తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్ నిండి క్యూ లైన్ రాంభగీచ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 80,741 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.22 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు
బ్రహ్మోత్సవాలకు అందుబాటులో 1,189 మంది క్షురకులు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించనున్న భక్తులకు సత్వర సేవలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా ఆలస్యం లేకుండా 1,189 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో భక్తులకు సేవలందించేలా ఏర్పాట్లు చేసింది.
వీరిలో 214 మంది మహిళా క్షురకులు ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించనుండటంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతోపాటు 10 మినీ కల్యాణకట్టలు ఉన్నాయి. ప్రధాన కల్యాణకట్టతోపాటు, పీఏసీ–1, పీఏసీ–2, పీఏసీ–3, శ్రీ వేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద గల మినీ కల్యాణకట్టలు కూడా 24 గంటలు పని చేస్తున్నాయి.
జీఎన్‌సీ, నందకం విశ్రాంతి గృహం, హెచ్‌వీసీ, కౌస్తుభం, సప్తగిరి విశ్రాంతి గృహం మినీ కల్యాణకట్టలు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. వీటిలో రెగ్యులర్ క్షురకులు 337 మంది, పీస్ రేటు క్షురకులు మరో 852 మంది 3 షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కళ్యాణకట్టల్లో యాత్రికులకు ఉచితంగా కంప్యూటరైజ్డ్ టోకెన్ అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment