
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏపీఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసింది. నూతన సంవత్సరం మొదటి రోజు (జనవరి 1) నుంచి ఇది అమల్లోకి వచ్చేలా మంగళవారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై బుధవారం విజయవాడలో ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. కార్మికులంగా హర్షం వ్యక్తం చేశారు. కేట్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమ చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం జగన్‌కి కార్మికులు జేజేలు పలికారు. దశాబ్దాల కల సాకారం చేసి కార్మికుల బతుకులకు భరోసా కల్పించిన సీఎం జగన్ కలకాలం వర్ధిల్లాలని కార్మికులు నినాదాలు చేశారు. వేలాది కుటుంబాల్లో వెలగులు నింపిన సీఎం జగన్‌కి ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. జనవరి ఒకటో తేదీని కార్మికులు ‘ఆర్టీసీ పండుగ’గా అభివర్ణించించారు.
ఈ సంబరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, బొప్పనభవకుమార్ పాల్గొని.. ఆర్టీసీ కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన మాటమీద నిలబడ్డ మడమతిప్పని నేత సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నుంచే ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణయగం మొదలైందని అవినాష్ తెలిపారు. బొప్పన భవకుమార్ మాట్లాడుతూ.. ఏడాది గడవక ముందే ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ సొంతమని కొనియాడారు.