క్షురకులతో మాట్లాడుతున్న జేఈవో శ్రీనివాసరాజు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలోని కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులను తొలగించడం వివాదంగా మారింది. భక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో 240 మంది కాంట్రాక్ట్ క్షురకులను టీటీడీ తొలగించింది. అయితే ఎటువంటి ఫిర్యాదులు రాకపోయినా తమపై చర్య తీసుకున్నారని క్షురకులు వాపోయారు. బుధవారం ఆలయ జేఈవోను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా క్షురకులపై టీటీడీ చర్యలు తీసుకుందని నాయిబ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న క్షురకులకు టీటీడీ ఎటువంటి జీతాలు చెల్లించదని, ప్రతి టిక్కెట్‌పై కొంత మొత్తం మాత్రమే ఇస్తుందని తెలిపారు. అయితే భక్తులు స్వచ్ఛందంగా ఇస్తున్న డబ్బులనే క్షురకులు స్వీకరిస్తున్నారని, ఎటువంటి ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేశారు. చిన్నపిల్లలకు పుట్టెంట్రుకలు తీయించే సమయంలో క్షురకులకు భక్తులు తృణమోఫణమో ఇస్తుంటారని వివరించారు. వీటిని లంచాలుగా చూడటం తగదన్నారు. టీటీడీ తమకు న్యాయం చేస్తున్న నమ్మకంతో క్షురకులు ఉన్నారు. తమ వారికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు నాయిబ్రాహ్మణ సంఘాల నాయకులు వెల్లడించారు.
కాగా, కళ్యాణకట్టలో ఇప్పటికే క్షురకుల కొరత ఉండటంతో శ్రీవారికి మొక్కు చెల్లించేంకునేందుకు వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తలనీలాలు ఇచ్చేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కళ్యాణకట్టలో తగిన సంఖ్యలో క్షురకులను నియమించి తమకు ఇక్కట్లు తప్పించాలని టీటీడీని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment