జ్యోతి ప్రజ్వలన చేస్తున్న వీసీ డాక్టర్ బాబ్జి
గుంటూరు మెడికల్: ఆర్థోపెడిక్ వైద్య విభాగంలో పీజీ సీటు తీసుకునేందుకు ఒకప్పుడు వెనకడుగు వేసేవారని నేడు ఆర్థోపెడిక్‌కి డిమాండ్ పెరుగుతోందని డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ కోరుకొండ బాబ్జి చెప్పారు. గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 52వ వార్షిక సదస్సు ప్రారంభమైంది. ఈ నెల 26 వరకు ఈ సదస్సు జరగనుంది.
డాక్టర్ బాబ్జి ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నేడు కొత్తగా 5 వైద్య కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో విజయనగరం వైద్య కళాశాల ప్రారంభించామని, త్వరలోనే మిగతా 4 వైద్య కళాశాలలు ప్రారంభమవుతాయన్నారు. వీసీగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా గుంటూరు సదస్సుకు విచ్చేసిన డాక్టర్ బాబ్జిని సదస్సు నిర్వాహకులు సన్మానించారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి మాట్లాడుతూ నొప్పి నివారణలో ఆర్థోపెడిక్ వైద్యుల పాత్ర ఎంతో కీలకమన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ జాతీయ జనరల్ సెక్రటరీ డాక్టర్ నవీన్ ఠక్కర్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ కోసం ఏపీ నుంచి 134 మంది యువ వైద్యులు దరఖాస్తు చేసుకోవడం సంతోషకరమన్నారు.
గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చాగంటి పద్మావతి దేవి, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీలు డాక్టర్ సూరత్ అమర్‌నా«ధ్, డాక్టర్ యశశ్వి రమణ తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment