క్షురక క్షుద్బాధ!
క్షురక క్షుద్బాధ!
Published Tue, Dec 20 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
- అందని సంక్షేమ పథకాలు
- వెక్కిరిస్తున్న పేదరికం
- పట్టించుకోని ప్రభుత్వం
- అభివృద్ధి దూరంగా
నాయీ బ్రాహ్మణులు
వెలుగోడు: నాయీబ్రాహ్మణులు..పెళ్లి, పేరంటాలు, పూజా పునస్కారాలు, దినకర్మలు, క్షౌరవృత్తితో పాటు అనేక రకాల పనులు చేయడంలో నేర్పరులు. సమాజానికి ఎంతో మేలు చేసే వీరికి మాత్రం ప్రభుత్వం తగిన చేయూతనివ్వడం లేదు. కులవృత్తుల సంక్షేమ నిధి నుంచి వీరికి సాయం అందడం లేదు. వీరి ఎదుగుదలకు.. డోలు, సన్నాయి లాంటి పరికరాలు ప్రభుత్వం అందించడం లేదు. సబ్సిడీపై రుణాలు కూడా ఇవ్వడం లేదు. వారసత్వంగా వచ్చే శిక్షణతోనే వృత్తి సాగిస్తూ వీరు పస్తులతో కాలం గడపుతున్నారు.
జిల్లాలో నాయీ బ్రాహ్మణ కుటుంబాలు 12,000 వరకు ఉన్నాయి. జిల్లాలో 70,000 మంది ఓటర్లు ఉన్నారు. అనేక వృత్తుల వారికి ప్రభుత్వం చేయూత ఇస్తోందని.. తమను మాత్రం గాలికి వదిలేసిందని వీరు ఆరోపిస్తున్నారు. అన్ని వృత్తుల మాదిరి తమనూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వృత్తిలో భాగంగా వీరు అనారోగ్యాలకు గురవుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలు పోషించుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం కష్టంగా మారింది.
అద్దె చెల్లింపులూ కష్టమే..
ఒకప్పుడు తిండిగింజల కోసం వీరు క్షవరం చేసేవారు. ప్రస్తుతం డబ్బుల కోసం వృత్తి కొనసాగిస్తూ కుటుంబాలను పోషించుకున్నారు. ఏడెనిమిది సంవత్సరాల నుంచి క్షవర వృత్తి కొత్తపుంతలు తొక్కుతోంది. జిల్లాలో 6వేల వరకు మంగలిషాపులు ఉండగా.. వివిధ రకాల కాస్మోటిక్స్‌తో వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఒక షాపు ఏర్పాటు చేయాలంటే కనీసం లక్షన్నర రూపాయల ఖర్చు అవుతోంది. ఇంకా మెరుగైన సౌకర్యాలతో ఏర్పాటు చేయాలంటే రూ.5లక్షలు ఖర్చు అవుతున్నాయి. ప్రాంతాన్ని బట్టి అద్దె చెల్లించడం కష్టంగా మారింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ కుటుంబాలను పోషించుకోలేని దుర్భర స్థితిలో వీరు ఉన్నారు.
అందని ప్రభుత్వ సాయం..
ఎన్‌టిఆర్ హయాంలో క్షౌర వృత్తిపై పన్ను విధించారు. దీన్ని నిరసిస్తూ అనేక ఆందోళనలు చేపట్టడంతో అప్పటి ప్రభుత్వం వెనక్కితగ్గింది. తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్షౌర సామగ్రి ఇప్పించారు. ఇది కులవృత్తుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చారు. తరువాత వైఎస్‌ఆర్.. మంగలిషాపులకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చారు. అయితే కిరణ్‌కుమార్ రెడ్డి సర్కార్ దానిని తొలగించింది. ఎన్నో రకాలుగా సేవలు చేసే నాయిబ్రాహ్మణలకు ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదు.
ఇవీ డిమాండ్లు
– నాయిబ్రాహ్మణులకు ప్రభుత్వం ఇతర కులవృత్తుల మాదిరిగానే అన్ని సౌకర్యాలు కల్పించాలి.
– కులవృత్తుల కోటాకింద క్షౌరవృత్తి సామగ్రి అందించాలి.
– ఉచిత విద్యుత్ సరఫరా చేయాలి.
– ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్‌రూం పథకం కింద ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
– వత్తి శిక్షణలో భాగంగా హర్మోనియం, సన్నాయి, డోలు లాంటివి ఉచితంగా ఇప్పించాలి.
– ప్రతి గ్రామంలో భవనం నిర్మించి ఇవ్వాలి. మండల కేంద్రంలో ఒక భవనం ఉండాలి.
Advertisement
Advertisement