నాయీ బ్రాహ్మణులను హెచ్చరిస్తున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆకలితో అలమటిస్తూ కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. ఏం చేస్తారో చూస్తామంటూ సచివాలయం సాక్షిగా బెదిరింపులకు దిగారు. మిమ్మల్ని ఎవరు ఇక్కడకు రానిచ్చారంటూ హుంకరించారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై నోరు పారేసుకున్నారు. నాకే ఎదురు చెప్తారా అంటూ రంకెలు వేశారు.
‘నచ్చితే చెయ్యండి లేకుంటే వెళ్లిపోండి’... తమ డిమాండ్లను పరిష్కరించమని అడిగిన నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానం ఇది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో జరిపిన చర్చలు విఫలం కావడంలో సచివాలయంలో సీఎం కాన్వాయ్‌ను నాయీ బ్రాహ్మణులు అడ్డుకున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి మాత్రం బెదిరింపు ధోరణితో మాట్లాడారు. కనీస వేతనం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. జీతాలు పేంచేది లేదని, ముందు విధుల్లో చేరాలని గర్జించారు. కేశఖండనకు రూ. 25 రూపాయలు ఇస్తామని చెప్పారు. సీఎం ప్రతిపాదనను క్షురకులు వ్యతిరేకించారు. దీంతో తమాషాలు చేస్తున్నారా అంటూ వేలు చూపించి చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై నాయీ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇచ్చేంత వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేం: కేఈ
దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేమని అలాగే కన్సాలిడేటెడ్ పే ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. టిక్కెట్‌పై 25 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దీంతో నెలకు ప్రతి క్షురకుడికి రూ. 25 వేలు వచ్చే అవకాశం ఉందని లెక్కలు చెప్పారు. 25 రూపాయలకు అంగీకరించిన వారు ఎంతమంది వస్తే అంతమందితో పని చేయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ భారాన్ని దేవాలయాలే భరిస్తాయన్నారు. సమ్మె విరమించి భక్తుల మనోభావాలను కాపాడేలా నాయీ బ్రాహ్మణులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: కన్నా
నాయీ బ్రాహ్మణుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడి వద్ద నాయీ బ్రాహ్మణుల నిరసన దీక్షలను సందర్శించి ఆయన సంఘీభావం తెలిపారు. నాయీ బ్రాహ్మణుల పోరాటానికి మద్దతు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment