kalyanakatta
-
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్ నిండి క్యూ లైన్ రాంభగీచ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 80,741 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.22 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు బ్రహ్మోత్సవాలకు అందుబాటులో 1,189 మంది క్షురకులు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించనున్న భక్తులకు సత్వర సేవలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా ఆలస్యం లేకుండా 1,189 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో భక్తులకు సేవలందించేలా ఏర్పాట్లు చేసింది. వీరిలో 214 మంది మహిళా క్షురకులు ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించనుండటంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతోపాటు 10 మినీ కల్యాణకట్టలు ఉన్నాయి. ప్రధాన కల్యాణకట్టతోపాటు, పీఏసీ–1, పీఏసీ–2, పీఏసీ–3, శ్రీ వేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద గల మినీ కల్యాణకట్టలు కూడా 24 గంటలు పని చేస్తున్నాయి. జీఎన్సీ, నందకం విశ్రాంతి గృహం, హెచ్వీసీ, కౌస్తుభం, సప్తగిరి విశ్రాంతి గృహం మినీ కల్యాణకట్టలు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. వీటిలో రెగ్యులర్ క్షురకులు 337 మంది, పీస్ రేటు క్షురకులు మరో 852 మంది 3 షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కళ్యాణకట్టల్లో యాత్రికులకు ఉచితంగా కంప్యూటరైజ్డ్ టోకెన్ అందజేస్తారు. -
తిరుమలలో క్షురకుల ఆందోళన
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలోని కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులను తొలగించడం వివాదంగా మారింది. భక్తుల నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో 240 మంది కాంట్రాక్ట్ క్షురకులను టీటీడీ తొలగించింది. అయితే ఎటువంటి ఫిర్యాదులు రాకపోయినా తమపై చర్య తీసుకున్నారని క్షురకులు వాపోయారు. బుధవారం ఆలయ జేఈవోను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా క్షురకులపై టీటీడీ చర్యలు తీసుకుందని నాయిబ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న క్షురకులకు టీటీడీ ఎటువంటి జీతాలు చెల్లించదని, ప్రతి టిక్కెట్‌పై కొంత మొత్తం మాత్రమే ఇస్తుందని తెలిపారు. అయితే భక్తులు స్వచ్ఛందంగా ఇస్తున్న డబ్బులనే క్షురకులు స్వీకరిస్తున్నారని, ఎటువంటి ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేశారు. చిన్నపిల్లలకు పుట్టెంట్రుకలు తీయించే సమయంలో క్షురకులకు భక్తులు తృణమోఫణమో ఇస్తుంటారని వివరించారు. వీటిని లంచాలుగా చూడటం తగదన్నారు. టీటీడీ తమకు న్యాయం చేస్తున్న నమ్మకంతో క్షురకులు ఉన్నారు. తమ వారికి అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు నాయిబ్రాహ్మణ సంఘాల నాయకులు వెల్లడించారు. కాగా, కళ్యాణకట్టలో ఇప్పటికే క్షురకుల కొరత ఉండటంతో శ్రీవారికి మొక్కు చెల్లించేంకునేందుకు వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తలనీలాలు ఇచ్చేందుకు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కళ్యాణకట్టలో తగిన సంఖ్యలో క్షురకులను నియమించి తమకు ఇక్కట్లు తప్పించాలని టీటీడీని భక్తులు కోరుతున్నారు. -
క్షురకుడిపై టీటీడీ అధికారి దాడి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలో పనిచేస్తున్న సురేశ్ బాబు అనే క్షురకుడిపై టీటీడీ అధికారి రామారావు దాడి చేశారు. అక్కడితో ఆగకుండా కులం పేరుతో దూషించారు. దీనిపై బాధితుడు కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో బేబీ సరోజినికి ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన రామారావుపై చర్య తీసుకోవాలని కోరాడు. బాధితుడికి న్యాయం జరగకపోతే ఆందోళన చేపడతామని క్షురకుల సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఈవోకు నివేదిక ఇస్తామని డిప్యూటీ ఈవో తెలిపారు.