
సాక్షి, వరదయ్యపాళెం: నాయీ బ్రాహ్మణులు కులవృత్తిని వదులుకోలేక.. ఇతర ఉపాధి పనులు దొరకక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో ఆదాయం లేక.. సాంకేతికతతో పోటీ పడలేక అష్టకష్టాలు పడుతున్నారు. అరకొరగా వచ్చే ఆదాయంతో అద్దెలు చెల్లించలేకపోతున్నారు. ఆధునిక సాంకేతికతతో సెలూన్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థికస్థోమత సరిపోక అవస్థలు పడుతున్నారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్‌లో నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రకటించిన హామీలు ఆ వర్గాల్లో భరోసా కల్పించాయి.
జగనన్నకు రుణపడి ఉంటాం..
జగనన్న మా గురించి ఆలోచించి హామీలు ప్రకటించడం ఆనందంగా ఉంది. బార్బర్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆపైన కూడా కమర్షియల్ చార్జీలు కాకుండా డొమస్టిక్ చార్జీలు మాత్రమే వసూలు చేస్తామని హామీ ఇవ్వడం క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. -అశోక్, బార్బర్ షాపు, వరదయ్యపాళెం
హామీలు చారిత్రాత్మకం..
నాయీ బ్రాహ్మణుల కష్టాలను గుర్తించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉచిత విద్యుత్, కార్పొరేషన్ ఏర్పాటు హామీలు ప్రకటించడం హర్షణీయం. ఇంతవరకు మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక మా సంక్షేమాన్ని విస్మరించారు. కానీ వైఎస్ జగన్ మా సంక్షేమం కోసం ప్రకటించిన హామీలు చారిత్రాత్మకం. – చిన్నా, బార్బర్ షాపు, వరదయ్యపాళెం