ద్వారకాతిరుమల కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకుంటున్న భక్తులు (ఫైల్)
పశ్చిమ గోదావరి, ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో పనిచేసే క్షురకులకు టిక్కెట్టుపై రూ.25 ఆయా దేవస్థానాలు చెల్లించాలంటూ ప్రభుత్వం బుధవారం ఒక మెమో జారీ చేసింది. దీంతో కొన్ని దేవాలయాల్లో పనిచేసే క్షురకులు లాభ పడుతుండగా, మరికొన్ని దేవాలయాల్లో పనిచేసే వారికి నష్టమే మిగలనుంది. దీంతో క్షురకుల్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వీరికి దేవస్థానం ఒక్కో టిక్కెట్టుపై చెల్లించనున్న రూ. 25 పారితోషికాన్ని క్షేత్రాలకు వచ్చే భక్తుల నుంచే వసూలు చేయాలనేది మోమో సారాంశం. దీంతో భక్తులపై అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పెద్ద తిరుపతి తరువాత చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమలలో ఎక్కువగా భక్తులు తలనీలాలను సమర్పిస్తుంటారు. కాబట్టి ఈ క్షేత్రంపైనే అధికంగా ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ద్వారకాతిరుమలలో తలనీలాలు సమర్పించుకునే టికెట్టు విలువ రూ.15 కాగా, ఇందులో రూ.10ని దేవస్థానం క్షురకులకు ఇస్తోంది. తాజా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టికెట్టు ధరను రూ. 25కు పెంచి, ఆ మొత్తాన్ని క్షురకులకు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉంటే గతేడాది ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో 11.28 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఈ టికెట్ల విక్రయం ద్వారా దేవస్థానానికి రూ. 1,69,20,000 రాగా, ఇందులో క్షురకులకు రూ. 1,12,80,000లను చెల్లించారు. మిగిలిన రూ. 56,40,000ల ఆదాయం దేవస్థానానికి సమకూరింది. అయితే రేపోమాపో పెరగనున్న రూ.25 టికెట్ ధరను క్షురకులకే పూర్తిగా ఇవ్వడం వల్ల ఇకపై టికెట్ ఆదాయాన్ని దేవస్థానం కోల్పోనుంది.
అయోమయంలో క్షురక సంఘ నేతలు
దేవాలయాల్లో పనిచేసే క్షురకులు జేఏసీగా ఏర్పడి, తమకు నెలకు రూ.15 వేలు జీతం ఇవ్వడంతో పాటు, ఉద్యోగులకు అందే అన్ని సౌకర్యాలూ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కత్తి డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు వీరికి టికెట్‌పై రూ. 25 చెల్లించాలని దేవాలయాలను ఆదేశించారు. అయితే దీనివల్ల భక్తులు అధికంగా మొక్కులు చెల్లించే ద్వారకాతిరుమల, విజయవాడ ఆలయాల్లో పనిచేసే క్షురకులే ఎక్కువగా లబ్ధిపొందనున్నారు. ఆ తరువాత సింహాచలం, శ్రీశైలం ఆలయాల్లో పనిచేసే క్షురకులు మధ్యస్థంగా లబ్దిపొందుతారు. ఇక అన్నవరం, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేసే క్షురకులు మాత్రం తీవ్రంగా నష్టపోనున్నారు. ఈ కారణంగా జేఏసీ నాయకులు టికెట్‌కు రూ.25 చెల్లింపుపై అభ్యంతరాలు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో నాయీ బ్రాహ్మణుల ఓట్ల కోసం చంద్రబాబు పెంచిన ఈ ధర వల్ల, ఆలయాల ఆదాయానికి గండి పడటమే కాకుండా, భక్తుల జేబులకు చిల్లు పడనుంది.
Comments
Please login to add a commentAdd a comment