పోలీసు స్టేషన్ ముట్టడికి యత్నం
Published Fri, Nov 25 2016 11:49 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
– యువతి కిడ్నాప్ కేసు నీరుగారుస్తున్నారంటూ మహిళల ఆగ్రహం
– సుమారు గంటపాటు ఫోర్త్‌టౌన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి
కర్నూలు: కల్లూరు ఎస్టేట్ ముజఫర్ నగర్‌కు చెందిన నాయీ బ్రాహ్మణులు పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. ముజఫర్ నగర్‌లో నివాసం ఉంటున్న మంగళి సరోజమ్మ కుమార్తెను కల్లూరు ఎస్టేట్‌కు చెందిన చిన్నతో పాటు మరో ఇద్దరు యువకులు కలిసి కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని ఈనెల 20వ తేదీన యువతి తల్లి సరోజమ్మ డయల్ 100కు ఫోన్ చేసి ఎస్పీ ఆకె రవికృష్ణకు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు నాల్గవ పట్టణ సీఐ నాగరాజురావు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతి కిడ్నాప్‌నకు గురై ఆరు రోజులు గడుస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సరోజమ్మ ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసులకు శాపనార్థాలు పెట్టారు. యువతిని కిడ్నాప్ చేసిన చిన్న తల్లిదండ్రులు శేఖర్, పద్మ, సోదరుడు నరేంద్రలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌లో కూర్చొబెట్టారు. వారిని విచారిస్తే నిందితులు ఎక్కడున్నారనే విషయం బయటపడుతుందని, పట్టించుకోకుండా పోలీసులు కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ యువతి బంధువులంతా స్టేషన్ ముట్టడికి విఫలయత్నం చేశారు. దాదాపు గంటకుపైగా స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్‌లోకి చొచ్చుకొని వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఈ విషయంపై సీఐ నాగరాజురావు మాట్లాడుతూ ఇద్దరు ఎస్‌ఐల నాయకత్వంలో రెండు బృందాలతో నిందితులను గాలిస్తున్నామని, వారు ఉపయోగిస్తున్న ఫోన్ ఐఎంఈఐ నెంబరు ఆధారంగా కాల్ డేటాను ఆధారంగా త్వరలో అరెస్టు చేస్తామన్నారు.
Advertisement