల, విజయవాడ ఆలయాల్లో పనిచేసే క్షురకులే ఎక్కువగా లబ్ధిపొందనున్నారు. ఆ తరువాత సింహాచలం, శ్రీశైలం ఆలయాల్లో పనిచేసే క్షురకులు మధ్యస్థంగా లబ్దిపొందుతారు. ఇక అన్నవరం, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేసే క్షురకులు మాత్రం తీవ్రంగా నష్టపోనున్నారు. ఈ కారణంగా జేఏసీ నాయకులు టికెట్‌కు రూ.25 చెల్లింపుపై అభ్యంతరాలు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల ఓట్ల కోసం చంద్రబాబు పెంచిన ఈ ధర వల్ల, ఆలయాల ఆదాయానికి గండి పడటమే కాకుండా, భక్తుల జేబులకు చిల్లు పడనుంది. -
చంద్రబాబు జులుంపై ‘నాయీ’ల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తమ కులస్తులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులుం పదర్శించడాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధుల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. మొదటి నుంచి తమ పట్ల చంద్రబాబు వివక్ష చూపుతున్నారని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక అధ్యక్షుడు ఎం. లింగం ఆరోపించారు. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే చంద్రబాబును కోరినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఉద్యోగాలు ఎక్కడున్నాయ్ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇదే మాట చెబుతూ వస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో నాయీ బ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెల్పుతున్నామని ప్రకటించారు. తమ వారికి సంఘీబావంగా అవసరమైతే తెలంగాణలోనూ కళ్యాణ కట్టలను బంద్ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలోనూ ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు గుండాగిరి
-
నడిరోడ్డుపై చంద్రబాబు గూండాగిరి
సాక్షి, అమరావతి: ఆకలితో అలమటిస్తూ కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. ఏం చేస్తారో చూస్తామంటూ సచివాలయం సాక్షిగా బెదిరింపులకు దిగారు. మిమ్మల్ని ఎవరు ఇక్కడకు రానిచ్చారంటూ హుంకరించారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై నోరు పారేసుకున్నారు. నాకే ఎదురు చెప్తారా అంటూ రంకెలు వేశారు. ‘నచ్చితే చెయ్యండి లేకుంటే వెళ్లిపోండి’... తమ డిమాండ్లను పరిష్కరించమని అడిగిన నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానం ఇది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో జరిపిన చర్చలు విఫలం కావడంలో సచివాలయంలో సీఎం కాన్వాయ్‌ను నాయీ బ్రాహ్మణులు అడ్డుకున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి మాత్రం బెదిరింపు ధోరణితో మాట్లాడారు. కనీస వేతనం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. జీతాలు పేంచేది లేదని, ముందు విధుల్లో చేరాలని గర్జించారు. కేశఖండనకు రూ. 25 రూపాయలు ఇస్తామని చెప్పారు. సీఎం ప్రతిపాదనను క్షురకులు వ్యతిరేకించారు. దీంతో తమాషాలు చేస్తున్నారా అంటూ వేలు చూపించి చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై నాయీ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇచ్చేంత వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేం: కేఈ దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేమని అలాగే కన్సాలిడేటెడ్ పే ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. టిక్కెట్‌పై 25 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దీంతో నెలకు ప్రతి క్షురకుడికి రూ. 25 వేలు వచ్చే అవకాశం ఉందని లెక్కలు చెప్పారు. 25 రూపాయలకు అంగీకరించిన వారు ఎంతమంది వస్తే అంతమందితో పని చేయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ భారాన్ని దేవాలయాలే భరిస్తాయన్నారు. సమ్మె విరమించి భక్తుల మనోభావాలను కాపాడేలా నాయీ బ్రాహ్మణులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: కన్నా నాయీ బ్రాహ్మణుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడి వద్ద నాయీ బ్రాహ్మణుల నిరసన దీక్షలను సందర్శించి ఆయన సంఘీభావం తెలిపారు. నాయీ బ్రాహ్మణుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. -
కేఈతో క్షురకుల చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈలోగా ఆలయాల్లో సమ్మె విరమించాలని క్షురకులను ఆయన కోరగా, సీఎం తమ డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయీ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట తపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్ చేపట్టాలని నాయీ బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలతో పాటు, బార్బర్ షాపులు కూడా బంద్ పాటించాలని సూచించాయి. ఆలయాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి క్షురకులు ఆందోళన చేస్తున్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. -
కత్తి పక్కన పెట్టారు
సాక్షి, శ్రీశైలం టెంపుల్ : శ్రీశైలం దేవస్థాంనంలో క్షురకులు శుక్రవారం విధులు బహిష్కరించి నల్లబ్యాడ్జీలతో పాతాళగంగ దారిలో ఉన్న కేశఖండనశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళ్యాణ కట్ట సంఘం అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్ర దేవాలయాల కేశఖండనశాల జేఏసీ పిలుపు మేరకు ధర్నా చేశామన్నారు. ఈనెల 1న విజయవాడకు చెందిన ఓలేటి రాఘవులు కేశఖండన చేసిన అనంతరం ఓ భక్తుడి నుంచి రూ.10 తీసుకున్నందుకు ధర్మకర్తల మండలి సభ్యుడు పెంచలయ్య దుర్భాషలాడుతూ దాడి చేయడానికి నిరసనగా విధులు బహిష్కరించామన్నారు. అలాగే తమకు నెలకు రూ.15వేలు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరగా పరిష్కరిస్తామని చెప్పిన విజయవాడ ధర్మకర్త మండలి అధ్యక్షుడు గౌరంగ బాబు, ఎంఎల్సీ బుద్దా వెంకన్న నెరవేర్చకపోవడం దారుణమన్నారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 14వ తేదీ వరకు గడువు ఇచ్చినా పాలకుల్లో చలనం లేకపోవడంతో కత్తి పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు. శ్రీశైల దేవస్థానాన్ని నమ్ముకొని ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని వాపోయారు. క్షేత్రంలో పనిచేసే క్షురకులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే క్షురకుల సంక్షేమ నిధి నుంచి సహాయం చేస్తామని అధికారులు చెప్పినా అమలు కావడం లేదని వాపోయారు. కళ్యాణకట్టలో పనిచేసే చెన్నయ్యకు కొన్ని రోజుల క్రితం కాలు విరిగిపోయినా నేటి వరకు సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
అన్ని ఆలయాల్లో క్షురకుల ధర్నాలు
-
‘తలనీలాలు’ బంద్
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులు తమ డిమాండ్ల సాధన కోసం శుక్రవారం ఆందోళనకు దిగారు. తిరుపతి మినహా అన్ని ప్రధాన ఆలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచి ‘కత్తి డౌన్’ నిరసన చేపట్టారు. దేవాలయాల్లో కేశఖండనశాలల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణలకు కనీసవేతనం రూ.15 వేలు ఇచ్చి తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. విజయవాడ దుర్గగుడిలో కురక్షుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న క్షురకులు.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈరోజు విధులను బహిష్కరించారు. సింహాచలం, శ్రీశైలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కాణిపాకం, ప్రెనుగంచిప్రాలు తదితర ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులు ఆందోళనకు దిగడంతో కేశఖండనశాలలు బోసిబోయాయి. తలనీలాలు సమర్పించేందుకు వస్తున్న భక్తులు వెనుదిరిగాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. రేపటి నుంచి తిరుమలలోనూ కేశఖండన నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దవటం యానాదయ్య తెలిపారు. విజయవాడ దుర్గగుడిలో నాయీ బ్రాహ్మణుల ఆందోళన తెలంగాణ ఐక్య వేదిక మద్దతు ఆంధ్రప్రదేశ్‌లో క్షురకుల ఆందోళనకు తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక మద్దతు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పర్మినెంట్ చేయాలని ఐక్యవేదిక అధ్యక్షుడు యం. లింగం నాయీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బెజవాడ కనకదుర్గ దేవస్థానంలో క్షురకుల ఆందోళన
-
కొండంత భరోసా
అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమపై కురిపించిన వరాలకు నాయీ బ్రాహ్మణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా కల్వపూడి అగ్రహారం సమీపంలో ఇటీవల జరిగిన రాష్ట్ర నాయీ బ్రహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ ఉచిత విద్యుత్, ఆర్థిక సాయం హామీలు ఇచ్చారు. సెలూన్ల నిర్వహణకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ లేదా ఏడాదికి రూ.10 వేలు సాయం చేస్తానని, ఆలయాల్లో పనిచేస్తున్న నాయీబ్రహ్మణులకు పాలక మండళ్లల్లో చోటు కల్పిస్తానని హామీ ఇచ్చారు. చట్టసభల్లోనూ కూడా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఈ హామీలు తమకు కొండంత భరోసా ఇచ్చాయని నాయీబ్రాహ్మణులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఆనందంగా ఉంది క్షౌరవృత్తిదారుల సమస్యలను పరిష్కరించే దిశగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌హన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అభినందనీయం. ఆయన అధికారంలోకి రాగానే క్షౌర శాలలకు 250 యూనిట్ల విద్యుత్ వరకు ఉచితంగా అందిస్తామని హామీ ఇవ్వడంతో ఆనందంగా ఉంది. సెలూన్లకు 500 యూనిట్ల వరకు కమర్షియల్ కాకుండా, గృహాలతో సమానంగా చార్జీలు అమలు చేస్తే మా కులస్తులకు ఎంతో మేలు కలుగుతుంది. – వై.కిషోర్‌బాబు,క్షౌరవృత్తిదారుల సంఘం జిల్లా మాజీ కార్యదర్శి, రేపల్లె విద్యుత్ భారం తగ్గుతుంది ప్రస్తుతం సెలూన్లలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకంతో విద్యుత్ వినియోగం పెరిగింది. కరెంటు బిల్లులు వేల రూపాయల్లో వస్తున్నాయి. దీంతో షాపుల అద్దెలు చెల్లించలేక పోతున్నాం. కరెంటు బిల్లు కెటగిరీ–2లో ఇవ్వడం వల్ల రెట్టింపుకట్టాల్సి వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మమ్ములను గుర్తించి 250 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇస్తామనడం సంతోషంగా ఉంది. విద్యుత్ భారం తగ్గుతుంది. –ముక్యాని రామయ్య, సెలూన్ నిర్వాహకుడు, వినుకొండ సాహసోపేత నిర్ణయం మాకు ప్రస్తుతం ఉన్న నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మా కులస్తులు ఎంతో మంది షాపులను ఏర్పాటు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలను అందిస్తే స్వంతగా షాపులను ఏర్పాటు చేసుకోని కులవృత్తితో హాయిగా జీవిస్తారు. – కంభంపాటి శ్రీనివాసరావు,నాయీబ్రాహ్మణుడు, సత్తెనపల్లి ఇన్నాళ్లకు గుర్తింపు ఇన్నాళ్లకు నాయీ బ్రాహ్మణులకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి వల్ల గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు నాయీ బ్రాహ్మణులను అన్నీ రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నాయి. చట్ట సభల్లో స్థానం కల్పించటంతో పాటు సెలూన్ల నిర్వహణకు చేయూత ఇస్తానంటూ వైఎస్ జగన్ ప్రకటించడం హర్షణీయం. ఆ ప్రకటన అమలు కోసం ఎదురు చూస్తున్నాం. – అట్లూరి ఆంజనేయులు, అధ్యక్షుడు, నాయీ బ్రాహ్మణ సంఘ కోటప్పకొండ అన్నదాన సత్రం -
తిరుమలలో క్షురకుల ఆందోళన
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలోని కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులను తొలగించడం వివాదంగా మారింది. భక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో 240 మంది కాంట్రాక్ట్ క్షురకులను టీటీడీ తొలగించింది. అయితే ఎటువంటి ఫిర్యాదులు రాకపోయినా తమపై చర్య తీసుకున్నారని క్షురకులు వాపోయారు. బుధవారం ఆలయ జేఈవోను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా క్షురకులపై టీటీడీ చర్యలు తీసుకుందని నాయిబ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న క్షురకులకు టీటీడీ ఎటువంటి జీతాలు చెల్లించదని, ప్రతి టిక్కెట్‌పై కొంత మొత్తం మాత్రమే ఇస్తుందని తెలిపారు. అయితే భక్తులు స్వచ్ఛందంగా ఇస్తున్న డబ్బులనే క్షురకులు స్వీకరిస్తున్నారని, ఎటువంటి ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేశారు. చిన్నపిల్లలకు పుట్టెంట్రుకలు తీయించే సమయంలో క్షురకులకు భక్తులు తృణమోఫణమో ఇస్తుంటారని వివరించారు. వీటిని లంచాలుగా చూడటం తగదన్నారు. టీటీడీ తమకు న్యాయం చేస్తున్న నమ్మకంతో క్షురకులు ఉన్నారు. తమ వారికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు నాయిబ్రాహ్మణ సంఘాల నాయకులు వెల్లడించారు. కాగా, కళ్యాణకట్టలో ఇప్పటికే క్షురకుల కొరత ఉండటంతో శ్రీవారికి మొక్కు చెల్లించేంకునేందుకు వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తలనీలాలు ఇచ్చేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కళ్యాణకట్టలో తగిన సంఖ్యలో క్షురకులను నియమించి తమకు ఇక్కట్లు తప్పించాలని టీటీడీని భక్తులు కోరుతున్నారు. -
60 ఏళ్లు దాటితే గుండు గీయొద్దు
మదురై: 60 ఏళ్లు దాటిన క్షురకులు తమిళనాడు దిండిగల్ జిల్లా పళనిలోని దండయుతపాణి దేవాలయంలో భక్తులకు గుండు గీయరాదని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. 60 ఏళ్లు పైబడిన వారికి సహజంగా చేతులు వణుకుతుంటాయని తద్వారా భక్తులకు గాయాలయ్యే అవకాశం ఉన్నందున ఆ దేవాలయంలో ఆ క్షురకులు గుండు గీయరాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. 60 ఏళ్ల పైబడిన క్షురకులు సైతం తమ విధులు నిర్వర్తించవచ్చని ఇటీవల ఆలయం ఈవో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రిటైర్డ్ బార్బర్ కె.కుప్పురాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 65 ఏళ్లు పైబడిన క్షురకులు చేతులు వణుకుతూ భక్తుల చెవులు కోస్తే ఏంటి పరిస్థితి అంటూ జస్టిస్ ఏ సెల్వం, పి కళైయరాజన్ లతో కూడిన బెంచ్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. -
క్షురక క్షుద్బాధ!
- అందని సంక్షేమ పథకాలు - వెక్కిరిస్తున్న పేదరికం - పట్టించుకోని ప్రభుత్వం - అభివృద్ధి దూరంగా నాయీ బ్రాహ్మణులు వెలుగోడు: నాయీబ్రాహ్మణులు..పెళ్లి, పేరంటాలు, పూజా పునస్కారాలు, దినకర్మలు, క్షౌరవృత్తితో పాటు అనేక రకాల పనులు చేయడంలో నేర్పరులు. సమాజానికి ఎంతో మేలు చేసే వీరికి మాత్రం ప్రభుత్వం తగిన చేయూతనివ్వడం లేదు. కులవృత్తుల సంక్షేమ నిధి నుంచి వీరికి సాయం అందడం లేదు. వీరి ఎదుగుదలకు.. డోలు, సన్నాయి లాంటి పరికరాలు ప్రభుత్వం అందించడం లేదు. సబ్సిడీపై రుణాలు కూడా ఇవ్వడం లేదు. వారసత్వంగా వచ్చే శిక్షణతోనే వృత్తి సాగిస్తూ వీరు పస్తులతో కాలం గడపుతున్నారు. జిల్లాలో నాయీ బ్రాహ్మణ కుటుంబాలు 12,000 వరకు ఉన్నాయి. జిల్లాలో 70,000 మంది ఓటర్లు ఉన్నారు. అనేక వృత్తుల వారికి ప్రభుత్వం చేయూత ఇస్తోందని.. తమను మాత్రం గాలికి వదిలేసిందని వీరు ఆరోపిస్తున్నారు. అన్ని వృత్తుల మాదిరి తమనూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వృత్తిలో భాగంగా వీరు అనారోగ్యాలకు గురవుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు పోషించుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం కష్టంగా మారింది. అద్దె చెల్లింపులూ కష్టమే.. ఒకప్పుడు తిండిగింజల కోసం వీరు క్షవరం చేసేవారు. ప్రస్తుతం డబ్బుల కోసం వృత్తి కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. ఏడెనిమిది సంవత్సరాల నుంచి క్షవర వృత్తి కొత్తపుంతలు తొక్కుతోంది. జిల్లాలో 6వేల వరకు మంగలిషాపులు ఉండగా.. వివిధ రకాల కాస్మోటిక్స్‌తో వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఒక షాపు ఏర్పాటు చేయాలంటే కనీసం లక్షన్నర రూపాయల ఖర్చు అవుతోంది. ఇంకా మెరుగైన సౌకర్యాలతో ఏర్పాటు చేయాలంటే రూ.5లక్షలు ఖర్చు అవుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి అద్దె చెల్లించడం కష్టంగా మారింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ కుటుంబాలను పోషించుకోలేని దుర్భర స్థితిలో వీరు ఉన్నారు. అందని ప్రభుత్వ సాయం.. ఎన్టిఆర్ హయాంలో క్షౌర వృత్తిపై పన్ను విధించారు. దీన్ని నిరసిస్తూ అనేక ఆందోళనలు చేపట్టడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కితగ్గింది. తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్షౌర సామగ్రి ఇప్పించారు. ఇది కులవృత్తుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చారు. తరువాత వైఎస్ఆర్.. మంగలిషాపులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చారు. అయితే కిరణ్‌కుమార్ రెడ్డి సర్కార్ దానిని తొలగించింది. ఎన్నో రకాలుగా సేవలు చేసే నాయిబ్రాహ్మణలకు ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదు. ఇవీ డిమాండ్లు – నాయిబ్రాహ్మణులకు ప్రభుత్వం ఇతర కులవృత్తుల మాదిరిగానే అన్ని సౌకర్యాలు కల్పించాలి. – కులవృత్తుల కోటాకింద క్షౌరవృత్తి సామగ్రి అందించాలి. – ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి. – ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూం పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. – వత్తి శిక్షణలో భాగంగా హర్మోనియం, సన్నాయి, డోలు లాంటివి ఉచితంగా ఇప్పించాలి. – ప్రతి గ్రామంలో భవనం నిర్మించి ఇవ్వాలి. మండల కేంద్రంలో ఒక భవనం ఉండాలి. -
పోలీసు స్టేషన్ ముట్టడికి యత్నం
– యువతి కిడ్నాప్ కేసు నీరుగారుస్తున్నారంటూ మహిళల ఆగ్రహం – సుమారు గంటపాటు ఫోర్త్‌టౌన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి కర్నూలు: కల్లూరు ఎస్టేట్ ముజఫర్ నగర్‌కు చెందిన నాయీ బ్రాహ్మణులు పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. ముజఫర్ నగర్లో నివాసం ఉంటున్న మంగళి సరోజమ్మ కుమార్తెను కల్లూరు ఎస్టేట్‌కు చెందిన చిన్నతో పాటు మరో ఇద్దరు యువకులు కలిసి కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఈనెల 20వ తేదీన యువతి తల్లి సరోజమ్మ డయల్ 100కు ఫోన్ చేసి ఎస్పీ ఆకె రవికృష్ణకు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు నాల్గవ పట్టణ సీఐ నాగరాజురావు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతి కిడ్నాప్‌నకు గురై ఆరు రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సరోజమ్మ ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసులకు శాపనార్థాలు పెట్టారు. యువతిని కిడ్నాప్ చేసిన చిన్న తల్లిదండ్రులు శేఖర్, పద్మ, సోదరుడు నరేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్లో కూర్చొబెట్టారు. వారిని విచారిస్తే నిందితులు ఎక్కడున్నారనే విషయం బయటపడుతుందని, పట్టించుకోకుండా పోలీసులు కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ యువతి బంధువులంతా స్టేషన్ ముట్టడికి విఫలయత్నం చేశారు. దాదాపు గంటకుపైగా స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్లోకి చొచ్చుకొని వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయంపై సీఐ నాగరాజురావు మాట్లాడుతూ ఇద్దరు ఎస్ఐల నాయకత్వంలో రెండు బృందాలతో నిందితులను గాలిస్తున్నామని, వారు ఉపయోగిస్తున్న ఫోన్ ఐఎంఈఐ నెంబరు ఆధారంగా కాల్ డేటాను ఆధారంగా త్వరలో అరెస్టు చేస్తామన్నారు.